Begin typing your search above and press return to search.

తిరుప‌తి టీడీపీలో వ‌ల‌స నేత‌ల క‌ల‌క‌లం..?

By:  Tupaki Desk   |   26 March 2021 5:30 PM GMT
తిరుప‌తి టీడీపీలో వ‌ల‌స నేత‌ల క‌ల‌క‌లం..?
X
తిరుపతి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీడీపీ త‌న శ‌క్తియుక్తులు ప్ర‌యోగించేందుకు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో 2017లో వ‌చ్చిన (అప్ప‌టికి ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వ‌మే ఉంది) నంద్యాల ఉప ఎన్నిక‌లో అనుస‌రించిన వ్యూహాన్నే ఇప్పుడు తిరుప‌తిలోనూ ప్ర‌యోగించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ పార్ల‌మెంటు ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను కీల‌క నేత‌ల‌కు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి స‌మాచారం. గ‌తంలోనూ నంద్యాల అసెంబ్లీ ఉప పోరులో ఇలానే ప‌లువురు నేత‌ల‌కు, మంత్రుల‌కు కూడా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. హోరా హోరీ సాగిన నంద్యాల పోరులో టీడీపీ విజ‌యం సాదించింది.

ఇక‌, ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ బ‌లంగా ఉండ‌డం, ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో తిరుప‌తి కార్పొరేష‌న్‌ను సైతం ద‌క్కించుకోవ‌డం వంటి ప‌రిణామాల‌ను టీడీపీ నేత‌లు నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే మాజీ మంత్రులు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర‌మోమ‌న్‌రెడ్డి, ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి, జ‌వ‌హ‌ర్‌, దేవినేని ఉమా, రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడులు తిరుప‌తికి చేరుకుని పార్టీలో చైత‌న్యం నింపేందుకు కృషి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇటీవ‌ల నియ‌మించిన పార్టీ రాష్ట్ర జంబో క‌మిటీలో అంద‌రికి ఇక్క‌డ బాధ్య‌త‌లు ఇచ్చేశారు. వారి కోసం ఓ వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే.. ఇది విక‌టించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అప్ప‌ట్లో అంటే.. నంద్యాల ఉప పోరులో స్థానిక నాయ‌క‌త్వాన్ని ప‌క్క‌న పెట్టినా.. అప్ప‌ట్లో పార్టీ అధికారంలో ఉంది కాబ‌ట్టి ప‌నిజ‌రిగింది. కానీ, ఇప్పుడు స్థానిక నేత‌ల‌ను దాదాపు ప‌క్క‌న పెట్టి.. నియోజ‌క‌వ‌ర్గం రూపు రేఖ‌లు కూడా తెలియ‌ని వారిని రంగంలోకి దింప‌డాన్ని సీనియ‌ర్లు సైతం త‌ప్పుప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ``స్థానికంగా ఉండే వారు యాక్టివ్‌గా ఉంటే.. బాగుంటుంది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో స్థానిక నేత‌ల‌ను ఎక్కువ‌గా వాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. దీనిపై కూడా మేం స‌మాలోచ‌న‌లు చేస్తున్నాం`` అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. ఈయ‌న ప్ర‌తిపాద‌న ఇప్ప‌టికీ చంద్ర‌బాబుకు చేర‌లేదు.

ఇక ఇప్ప‌టికే ఐదుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి బాధ్య‌త‌లు ఇవ్వ‌డం.. ఆయ‌న కింద గెలిచిన ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌లు ప‌ని చేయాల్సి రావ‌డం కూడా చాలా మందికి న‌చ్చ‌డం లేదు. ఇంకా చెప్పాలంటే సోమిరెడ్డికి టోట‌ల్ ఉప ఎన్నిక బాధ్య‌త‌లు ఇవ్వ‌డం పార్టీ అభ్య‌ర్థి ప‌న‌బాక‌కే న‌చ్చ‌ని ప‌రిస్థితి.

ఈ నేప‌థ్యంలో తిరుప‌తి పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో టీడీపీ వ‌లస నేత‌ల హ‌వా ఏమేర‌కు ఫ‌లితాన్ని ఇస్తుంద‌నేది ఆస‌క్తిగా మార‌డం విశేషం.