Begin typing your search above and press return to search.

మళ్లీ ఎన్డీయేలోకి టీడీపీ? ఈ ప్రచారం వెనుక వ్యూహమేంది?

By:  Tupaki Desk   |   31 Aug 2022 5:01 AM GMT
మళ్లీ ఎన్డీయేలోకి టీడీపీ? ఈ ప్రచారం వెనుక వ్యూహమేంది?
X
మిగిలిన అంశాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ అంశాల మీద విశ్లేషణ చేసేటప్పుడు.. వాటికి సంబంధించిన అంచనాల్ని వెలువరించే ముందు 360 డిగ్రీస్ లో చూడాల్సిన అవసరం ఉంది. వెనుకా ముందు లేకుండా.. అప్పటికప్పుడు అందరి చూపు తమ మీద పడేలా కొన్ని రాజకీయ కథనాలు కొన్ని మీడియా సంస్థలు వండేస్తుంటాయి. కానీ.. పేరు ప్రఖ్యాతులు దండిగా ఉన్న సంస్థలు మాత్రం తొందరపడవు. ఈ కారణంతోనే.. రాజకీయ పరిణామాలకు సంబంధించిన ప్రత్యేక కథనాల విషయంలో మీడియా సంస్థలు మరింత జాగరూకతతో వ్యవహరిస్తాయి. ఎందుకంటే.. ఇలాంటి అంచనాల విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా.. ఆభాసుపాలు కావటం ఖాయం.

తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి నెట్ వర్కు లేకుండా.. కేవలం నామమాత్రంగానే రిపోర్టర్లు ఉన్న జాతీయ ఛానల్ రిపబ్లిక్ టీవీ. అలాంటి ఆ చానల్ తాజాగా ఒక కథనాన్ని వెలువరించింది. దాని సారాంశాన్ని ఒక్క లైనులో చెబితే.. 'ఎన్డీయేలోకి తెలుగుదేశం పార్టీ చేరేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. బీజేపీ సైతం సానుకూలంగా ఉంది' అని. ఈ కథనం.. అందులోని విషయాలు తెలిసినంతనే.. ఒక్కసారి నవ్వు రాక మానదు. అన్నింటికి మించి.. మరో అసందర్భ ప్రేలాపన కూడా ఉంది. అదేమంటే.. తెలంగాణలో తమను తాము అధికారపక్షంగా మారేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. తెలంగాణలో ఇప్పుడు చచ్చిపోయిన పార్టీగా పేరున్న టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని పేర్కొనటం.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన సీట్ల కన్నా తక్కువ రావటానికి కారణం.. టీడీపీతో పొత్తు పెట్టుకోవటం.. తెలంగాణలో పెద్ద ఎత్తున ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రచారం చేయటమే. సొంతంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా సీమాంధ్రకు చెందిన టీడీపీ చేతికి అధికారం ఇవ్వాలా? తెలంగాణ విధానపరమైన నిర్ణయాల్లో చంద్రబాబు జోక్యం అవసరమా? లాంటి క్వశ్చన్లు.. చర్చ మధ్య జరిగిన ఎన్నికల ఫలితం ఎలా ఉందో అందరికి తెలిసిందే.
ఇన్ని చేదు అనుభవాల తర్వాత తెలంగాణలోనూ.. ఏపీలోనూ బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ఆ చానల్ కథనం పేర్కొంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీ కంటే ఎక్కువగా బీజేపీనే రాజకీయ శక్తిగా ఎదుగుతోంది. ఇలాంటి వేళ.. టీడీపీతో కలుస్తుందన్న ప్రచారం మొదలైందంటే.. అపరిపక్వతతో స్టోరీ ప్లే చేయటమన్నా అయి ఉండాలి. లేదంటే బీజేపీని దెబ్బ తీసేందుకు జరుగుతున్న సరికొత్త ప్రయత్నంగా చెప్పక తప్పదు.

నిజానికి మోడీ గురించి తెలిసిన వారెవరూ కూడా బీజేపీ - టీడీపీ మధ్య మైత్రి ఇంత త్వరగా.. ఒక అంచనాకు వచ్చేయరు. ఎందుకంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకే ఎక్కువ నష్టం. అదెలానంటే.. తెలంగాణలో సెంటిమెంట్ రగిలి.. బీజేపీకి దెబ్బేసి.. టీఆర్ఎస్ వైపుకు తరలిపోతారు.

ఇక.. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అక్కడ బీజేపీ బలం నామమాత్రమే. బీజేపీ సొంతంగా గెలిచే స్థానాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. టీడీపీ బలం కలిసిన తర్వాత కూడా గెలుపు కోసం కిందా మీదా పడాల్సి ఉంటుంది.అదే సమయంలో టీడీపీ విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో బీజేపీని.. దాన్ని తన కనుసన్నలతో శాసించే మోడీని చావుతిట్లు తిట్టిన చంద్రబాబు.. ఎన్నికలకు ముందు ఏమైనా పొత్తు పెట్టుకుంటారేమోకానీ.. ఇప్పటికిప్పుడు కూటమితో జట్టు కట్టే ఛాన్సే లేదని చెప్పాలి. అయినప్పటికీ ఆ తరహాలో కథనం రావటం అంటే.. సమ్ థింగ్.. సమ్ థింగ్ ఏమైనా జరగొచ్చన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.