Begin typing your search above and press return to search.

బీజేపీ 'వేటు' ఇచ్చిన సంకేతం ఏమిటి?

By:  Tupaki Desk   |   6 Jun 2022 4:43 AM GMT
బీజేపీ వేటు ఇచ్చిన సంకేతం ఏమిటి?
X
హిందుత్వ ఎజెండాతో కొత్త ఓటుబ్యాంకును తయారు చేసుకోవటం సాధ్యమా? అన్న ప్రశ్నకు సమాధానంగా నిలిచింది బీజేపీ. దేశంలోని రాజకీయ పార్టీలు సెక్యులర్ జపాన్ని పఠిస్తున్న వేళ.. మిగిలిన వారికి భిన్నంగా హిందుత్వ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకొని.. వారి గురించి మాట్లాడిన మొదటి పార్టీగా బీజేపీని చెప్పాలి. హిందువుల ఆశలకు ప్రతిరూపంగా.. వారికి రాజకీయ అండగా నిలిచేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారన్న సందేశాన్ని విజయవంతంగా దేశ ప్రజల్లోకి తీసుకెళ్లటంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. నిజంగానే హిందువులకు దన్నుగా బీజేపీ నిలుస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం భిన్నంగా ఉండటం వేరే విషయం.

అయోధ్యలో రాముడి గుడి.. లాంటి ఒకట్రెండు అంశాలు మినహా మిగిలిన వాటి విషయంలో పెద్దగా స్పందించింది లేదు. తాజాగా ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమన్న సందేశాన్ని స్పష్టంగా ఇచ్చిందని చెప్పాలి. మహ్మద్ ప్రవక్తపై నోటికి వచ్చినట్లు మాట్లాడిన ఉదంతంలో తమ నేతలపై వేటు వేస్తూ బీజేపీ సీరియస్ గా స్పందించింది. బీజేపీ నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు దేశంలోనే కాదు ముస్లిం దేశ ప్రభుత్వాలు సైతం స్పందించాయి. భారత రాయబారుల్ని పిలిపించుకొని మరీ నిరసన తెలిపాయి.

ఒక చానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ అభ్యంతరకర వ్యాఖ్య చేశారు. జాతీయ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆమె బాధ్యత లేకుండా నోరు పారేసుకోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు ఊగిపోతున్న ముస్లిం సంఘాలు కొన్ని ఆమె తలకు కోటి రూపాయిల ధరను కూడా కట్టేశాయి.

దేశ వ్యాప్తంగా పలు చోట్ల పోలీస్ స్టేషన్లలో ఆమెపై కంప్లైంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ స్పందించింది. ఆమెపై వేటు వేసిన నిర్ణయాన్ని వెల్లడిస్తూ.. 'మీ అభిప్రాయాలు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే. పార్టీ లోని అన్ని బాధ్యతల నుమచి మిమ్మల్ని తక్షణం తొలగిస్తున్నాం' అని పేర్కొన్నారు.

తమ పార్టీ మహిళా నేత చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకింత ఘాటుగా రియాక్టు అయ్యింది. వేటు వేసేందుకు సైతం ఎందుకు వెనకడుగు వేయలేదంటే.. దానికి అసలు కారణం బీజేపీ అధినాయకత్వంలో వచ్చిన మార్పునేనని చెబుతున్నారు. మరింత కాలం పార్టీ చేతిలో అధికారం ఉండాలంటే కచ్ఛితంగా లౌకిక సూత్రాల్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల ఆమోదం పొందటం తప్పనిసరి. హిందూ ఓటు బ్యాంకు బలంగా ఉన్న పార్టీకి.. మైనార్టీల్లో కొందరు ఈ మధ్యన దగ్గర అవుతున్న వేళ.. అలాంటి వారిని పోగొట్టుకోవటం అంత మంచిది కాదన్న భావన కూడా కారణంగా చెబుతారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో మోడీ తీరుకు.. ప్రధానిగా ఆయన మాటలకు మధ్యనున్న తేడా మాదిరి.. బీజేపీ తీరులోనూ మార్పు వచ్చిందని చెబుతున్నారు. దీనికి తోడు అధికార పార్టీగా వ్యవహరిస్తున్నప్పుడు మత సామరస్యాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించటం హిందువుల్లోని మితవాదుల మనోభావాల్ని దెబ్బ తీస్తుంది. అందుకే.. తోక జాడించిన వారిని.. గీత దాటేటోళ్ల విషయంలో తాము కఠినంగా ఉంటామన్న విషయాన్ని తాజా వేటుతో అందరికి అర్థమయ్యేలా బీజేపీ చేసిందని చెప్పాలి.