Begin typing your search above and press return to search.

విరాట్ కోహ్లీ అస్త్రసన్యాసం వెనుక కారణమేంటి?

By:  Tupaki Desk   |   16 Jan 2022 4:14 AM GMT
విరాట్ కోహ్లీ అస్త్రసన్యాసం వెనుక కారణమేంటి?
X
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అస్త్రసన్యాసం చేశాడు. ఇక టీమిండియా టెస్ట్ పగ్గాలు కూడా వదిలేసి ఇక ఆటగాడిగానే కొనసాగాలని డిసైడ్ అయ్యాడు. టీ20 ప్రపంచకప్ ముందర పొట్టి క్రికెట్ కెప్టెన్సీని విరాట్ కోహ్లీ వదిలేశాడు. అనంతరం వన్డే కెప్టెన్సీని విరాట్ నుంచి లాగేసుకుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి.. బీసీసీఐ, దాని అధ్యక్షుడి గంగూలీకి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగి అభిమానులకు షాకిచ్చాడు.

తన ప్రమేయం లేకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడాన్ని ప్రశ్నించిన విరాట్ కోహ్లీ.. పర్యటనకు ముందు విలేకరుల సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బాగా మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. అందుకే తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ బీసీసీఐతోపాటు సహచర ఆటగాళ్లు, అభిమానులకు పెద్ద షాకిచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పెద్ద ప్రకటన రిలీజ్ చేశాడు.

టెస్ట్ కెప్టెన్ గా జట్టును సరైన దిశలో నడిపించడానికి ఏడేళ్ల పాటు నిరంతరం కష్టపడ్డానని కోహ్లీ అన్నాడు. అయితే ప్రతి ప్రయాణం ముగింపు కోరుతుందని.. టెస్ట్ సారథిగా ఇప్పుడు తన ప్రయాణం ఆపాల్సిన అవసరం ఉందని కోహ్లీ తెలిపాడు. తాను ఎప్పుడూ ఏ విషయంలో అయినా నూటికి 120శాతం అంకితభావం చూపించాలని భావిస్తానని.. అలా చేయలేనప్పుడు ఆ బాధ్యతలో కొనసాగడం సరైంది కాదని అనుకుంటానని.. తాను ఏం చేస్తున్నానో పూర్తి స్పష్టత ఉందని.. జట్టు పట్ల నిజాయితీ లేకుండా ఉండలేనని కోహ్లీ అన్నాడు.

ఇంత సుధీర్ఘ కాలం తనను సారథిగా వ్యవహరించే అవకాశం కల్పించిన బీసీసీఐకి, కెప్టెన్ గా తనను నమ్మి బాధ్యతలు అప్పగించిన ధోనికి కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. కోచ్ రవిశాస్త్రితో కలిసి టెస్టుల్లో భారత జట్టును గొప్ప స్థితికి తీసుకెళ్లిన విసయాన్ని విరాట్ గుర్తు చేసుకున్నాడు.

2014 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ధోని మధ్యలో రిటైర్ మెంట్ ప్రకటించగా.. చివరి టెస్టుకు పూర్తి స్థాయి కెప్టెన్ గా విరాట్ బాధ్యతలు అందుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు వన్డే, టీ20 పగ్గాలు కూడా దగ్గాయి. దాదాపు నాలుగేళ్లు మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

మూడు నెలల కింద టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు టీ20 కెప్టెన్సీని స్వచ్ఛందంగా కోహ్లీ వదులుకున్నాడు. గత నెలలో కోహ్లీని వన్డే కెప్టెన్ గా బీసీసీఐ తప్పించి షాకిచ్చింది. వన్డేలు, టీ20లకు వేర్వేరు కెప్టెన్లు ఉండడం సబబు కాదని తెలిపింది. వన్డే పగ్గాలు కూడా రోహిత్ కే అప్పగించింది. ఇది కోహ్లీకి నచ్చక ఓపెన్ గానే అసహనం వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత ఇక టెస్ట్ పగ్గాలు కూడా వదిలేసి షాకిచ్చాడు.