Begin typing your search above and press return to search.

విదేశాల నుంచి వచ్చే కొవిడ్ సాయాన్ని అడ్డుకుంటున్న చట్టమేది?

By:  Tupaki Desk   |   20 May 2021 3:30 AM GMT
విదేశాల నుంచి వచ్చే కొవిడ్ సాయాన్ని అడ్డుకుంటున్న చట్టమేది?
X
కరోనా రెండో ప్రభావం తీవ్రంగా ఉన్న భారత్ కు సహాయం చేయడానికి ఎన్జీవోలకు గగనంగా మారిది. భారతీయ చట్టం కారణంగా క్లిష్టమైన నిబంధనలు ఉండి నిధుల పంపిణీలో జాప్యం జరుగుతోందని పలు సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ)లో కేంద్ర ప్రభుత్వం గతేడాది పలు మార్పులు చేసింది. కఠినమైన ఆంక్షలు ప్రతిపాదించింది.

నూతన మార్గదర్శకాలతో పారదర్శకత పెరుగుతుందని కేంద్రం తెలిపింది. నిధుల దుర్వినియోగం తగ్గుతుందని అభిప్రాయపడింది. ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు ఎఫ్సీఆర్ఏ కింద నమోదు చేసుకోవాలని సూచించింది. విదేశాల నుంచి వచ్చిన నిధులు నేరుగా దిల్లీలో ప్రభుత్వం నిర్దేశించిన స్టేట్ బ్యాంక్ లోనే జమచేయాలని ఆదేశించింది. విదేశీ విరాళాలను ప్రభుత్వేతర సంస్థలు ఇతర స్వచ్ఛంద సంస్థలు, గ్రూపులకు విదేశీ సాయాన్ని అందించలేవు.

ఈ చట్టం వల్ల విదేశాల నుంచి వచ్చే కొవిడ్ సాయాన్ని పొందలేకపోతున్నామని పలు ఎన్జీవోలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల ప్రాణాల పట్ల దుర్భరంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. దిల్లీలో ఖాతా తెరవలేకపోయినందున విదేశాల నుంచి వచ్చిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిణీ చేయలేకపోతున్నామని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అంటున్నారు. ఎన్జీవోల సాయం తీసుకోవాడాన్ని ఈ చట్టం నేరం కింద పరిగణిస్తోందని పేర్కొన్నాయి.

ఈ చట్టం వల్ల అనేక స్వచ్ఛంద సంస్థలు సాయం చేయలేకపోతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి గొంతు నొక్కుతోందని ఆరోపించారు. ఎన్జీవో సభ్యుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొంటే ఆ సంస్థ ఎఫ్సీఆర్ఏను రద్దు చేస్తోందని వాపోయారు. విదేశీ సంస్థల మద్దతు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న సంస్థలు పనిచేయడం కష్టమని అంటున్నారు.

ఇలాంటి విపత్కర సమయాల్లోనూ ప్రభుత్వ అజమాయిషి పెరగడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. విదేశాల నుంచి వచ్చే సాయాన్ని ఉపయోగించుకొని ప్రజల ప్రాణాలకు కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే దేశంలో రెండున్నర లక్షల మంది మృతి చెందారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవ పరిస్థితుల్లో అది మరో 30 రెట్లు అధికంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.