Begin typing your search above and press return to search.

జనసేన ఆలోచన స్ధాయి ఇంతేనా ?

By:  Tupaki Desk   |   12 Oct 2021 5:30 PM GMT
జనసేన ఆలోచన స్ధాయి ఇంతేనా ?
X
జనసేన నేతల ఆలోచన స్థాయి మరీ ఇంత తక్కువ స్థాయిలో ఉంటుందని ఎవరు అనుకునుండరు. ‘మా’ ఎన్నికల ఫలితాన్ని అడ్డం పెట్టుకుని జగన్ పై బురద చల్లటానికి జనసేన నేత బొలిశెట్టి సత్య విచిత్రమైన వాదన లేవదీశారు. ఇంతకీ ఆ వాదన ఏమిటయ్యా అంటే తన బంధువైన మంచువిష్ణుని మా ఎన్నికల రంగంలోకి దింపి మెగా ఫ్యామిలీకి చెక్ పెడితే ఆంధ్రా రాజకీయాల్లో తిరుగుండదని జగన్ రెడ్డి భావించారు.

బొలిశెట్టి సత్య పెట్టిన ఈ ట్వీట్ చూస్తే యధారాజా తథా ప్రజా అనే సామెత గుర్తుకొస్తోంది. జగన్ అంటే నిలువెత్తు ద్వేషంతో తమ అధినేత పవన్ కల్యాణ్ ఒకవైపు రగిలిపోతుంటే ఆయన మద్దతుదారులు మాత్రం బ్యాలెన్సుడుగా ఎలా ఆలోచించగలరు ? అసలు మా ఎన్నికలకు, ఎన్నికల్లో మంచు విష్ణు పోటీచేయటానికి జగన్ కు ఏమి సంబంధం ? ఎన్నికల్లో విష్ణు గెలుపుకు జగన్ మెగా ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి ఏమి సంబంధం ?

మెగా ఫ్యామిలీకి జగన్ చెక్ పెట్టడం కోసమే మా ఎన్నికల్లో మంచు విష్ణును గెలిపించుకున్నారా ? బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టడం అంటే ఇదే. మెగా ఫ్యామిలీకి ఆంధ్రా రాజకీయాల్లో చెక్ పెట్టాలంటే జగన్ కు మంచు విష్ణు అవసరమా ? జగన్ స్ధాయి ఏమిటి ? మంచువిష్ణు స్ధాయి ఏమిటి ? తిప్పి కొడితే 900 ఓట్లు కూడా లేని మా ఎన్నికల్లో గెలవటానికి మంచ విష్ణు ఎంత అవస్తలు పడ్డాడో అందరు చూసిందే.

మెగా ఫ్యామిలీ చేసిన తప్పువల్లే విష్ణు ఎన్నికల్లో గెలిచాడనే ప్రచారం బొలిశెట్టికి వినబడలేదా ? 2019 ఎన్నికల్లో జనసేన పోటీచేసిన నియోజకవర్గాల్లో అత్యధిక స్ధానాల్లో కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. రెండుచోట్లా పోటీచేసిన పవన్ ఓడిపోయిన విషయం జనాలకు గుర్తుండే ఉంటుంది. జనసేన డిపాజిట్లు కోల్పోవటానికి, పవన్ రెండు చోట్లా ఓడిపోవటానికి కూడా మంచు విష్ణు సాయాన్నే జగన్ తీసుకున్నారా ?

ఇక్కడ బొలిశెట్టి కామెంట్లు చూసిన తర్వాత విష్ణు స్ధాయిని పెంచుతున్నారా ? లేకపోతే జగన్ స్ధాయిని తగ్గిస్తున్నారా అన్నదే అర్థం కావట్లేదు. ఏదేమైనా జగన్ ను చాలా తక్కువగా చూడటంలోనే పవన్ మొదటి నుంచి తృప్తి పడుతున్నారు. అందుకనే ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డిని తాను గుర్తించడం లేదనే పిచ్చి ప్రకటనను ఒకప్పడు పవన్ చేసిన విషయం తెలిసిందే. అదే దారిలో ఆయన మద్దతుదారులు కూడా నడుస్తున్నట్లుంది. లేకపోతే మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపుకు ఆంధ్రా రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ కి చెక్ పెట్టడానికి ముడేస్తారా ఎవరైనా ?

అసలు ఆంధ్రా రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ పాత్రేమిటి ? చిరంజీవేమో రాజకీయాల్లో ఫెయిల్యూర్ నేతగా ముద్రపడిన వ్యక్తి. ఇక పవన్ స్థాయి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పార్టీ అధినేత గురించి ఇంతకన్నా చెప్పుకునేందుకేమీలేదు. మరో సోదరుడు నాగబాబు నరసాపురం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అంటే హోలు మొత్తం మీద మెగా ఫ్యామిలీ రాజకీయాల్లో ఫెయిలని అర్థమైపోతోంది. ఇంతోటి దానికి మెగా ఫ్యామిలీ గొప్పతనం గురించి సత్య లాంటి నేతలు చెప్పుకోవడమే విచిత్రంగా ఉంది.