Begin typing your search above and press return to search.

పీయార్సీ లెక్క ఏంటి...ఇష్టం వచ్చినట్లు చేయడమేనా...?

By:  Tupaki Desk   |   29 Jan 2022 10:33 AM GMT
పీయార్సీ లెక్క ఏంటి...ఇష్టం వచ్చినట్లు చేయడమేనా...?
X
ప్రభుత్వం మీద ఉద్యోగ సంఘాల ఆగ్రహం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వం తమ సుదీర్ఘమైన ప్రయోజనాలతో చెలగాటం ఆడుతోంది అని వారు అంటున్నారు. తాము అనేక దఫాలుగా చర్చలకు వెళ్ళినా ఏ విషయం తేల్చకుండా మోసం చేశారని, ఇపుడు తమకు ఇష్టం వచ్చినట్లుగా పీయార్సీని ప్రకటించి ఉద్యోగుల మీద నిందలు వేయడమేంటి అని మండిపడుతున్నారు.

కొత్త పీయార్సీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇక నెల్లూరులో పీయార్సీ సాధన కమిటీ నేత బండి శ్రీనివాసరావు గర్జిస్తే విశాఖలో మరో నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు సర్కార్ తీరు మీద విరుచుకుపడ్డారు. బండి శ్రీనివాసరావు అయితే పీయార్సీ లెక్క ఏంటో చెప్పగలరా అని సర్కార్ పెద్దలను నిలదీశారు.

అసకు మీరు ఏ లెక్క ప్రకారం పీయార్సీని ఇచ్చారో చెప్పండి అని కూడా ప్రశ్నించారు. ఫిట్మెంట్ ఇంత దారుణంగా తగ్గిస్తారు అని అనుకోలేదని అన్నారు. అదే టైమ్ లో హెచ్ ఆర్ ఏ విషయంలో దారుణంగా అన్యాయమే చేశారు అని ఆగ్రహించారు. ఒకటి రెండు సార్లు కాదు పన్నెండు సార్లు చర్చలకు వెళ్లామని, మీరు అక్కడ తేల్చింది ఏంటి అని కూడా బండి నిగ్గదీస్తున్నారు.

ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాట మీద నిలబడకుండా వ్యవహరించారని ఆయన విమర్శించారు. తక్షణం పీయార్సీ మీద జారీ చేసిన జీవోలు అన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక విశాఖలో బొప్పరాజు అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద నిప్పులే చెరిగారు.

పీయార్సీ పేరిట ఫిట్మెంట్ మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రకటించడం తగునా అని ఆయన ఆవేశం వెళ్లగక్కారు. మీకు తోచిన ఫిట్మెంట్ ప్రకటించి మేము ఒప్పుకున్నామని ప్రచారం చేస్తున్నారు, ఇదెక్కడి అన్యాయమండీ అని వాపోయారు. గత మూడేళ్ళుగా ప్రభుత్వం తమను మోసం చేస్తూనే ఉందని కూడా బొప్పరాజు హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

మరో వైపు చూస్తే విజయవాడ ధర్నా చౌక్ రిలే నిరాహార దీక్షల వద్ద కూడా పీయార్సీ సాధన సమితి నేతలు ప్రభుత్వాన్ని తూర్పారా పట్టారు. చర్చలు అంటూ కాలయాపన చేస్తున్నారు కానీ ముందు జీవోలు వెనక్కి తీసుకోండి మహా ప్రభో అని సూచించారు. మొత్తానికి చూసుకుంటే ఉద్యోగ సంఘాల నేతలు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారనే చెప్పాలి. పదమూడు జిల్లాల్లో నేతలు తిరుగుతూ ఆందోళన మరింత ముమ్మరం అయ్యేలా చూస్తున్నారు