Begin typing your search above and press return to search.

జంపింగ్ పై గుస్సా..ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన క‌డియం!

By:  Tupaki Desk   |   1 July 2019 9:45 AM GMT
జంపింగ్ పై గుస్సా..ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన క‌డియం!
X
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను తెలంగాణ‌లో బీజేపీ షురూ చేసిన నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ ప‌రిణామాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నాలుగు ఎంపీ స్థానాల్ని చేజిక్కించుకున్న నాటి నుంచి బీజేపీలో కొత్త ఆశ‌లు పుట్టుకొచ్చాయి. తెలంగాణ‌పై తాము స‌రిగా దృష్టి పెట్టాలే కానీ బోలెడంత అవకాశ‌మే కాదు.. అన్ని కుదిరితే అధికారం చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌న్న భావ‌న క‌మ‌ల‌నాథుల్లో అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఇలాంటి వేళ తెలంగాణ అధికార‌ప‌క్షానికి చెందిన ప‌లువురు నేత‌లు క‌మ‌లం గూటికి వెళ‌తార‌న్న మాట వినిపిస్తోంది. ఇలా సాగుతున్న ప్ర‌చారంలో మాజీ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి పేరు తాజాగా చేరింది. ఆయ‌న బీజేపీలోకి వెళ్ల‌నున్న‌ట్లుగా సాగుతున్న ప్ర‌చారంపై కొంద‌రు మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న కాస్తంత ఘాటుగా స‌మాధానం ఇచ్చారు.

ఇటీవ‌ల కాలంలో కడియంపై కేసీఆర్ న‌జ‌ర్ ప‌డ‌టం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో మాదిరి కడియం శ్రీ‌హ‌రికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని.. ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టిన‌ట్లుగా చ‌ర్చ న‌డుస్తోంది. ఇలాంటివేళ‌.. మాట్లాడిన క‌డియం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మీద త‌న‌కున్న క‌మిట్ మెంట్ ఎంత‌న్న విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

తాను పార్టీ మారుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో అర్థం లేద‌ని.. త‌న‌కు అలాంటి ఉద్దేశ‌మే లేద‌ని చెప్పేశారు. ప‌నిలో ప‌నిగా మీడియా మీద కూసింత ఫైర్ అయిన ఆయ‌న‌.. వార్నింగ్ కూడా ఇచ్చేశారు. తాను పార్టీ మారే అవ‌కాశం ఉందంటూ వార్త‌లు ప్ర‌సారం చేస్తే.. అదే మీడియా సంస్థ అయినా స‌రే తాను న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌న్నారు. త‌న‌కు బీజేపీ చేరే ఆలోచ‌న లేద‌న్నారు.

త‌న‌పై త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేసిన వారు త‌క్ష‌ణ‌మే భేష‌ర‌తు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. త‌న‌పై ఇంకెప్పుడు త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చురిస్తే ఊరుకునేది లేద‌న్నారు. తన‌కు ఓటుహ‌క్కు వ‌చ్చిన‌నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ కాంగ్రెస్ కు ఓటు వేయ‌లేద‌న్నారు. మ‌తం ఆధారంగా రాజ‌కీయాలు చేసే బీజేపీలో చేర‌టం త‌న‌కు ఏ మాత్రం ఇష్టం లేద‌న్నారు. కావాల‌నే ఇలాంటి వార్త‌లు పుట్టిస్తున్నార‌న్నారు. కేసీఆర్ వైపు దేశం మొత్తం చూస్తుంద‌ని.. అలాంట‌ప్పుడు తాను బీజేపీ వైపు ఎందుకు చూస్తానంటూ ప్ర‌శ్నించారు.