Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ విమాన ప్రమాద మిస్టరీ ఏంటి?

By:  Tupaki Desk   |   9 Jan 2020 4:46 AM GMT
ఉక్రెయిన్ విమాన ప్రమాద మిస్టరీ ఏంటి?
X
ఇరాన్-అమెరికా కొట్లాడుకుంటున్నాయి. దాడులు, ప్రతిదాడులతో అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అలాంటి సమయంలో ఇరాన్ లో ఉక్రెయిన్ కు చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 180మంది అసువులు బాసారు. అయితే ఇప్పటికీ ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియ రాలేదు. యుద్ధోన్మాదంతో ఈ విమానంపై దాడి చేసి కూల్చేశారా అన్నది అనుమానంగా మారింది.

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణమే ఉక్రెయిన్ విమాన ప్రమాదానికి కారణమని ఊహా గానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి బలాన్ని ఇస్తూ కూలిన విమాన బ్లాక్ బాక్స్ ను అమెరికాకు, బోయింగ్ సంస్థకు ఇవ్వడానికి ఇరాన్ నిరాకరించడం అనుమానాలకు తావిస్తోంది.

తమ విమానం కూలిపోవడం వెనుక ఉగ్రదాడి కాదని.. ఇంజిన్ వైఫల్యం అని తొలుత బుకాయించిన ఉక్రెయిన్ ప్రధాని.. తాజాగా ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తమకు తెలియదని స్పష్టత రావడానికి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు..

అయితే బోయింగ్ సంస్థ మాత్రం ఇది కొత్త విమానం అని కూలిపోవడానికి ఆస్కారమే లేదని తెలిపింది. 2016లో తయారు చేశామని.. జనవరి 6న కూడా సాంకేతిక తనిఖీలో లోపాలు లేవని గుర్తించినట్టు తెలిపింది. దీంతో ఈ ప్రమాదానికి ఇరాన్-అమెరికా యుద్ధమే కారణమని.. ఎవరో ఒకరు కూల్చేశారన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఏటీసీ సంబంధాలు కోల్పోయింది. ఈ విమానం కూలిపోయాక కాలిపోయిందని ఇరాన్ తెలిపింది. కానీ లైవ్ వీడియోలో ఈ విమానం మంటల్లో కాలిపోతూనే గాలిలో కనిపించి కూలిపోవడం కనిపించింది.దీన్ని బట్టి ఈ విమానాన్ని కూల్చివేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి.. మరి ఈ రహస్యం తేలాలంటే బ్లాక్ బాక్స్ బయటకు తీయాలి. కానీ ఇరాన్ మాత్రం దాన్ని ఎవ్వరికీ ఇవ్వనని తెలుపడంతో మిస్టరీగా మిగిలిపోతోంది.