Begin typing your search above and press return to search.

500 మంది భారతీయులకు గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏమిటి?

By:  Tupaki Desk   |   28 Nov 2019 6:43 AM GMT
500 మంది భారతీయులకు గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏమిటి?
X
గూగుల్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇవాల్టిరోజున జనజీవితాలతో మమేకమైపోయిన గూగుల్ ఊహించిన రీతిలో విడుదల చేసిన సమాచారం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ యూజర్లలో 12 వేల మందికి వార్నింగ్ లేఖల్ని గూగుల్ పంపింది.

జులై నుంచి సెప్టెంబరు మధ్యలో పంపిన ఈ లేఖల్ని అందుకున్న వారిలో 500 మంది భారతీయులు కూడా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 149 దేశాల్లో 12వేల మంది గూగుల్ యూజర్లకు పంపిన లేఖలు ఇప్పుడు కొత్త కలకలానికి కారణమవుతున్నాయి. ఇంతకీ ఆ లేఖల్లో గూగుల్ చెప్పిదేమంటే?. ప్రభుత్వాల దన్నుతో కొందరి జీ మొయిల్ ఖాతాలోకి జొరబడి పాస్ వర్డ్ లాంటి సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్న వైనాన్ని తాము గుర్తించామన్నారు.

వినియోగదారుల ఖాతాలు.. వాటి పాస్ వర్డ్ లు తస్కరించటం సైబర్ నేరమన్నది అందరికి తెలిసిందే. అయితే.. ఇలాంటి దాడుల్ని ప్రభుత్వ దన్నుతోనే జరగటం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాల్ని గూగుల్ తన బ్లాగ్ లో వెల్లడించింది. ఈ తరహా పనులు భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ జరుగుతుండటం గమనార్హం.

50 దేశాల్లోని సుమారు 270 ప్రభుత్వ మద్దతు ఉన్న గ్రూపులను తమ థ్రెట్ అనాలసిస్ గ్రూపు గుర్తించినట్లుగా గూగుల్ పేర్కొంది. ప్రభుత్వ మద్దతుతో సమాచార చౌర్యం జరిగితే వెంటనే వినియోగదారులను అప్రమత్తం చేయటం తమ విధానమని.. ఇదెంతో కాలంగా తాము చేస్తున్నట్లుగా గూగుల్ చెప్పింది. ఇదే కాకుండా వాట్సాప్ వీడియో కాలింగ్ లోని లోపాన్ని పెగాసస్ సాఫ్ట్ వేర్ సాయంతో పలు దేశాల ప్రభుత్వాలు మానవ హక్కుల కార్యకర్తలు.. పాత్రికేయుల సమాచారాన్ని హ్యాక్ చేస్తున్నారన్న ఆరోపణలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటివేళ.. ఈ వార్తలు రావటం గమనార్హం. మన దేశంలో ఈ తరహా హెచ్చరిక లేఖలు జారీ అయిన 500 మంది ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.