Begin typing your search above and press return to search.

మరోసారి కలకలం రేపిన ‘ది వైర్’ కథనం

By:  Tupaki Desk   |   5 Aug 2021 6:43 AM GMT
మరోసారి కలకలం రేపిన ‘ది వైర్’ కథనం
X
పెగాసస్ స్పై వేర్ వివాదం పుణ్యమా అని పార్లమెంటు విలువైన కాలం కాస్తా వేస్ట్ అయ్యింది. ఉభయ సభల్ని కుదిపేస్తున్న ఈ వివాదం కారణంగా మోడీ సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఆ మాటకు వస్తే.. వారి మధ్య ఐకమత్యానికి కారణంగా మారింది. ది వైర్ పబ్లిష్ చేసిన కథనంతో ఈ సంచలనం హాట్ టాపిక్ గా మారింది. మన దేశానికి చెందిన 300 మందిని లక్ష్యంగా చేసుకొని వారి ఫోన్లపై నిఘా పెట్టినట్లుగా ఆరోపించటం తెలిసిందే. ఇందులో ప్రముఖ నేతలతో పాటు.. కీలక అధికారులు.. జర్నలిస్టులు.. న్యాయవాదులు ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే సదరు జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయన్న విషయాన్ని ది వైర్ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది. అందులో న్యాయ వ్యవస్థకు చెందిన ప్రముఖుల పేర్లు ఉన్నట్లుగా తేల్చారు. తాజాగా పబ్లిష్ చేసిన కథనంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పాత ఫోన్ నంబరు.. మాజీ అటార్నీ జనరల్ సహాయకుడి ఫోన్ నంబరు కూడా నిఘా పెట్టాల్సిన జాబితాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ది వైర్ తాజా కథనాన్ని చూస్తే.. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు ఎన్ కే గాంధీ (ప్రస్తుతం ఆయన రిటైర్ అయి ఉన్నారు).. టీఐ రాజ్ పుత్ ల ఫోన్లను 2019లోనే నిఘా జాబితాలో ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ఇంతకీ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ల ఫోన్లపై నిఘా పెట్టాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నకు ది వైర్ తన సమాధానాన్ని వెల్లడించింది. సుప్రీంకోర్టులో కీలకమైన రిట్ పిటిషన్ల విభాగంలో రిజిస్ట్రార్లు పని చేస్తుంటారు. సంవత్సరానికి దాదాపు వెయ్యికి పైగా రిట్ పిటిషన్లు వస్తుంటాయి. వాటిల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికిగురి చేసేవి.. రాజకీయంగా సున్నితమైన అంశాలు కూడా సదరు పిటిషన్ లో ఉంటాయి కాబట్టి.. అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు కేంద్రం నిఘా పెట్టి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజా జాబితాలో మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వద్ద పని చేసే జూనియర్ న్యాయవాది తంగతురై ఫోన్ నెంబరు కూడా స్నూపింగ్ జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. అటార్నీజనరల్ పదవి నుంచి రోహత్గీ వైదొలిగిన రెండేళ్ల తర్వాత తుంగతురై ఫోన్ నెంబరును హ్యాక్ చేయాల్సిన జాబితాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మోడీ సర్కారుకు రోహత్గీ సన్నిహితులుగా చెబుతారు. అలాంటి ఆయన ఫోన్ నెంబరు కూడా నిఘా జాబితాలో ఎందుకు ఉన్నట్లు? అన్న అనుమానానికి వైర్ చేస్తున్న విశ్లేషణ ఏమంటే.. ‘రోహత్గీ అధికారపక్షానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారు. అందుకే.. ఆయన పేరును కూడా నిఘా జాబితాలో చేర్చి ఉండొచ్చు’ అని పేర్కొంది. మరీ తాజా కథనం మరెన్ని సంచలనాల్ని క్రియేట్ చేస్తుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.