Begin typing your search above and press return to search.

అమరావతికి భూములు ఇచ్చిన వారిలో కమ్మవారి శాతమెంత?

By:  Tupaki Desk   |   7 Sep 2022 6:30 AM GMT
అమరావతికి భూములు ఇచ్చిన వారిలో కమ్మవారి శాతమెంత?
X
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి.. అక్కడి పరిస్థితుల గురించి.. ప్రచారంలో ఉన్న వాదనలు.. అసలు వాస్తవాలు ఏమిటి? అన్న దానిపై ప్రముఖ పాత్రికేయుడు కమ్ సామాజికవేత్తగా గుర్తింపు పొందిన కందుల రమేశ్ 'అమరావతి' అన్న పుస్తకాన్ని రాశారు. అందులో అమరావతి మీద ప్రచారంలో ఉండే అంశాలు.. వాటిలోని వాస్తవాలు ఏమిటన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు.. షాకింగ్ నిజాలు పుస్తకంలో ఆయన పేర్కొన్నారు.

అమరావతిలో భూములు ఇచ్చిన వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని.. వారి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేసిందన్న వాదన చాలామంది నోటి నుంచి విని ఉండొచ్చు. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? ఆ కారణంగానే జగన్ సర్కారు వెనక్కి తగ్గి.. అమరావతి స్థానే మూడు రాజధానులుగా విడగొట్టిందన్న ప్రచారానికి సంబంధించి షాకింగ్ నిజాల్ని వెల్లడించారు కందుల రమేశ్. ఆయన తాజా అమరావతిలో ఈ అంశానికి సంబంధించి ఆయన చెప్పిన విషయాల్ని చూస్తే..

రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన వారిలో అత్యధికులు ఎస్సీ.. ఎస్టీలే. రెడ్లు.. కమ్మలు.. బీసీలు.. కాపులు.. మైనార్టీలు తర్వాతి వరుసలో ఉన్నారు. భూసమీకరణలో పాల్గొన్న వారిలో 7 వేల మంది ఎస్సీలే. అమరావతిలో కమ్మవారిదే అన్న ప్రచారం చేసిన వైసీపీ నేతలే కాదు.. ప్రభుత్వం కూడా భూములు ఇచ్చిన వారి సామాజిక నేపథ్య గణాంకాల్ని మాత్రం నో చెప్పలేదంటున్నారు.
రాజధానికి భూములు ఇచ్చిన వారిలో కమ్మవారు మూడోవంతు కూడా లేరని.. 34 వేల ఎకరాలను భూసమీకరణలో ఇవ్వటానికి రైతులు ఒప్పుకుంటే.. అందులో 8-9 వేల ఎకరాలు కమ్మ రైతులకు చెందినవన్నారు. ఒకవేళ తమ ఆర్థిక ప్రయోజనాల కంటే కులాన్నే పరిగణలోకి తీసుకొని భూములు ఇచ్చి ఉంటే.. మిగిలిన 25 వేల ఎకరాల భూముల్ని మిగిలిన వారు ఎందుకు ఇచ్చినట్లు? అన్న ప్రశ్నను తన పుస్తకంలో సంధించారు.

మరో ఆసక్తికకరమైన అంశం ఏమంటే.. అమరావతికి వ్యతిరేకంగా ప్రచారం చేసి.. కోర్టుల్లో కేసులు వేసిన వారికి వైసీపీ ప్రభుత్వం పవర్లోకి వచ్చాక ఉన్నత పదవులు పొందినట్లుగా పేర్కొన్నారు. జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమిస్తే.. ఏబీకే ప్రసాద్ కు 2021లో వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వటం.. మద్యపాన నిషేధ కమిటీ ఛైర్మన్ గా వి.లక్ష్మణరెడ్డిని నియమించటం.. కేబినెట్ ర్యాంకు ఉన్న సీఎం సలహాదారు పదవిని అజేయకల్లంకు ఇవ్వటం దీనికి నిదర్శనమన్న వాదనను తన పుస్తకంలో వినిపించారు.

అమరావతి ముంపు ప్రాంతమని మద్రాసు ఐఐటీ నివేదిక ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఈ వాదనలో ఏ మాత్రం నిజం లేదని.. అయితే జగన్ కు చెందిన మీడియా సంస్థలతో పాటు మరికొన్ని మీడియా సంస్థలు సైతం కొన్ని తప్పుడు కథనాలు వచ్చేలా చేశారన్న ఆరోపణను సదరు రచయిత తన పుస్తకంలో పేర్కొన్నారు.అమరావతి ముంపు ప్రాంతమనే వాదనను ఎన్జీటీ తోసిపుచ్చిందని..2021 జనవరిలో ఐఐటీ మద్రాసు అధ్యనం ప్రకారం అమరావతి ముంపులో ఉందని పేర్కొన్నారు.కానీ.

తాము అలాంటి నివేదిక ఇవ్వలేదని ఐఐటీ మద్రాసు డీన్ డాక్టర్ రవీంద్ర గెట్టు.. ఛైర్ ప్రొఫెసర్ వీఎస్ రాజు స్పష్టం చేసిన వైనాన్ని పుస్తకంలో పేర్కొన్నారు. సంచలన అంశాలెన్నో సాక్ష్యాల రూపంలో చూపించి మరీ రాసిన ఈ పుస్తకం రానున్న రోజుల్లో రాజకీయ సంచలనాలకు కారణమవుతుందన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.