Begin typing your search above and press return to search.

కన్న ప్రేమ గొప్పదా పెంచిన ప్రేమ గొప్పదా.. కోర్టు ఇవ్వబోతున్న తీర్పు ఏంటీ

By:  Tupaki Desk   |   21 Nov 2021 2:30 PM GMT
కన్న ప్రేమ గొప్పదా పెంచిన ప్రేమ గొప్పదా.. కోర్టు ఇవ్వబోతున్న తీర్పు ఏంటీ
X
కేరళ నుంచి ఓ చిన్నారి ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నాడు. ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులు ఆ చిన్నారిని త్రివేండ్రం లో దత్తత తీసుకుని ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చారు. సొంత తల్లిదండ్రుల వలే ఆ చిన్నారిని ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నారు. కష్టమనేదే తెలియకుండా ఆ బాలుడిని... సొంత కొడుకులాగా సాకుతున్నారు. అయితే దీనిలో తాజాగా మరో కోణం వెలుగు చూసింది. కేరళలోని త్రివేండ్రం కి చెందిన ఓ మహిళ ఆ పిల్లవాడు తన కొడుకని. బాలుడిని తనకు అప్పగించాలంటూ కేరళ సీఎంకు విన్నవించుకుంది. అంతేకాకుండా ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్ళింది.

నవ మోసాలు మోసి కన్న కొడుకిని... తన దగ్గరకు చేర్చాలంటూ అధికారులను వేడుకుంది. తన తండ్రికి ఇష్టం లేని వివాహాన్ని చేసుకోవడం వల్ల ఆగ్రహానికి గురై... చిన్నారిని తన నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుని తన బిడ్డను తనకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు కేరళ నుంచి ప్రకాశం జిల్లా కు వచ్చారు.

వివరాలపై ఆరా తీసి... దత్తత తీసుకున్న తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు. వారితోపాటు కేరళ లోని పేరూర్ పోలీసులులను కూడా వెంటబెట్టుకుని వచ్చారు. ఆంధ్రప్రదేశ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులతో మాట్లాడారు. పిల్లవాడిని సొంత తల్లికి అప్పగించేలా ఆదేశాలు ఉన్నాయని కేరళ అధికారులు ఆంధ్రప్రదేశ్ అధికారులకు స్పష్టం చేశారు.

అయితే పెంచుకుంటున్న తల్లిదండ్రులు మాత్రం... తమ బిడ్డను దూరం చేయొద్దని వాపోతున్నారు. కంటికి రెప్పలా చూసుకుంటున్న చిన్నారిని దూరం చేసి తమకు అన్యాయం చేయవద్దని అధికారులను కోరుతున్నారు. ఇదిలా ఉంటే బిడ్డకు కేరళ కు చెందిన తల్లికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ టెస్ట్ పూర్తయిన తరువాత తల్లి ఎవరు అనేది తేలితే వారికి అప్పగించాలని భావిస్తున్నారు. లేకపోతే చట్టబద్ధంగా దత్తత తీసుకున్న వారికే బాబుని అప్పజెప్పాలని చూస్తున్నారు. కన్నతల్లిగా భావిస్తున్న కేరళకు చెందిన మహిళపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆమె కన్న తల్లి అయినా కానీ.. నాలుగు రోజుల వయసు ఉన్నా ఆ బాలుడిని ఆమే కావాలని వదిలించుకుని ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె చెబుతున్న విధంగా ఈ కేసులో తన తండ్రి పాత్ర ఏంటి? అనే దానిపై కూడా విచారణ చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం ఆ బాలుడు పేరూర్ పోలీసులు ఆధీనంలోకి ఉన్నాడు. జన్యు పరీక్ష పూర్తయిన తర్వాత ఎవరికి అప్పగించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కేరళకు చెందిన మహిళ తండ్రి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో మహిళ తండ్రి దోషిగా తేలితే అతనికి శిక్ష పడే అవకాశం ఉంది.