Begin typing your search above and press return to search.

ఆర్టికల్ 371.. అందులో ఏముంది? ఎందుకంత ఆందోళన?

By:  Tupaki Desk   |   8 Aug 2019 1:30 AM GMT
ఆర్టికల్ 371.. అందులో ఏముంది? ఎందుకంత ఆందోళన?
X
జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేయాలన్న మిషన్ ను మోడీ సర్కారు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయటం తెలిసిందే. ఇప్పుడు ఆర్టికల్ 370 స్థానే.. ఆర్టికల్ 371ను తరచూ తెర మీదకు తెస్తున్నారు. ఇదే అంశాన్ని పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఆర్టికల్ 371 మీద అనవసరమైన ఆందోళనలు అస్సలు అక్కర్లేదని.. తాము ఆ అధికరణాన్ని మార్చాలని అనుకోవటం లేదని స్పష్టం చేస్తున్నా.. కొన్ని వర్గాల్లో మాత్రం టెన్షన్ నెలకొని ఉంది. ఇంతకీ ఆర్టికల్ 371లో ఏముంది? నాగాలు ఎందుకంత భయపడుతున్నారు అన్నది చూస్తే..

ఈశాన్య రాష్ట్రాలకు సంబందించి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకమైన హక్కుల్ని కల్పిస్తుంది ఆర్టికల్ 371. ఆర్టికల్ 370 ఎలా అయితే జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తుందో.. అదే రీతిలో ఈశాన్య రాష్ట్రాలైన మిజోరమ్- నాగాలాండ్- మనిపూర్- మేఘాలయ- ఆస్సాంలోని కొన్ని ప్రాంతాలకు ఈ అధికరణ కింద కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఈశాన్య రాష్ట్రాల స్థలాలను కొనుగోలు చేయకుండా అడ్డుకునేవి. వీటితో పాటు కొన్ని ప్రత్యేక రాజకీయపరమైన హక్కులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన చట్టాలు కూడా ఏకరీతిగా లేవు.

ఇదిలా ఉంటే.. ‘ఏ రెడ్‌ అలర్ట్‌ టు ది పీపుల్‌ ఆఫ్‌ నార్త్‌ ఈస్ట్‌’ అంటూ మిజోరం మాజీ ముఖ్యమంత్రి లాల్‌ తన్హావులా సోమవారం సాయంత్రం చేసిన ట్వీట్‌తో కొత్త గుబులు బయల్దేరింది. ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేసినట్లే.. ఆర్టికల్ 371ను కూడా నిర్వీర్యం చేస్తారన్న భయం ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైంది. ఇక్కడి రాష్ట్రాల్లో నాగాలాండ్ ప్రజలు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ప్రత్యేకమైన నాగాలాండ్ దేశం కోసం కొన్ని దశాబ్దాల పాటు సాయుధ పోరాటం జరిపిన నాగాలు.. తర్వాత కేంద్రంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నారు. అప్పటి నుంచి తమ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటివేళ.. కొత్త హక్కుల సంగతి తర్వాత.. ఇప్పటికే ఉన్న హక్కులు రద్దు అవుతాయన్న భయం వారిలో మొదలైంది. అయితే.. నాగాలాండ్ మినహా మిగిలిన రాష్ట్రాల వారికి ఆ భయాలు పెద్దగా కనిపించని పరిస్థితి. మోడీ సర్కారు తమను ఏదో చేయనున్నారన్న భయాందోళనలతో నాగాలకు చెందిన వివిధ వర్గాల వారు ఆందోళనలు షురూ చేస్తున్నారు.

దేశంలోని మైనార్టీలపైన బీజేపీకి ప్రత్యకమైన అభిమానం లేకపోవటంతో పార్లమెంటులో వారికి ఎదురులేకుండా పోతుందని.. దీంతో తొలిసారి కొత్త భయాలు నాగాలకు కలుగుతున్నట్లుగా పలువురు నాగా ఉద్యమకారులు వాపోతున్నారు. అయితే.. వారు ఆందోళన చెందుతున్నట్లుగా మోడీ సర్కారు ఆర్టికల్ 371ను టచ్ చేయాలన్న ఆలోచనలో లేదన్న మాట వినిపిస్తోంది.

ఇక.. నాగాలాండ్ కు వర్తించే ఆర్టికల్ 371ఏ ప్రకారం నాగాల మత.. సామాజిక పరమైన అంశాల్లో భారత పార్లమెంటుకు సంబంధించి ఏ చట్టమూ వర్తించదు. నాగాలాండ్ రాష్ట్రం ప్రత్యేక శాసనం ద్వారా పార్లమెంటు చట్టాలను వర్తింపచేయొచ్చు. మిజోరమ్ కు ఆర్టికల్ 371 జీ కింద సామాజిక.. మత హక్కులు ఉన్నాయి. మణిపూర్ కు వర్తించే ఆర్టికల్ 371 సీ కింద కొండ ప్రాంతాలకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. అయితే.. వీటన్నింటిని టచ్ చేయాలన్న ఆలోచనలో మోడీ సర్కారు లేదన్న మాటను చెబుతున్నారు. కాకుంటే.. అనవసరమైన భయాందోళనలతో ఆందోళనలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.