Begin typing your search above and press return to search.

కరోనా తీవ్రతకు ఆ డీఎన్‌ఏ కి మధ్య సంబంధం ఏమిటంటే ?

By:  Tupaki Desk   |   12 Jun 2021 12:30 PM GMT
కరోనా తీవ్రతకు ఆ డీఎన్‌ఏ కి మధ్య సంబంధం ఏమిటంటే ?
X
కరోనా వైరస్ మహమ్మారి బారినపడిన కొందరిలో తీవ్రమైన లక్షణాలు కన్పిస్తున్నాయి , మరికొందరిలో తక్కువ లక్షణాలు కనిపిస్తున్నాయి ఎందుకు , ఈ ప్రశ్నకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సమాధానం కనిపెట్టింది. యూరోపియన్లపై జరిగిన ఓ పరిశోధనలో డీఎన్‌ ఏలోని ఒక భాగానికి, కరోనా తీవ్రతకు, ఆస్పత్రిలో గడిపే అవసరానికి సంబంధం ఉందని తేలింది. ఈ డీఎన్‌ ఏ భాగం 50 శాతం మంది దక్షిణాసియావాసుల్లో ఉండగా, 16 శాతం మంది యూరోపియన్లలో ఉంది. ఈ డీఎన్‌ ఏ భాగం కరోనా బాధితులపై చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేసేందుకు సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తంగరాజ్, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జ్ఞానేశ్వర్‌ చౌబేతో కూడిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు నిర్వహించింది.

యూరోపియన్లలో తీవ్రస్థాయి లక్షణాలకు కారణమవుతున్న కరోనా రూపాంతరితాల ప్రభావం దక్షిణాసియావాసులపై పెద్దగా లేనట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ జర్నల్‌ లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. యూరోపియన్లు, దక్షిణాసియా జన్యు సమాచారం ఆధారంగా ఇరువర్గాల్లోని ఇన్‌ ఫెక్షన్, మరణాల రేటును పోల్చి చూశారు. కరోనా ప్రబలిన కాలంలో మూడుసార్లు ఈ పరిశీలన జరిగింది. భారత్, బంగ్లాదేశ్‌ లోని వారిపై ఎక్కువగా దృష్టి సారించాం అని డాక్టర్‌ తంగరాజ్‌ తెలిపారు. దక్షిణాసియా ప్రజల జన్యుమూలాలు ప్రత్యేకమైనవని ఈ అధ్యయనం మరోసారి రుజువు చేసిందని, దక్షిణాసియా జనాభా మొత్తానికి, కరోనా కు ఉన్న లింకులపై జన్యుక్రమం స్థాయిలో విస్తృత పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనానికి తొలి రచయితగా ఉన్న ప్రజీవల్‌ ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు. బంగ్లాదేశ్‌లో కరోనా వైరస్‌ గిరిజన తెగలపై ఒక రకమైన ప్రభావం చూపితే కొన్ని కులాల ప్రజలపై ఇంకో రకమైన ప్రభావం చూపిందని తమ అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జార్జ్‌ వాన్‌ డ్రీమ్‌ తెలిపారు. జన్యుక్రమం మొదలుకొని రోగ నిరోధక వ్యవస్థ, జీవనశైలి వంటి అనేక అంశాలు కరోనా బారినపడే అవకాశాలపై ప్రభావం చూపుతున్నట్లు తెలిపారు.