Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌కు సీఎం అయ్యే ఛాన్స్ లేదా? ర‌త్న ప్ర‌భ కామెంట్ల వెనుక రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   3 April 2021 9:37 AM GMT
ప‌వ‌న్‌కు సీఎం అయ్యే ఛాన్స్ లేదా?  ర‌త్న ప్ర‌భ కామెంట్ల వెనుక రీజ‌నేంటి?
X
తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన మాజీ ఐఏఎస్ అధికారి ర‌త్న‌ప్ర‌భ‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నామినేష‌న్ వేయ‌డానికి ముందు.. త‌ర్వాత కూడా ఆమె త‌న వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారు. నామినేష‌న్‌కు ముందు నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో.. వైసీపీ స‌ర్కారు మంచి చేస్తుంటే.. పొగ‌డ‌డంలో త‌ప్పేముంద‌ని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క‌సారిగా.. రాజ‌కీయం వేడెక్కింది. గ‌తంలో తాను వైసీపీ స‌ర్కారు చేసిన మంచి ప‌నుల‌ను ప్ర‌శంసిస్తూ.. ట్విట్ట‌ర్‌లో పోస్టులు పెట్టిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని అంగీక‌రించిన ఆమె.. అలా చేయ‌డం త‌ప్పుకాద‌ని స‌మ‌ర్ధించుకున్నారు.

దీంతో బీజేపీ వైఖ‌రిపై స‌ర్వ‌త్రా సందేహ‌పు మేఘాలు ముసురుకున్నాయి. ఒక‌వైపు ప్ర‌భుత్వంపై పోరాటం అంటూనే.. మ‌రోవైపు.. తెర‌చాటుగా స‌ర్కారుకు ఆమె స‌హ‌కారం చేస్తున్నారా? లేక‌.. జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నారా? అనే వ్యాఖ్య‌లు వినిపించాయి. ఇక‌, ఇప్పుడు తాజాగా కూడా ర‌త్న‌ప్ర‌భ అవే వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ-జ‌న‌సేన కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని.. అప్పుడు సీఎం అయ్యేది ప‌వ‌నేన‌ని వ్యాఖ్యానించారు. దీంతో ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఊరికేనే సోము అంటారా? అనే చ‌ర్చ కూడా న‌డిచింది. పోనీలే.. తిరుప‌తి పార్ల‌మెంటు సీటు ద‌క్క‌పోయినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మా నాయ‌కుడు సీఎం అవుతారు! అని జ‌న‌సేన నేత‌లు మురిసిపోయారు.

అయితే.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓ ఆంగ్ల మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ర‌త్న ప్ర‌భ‌.. విలేక‌రి అడిగిన ఇదే ప్ర‌శ్న‌కు చిత్ర‌మైన స‌మాధానం చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ సీఎం అభ్య‌ర్థి అని వీర్రాజు చేసిన ప్ర‌క‌ట‌న‌ను విలేక‌రి ప్ర‌స్తావిచంగా.. ఆ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని.. ప‌వ‌న్‌కు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందా? అని విస్మ‌యం వ్య‌క్తం చేశారు. అంటే.. సోము చేసిన వ్యాఖ్య‌లు ఆమెకు తెలియ‌వ‌ని అనుకోవాలా? లేక‌.. ఉద్దేశ పూర్వ‌కంగానే.. ఆమె అలా వ్యాఖ్యానించార‌ని అనుకోవాలా? అనేది సందేహంగా మారింది. వైసీపీ ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కాల‌ని త‌పిస్తోంది. ఈ క్ర‌మంలో ఆ పార్టీని వెన‌క్కి నెట్టి గెలిచి తీరాల‌ని బీజేపీ ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకుంది.. కానీ, ఇప్పుడు ర‌త్న ప్ర‌భ ఆది నుంచి వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. ఆ పార్టీకి మ‌ద్ద‌తు దారుగా మాట్టాడ‌డం వంటివి జ‌న‌సేన నేత‌ల్లో విస్మ‌యం క‌లిగిస్తున్నాయి.

ఇదే వైఖ‌రి కొన‌సాగితే.. క‌నీసం నోటాకు వ‌చ్చిన ఓట్లు కూడా బీజేపీకి వ‌స్తాయా? అనేది సందేహమే. ఏదేమైనా.. ర‌త్న‌ప్ర‌భ‌ను ఏరికోరి తెచ్చుకోవ‌డం.. ఆవిడ తెర‌చాటుగా జ‌గ‌న్ అనుకూల వైఖ‌రి అవ‌లంబిస్తుండ‌డం వంటివి రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. తిరుప‌తిలో బీజేపీ అభ్య‌ర్థి అంటే.. ఇదే ర‌త్న ప్ర‌భ త‌ర‌ఫున ప‌వ‌న్ ప్ర‌చారానికి వ‌స్తున్న రోజే.. ఆయ‌న‌కు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? అని ర‌త్న ప్ర‌భ‌వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ వ్యాఖ్య‌లు బీజేపీకి ఎలాంటి ఫ‌లితాన్నిస్తాయో.. జ‌న‌సేనలో ఎలాంటి మార్పు తెస్తాయో చూడాలి అంటున్నారు ప‌రిశీల‌కులు.