Begin typing your search above and press return to search.

మూడేళ్ల తర్వాత అక్రమాలు బయటపెట్టటం ఏంటి విజయసాయి?

By:  Tupaki Desk   |   9 April 2022 12:30 PM GMT
మూడేళ్ల తర్వాత అక్రమాలు బయటపెట్టటం ఏంటి విజయసాయి?
X
రెండు లైన్ల బుజ్జి ట్వీట్ చదివినంతనే ఒంట్లో వేడి పుట్టి.. నరనరాన సర్రుమనిపించేలా ట్వీట్లు చేసే వైసీపీ ఎంపీ విజయసాయికి ఎప్పుడూ లేనంత ఉక్కపోత ఈసారి ఎదురైందన్న మాట వినిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఆయన ఎంత కఠినంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పవర్ లో లేని నాటి నుంచి చంద్రబాబును.. ఆయన కుమారుడు లోకేశ్ ను ఉద్దేశించి ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తూ ఎన్నెన్ని వ్యాఖ్యలు.. వ్యాఖ్యానాలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవసరానికి తగ్గట్లు పొట్టి పేర్లు పెడుతూ.. ఆయన చేసిన వ్యాఖ్యలకు అప్పటి అధికారపక్షంలో ఉన్న చంద్రబాబు అండ్ కో చిర్రెత్తుకొచ్చినా ఏం చేయలేదు.

కానీ.. సోషల్ మీడియాలో గీత దాటినోళ్లను.. ఒకవేళ దాటకున్నా.. గీత దాటే ప్రయత్నం చేసే వారిని సైతం వదలకుండా కేసులు పెట్టించటంలో ఆయనకున్న పట్టు అంతా ఇంతా కాదనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆయన తాజాగా విపక్షాలు.. తమకు వ్యతిరేకంగా ఉండే మీడియా సంస్థలు రాసే రాతలకు ఉడుక్కుంటున్న వైనం చూస్తే.. కాసింత ఆశ్చర్యం కలుగక మానదు. ఎందుకంటే.. ఏ అక్షరాలతో తన ప్రత్యర్థుల ఇజ్జత్ తీసేసిన విజయసాయి.. అవే అక్షరాలకు ఆయన తల్లడిల్లటం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తటం ఖాయం.

తాజాగా విశాఖలోని మధురవాడలో వందలాది ఎకరాల భూమిని కారుచౌకగా విజయసాయి కొట్టేశారంటూ టీడీపీ నేత పట్టాభి ఆరోపించటం.. దానిపై కథనాలు పెద్ద ఎత్తున వస్తున్న తీరుతో విజయసాయి చాలా డిస్ట్రబ్ గా మారినట్లుగా కనిపిస్తోంది. అందుకేనేమో.. ఆయన మాటల్లో తేడా కొట్టేశాయి. గడిచిన మూడేళ్ల నుంచి అధికారంలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయినట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. కారణం.. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాల్ని బయటపెడతామన్నారు.

అధికారం చేతికి వచ్చినంతనే గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని ఎత్తి చూపటం.. కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి అధికారపార్టీలు ఏవైనా. ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అధినాయకత్వం ఎలాంటి తీరుతో వ్యవహరిస్తుందో అందరికి తెలిసిందే. గడిచిన మూడేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాయి. అలాంటిది.. ఇప్పుడే అధికారంలోకి వచ్చిన చందంగా విజయసాయి మాటలు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

టీడీపీ అక్రమార్కుల మీద చర్యలు తప్పవని.. రెడేల్లలో రూ.10వేల కోట్ల విలువైన భూములు స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించిన ఆయన.. మరి.. దానికి సంబంధించిన కేసుల్లో ఏ నేతను జైలుకు పంపారు? అన్నది కూడా చెబితే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.

టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలను బయటపెడతామని చెబుతున్న విజయసాయి.. గడిచిన మూడేళ్లుగా తమ ప్రభుత్వమే అధికారంలో ఉందన్న విషయాన్ని మర్చిపోయినట్లుగా ఆయన మాటలు ఉండటం గమనార్హం. తన మాటల్ని విన్నంతనే జనాల మదిలో లాజిక్ తన్నుకొస్తుందన్న విషయాన్ని మర్చిపోయి మరీ విజయసాయి మాట్లాడటం చూస్తే.. ఎందుకంత ఫస్ట్రేషన్ అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.