Begin typing your search above and press return to search.

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆ ప‌ని చేస్తే నారాయ‌ణ‌కేంటో అంత బాధ‌?

By:  Tupaki Desk   |   1 Sep 2022 1:08 PM GMT
జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆ ప‌ని చేస్తే నారాయ‌ణ‌కేంటో అంత బాధ‌?
X
ప్ర‌ముఖ సినీ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఇటీవ‌ల జూనియ‌ర్ ఎన్టీఆర్ కలవడంపై నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, తాత చాలా మంచివారని.. అలాంటి మంచి ఫ్యామిలీ వ్యక్తి.. నెంబర్ 1 క్రిమినల్ అయిన అమిత్ షాను ఎందుకు కలిశారంటూ మండిప‌డ్డారు. అమిత్ షా పిలిచినా జూనియ‌ర్ ఎన్టీఆర్ వెళ్లకుండా ఉండాల్సిందని నారాయణ అంట‌టున్నారు.

హైద‌రాబాద్‌లోని మ‌గ్ధూం భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడిన నారాయ‌ణ తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న బీజేపీ నేత‌లు వ‌రుస‌బెట్టి సినిమా హీరోలను క‌లుస్తున్న అంశంపై ఆయ‌న స్పందించారు. ఇటీవల తెలంగాణలోని మునుగోడుకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైద‌రాబాద్‌లో యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో భేటీ కావడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం రేపిన సంగ‌తి విదిత‌మే.

అమిత్ షా- జూనియ‌ర్ ఎన్టీఆర్ల భేటీపై నారాయ‌ణ‌ తనదైన శైలిలో స్పందించారు. గొప్ప రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కుటుంబానికి చెందిన జూనియ‌ర్ ఎన్టీఆర్ అమిత్ షాను క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ఆయన ప్ర‌శ్నించారు. సినిమా తార‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటున్న బీజేపీ.. వారి ద్వారానే తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చాల‌ని చూస్తోంద‌ని విమ‌ర్శించారు.

మరోవైపు జాతీయ రాజ‌కీయాల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా కూట‌మి క‌డుతున్న టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ చ‌ర్య‌ల‌ను నారాయ‌ణ స్వాగ‌తించ‌డం విశేషం. బీజేపీ వ్య‌తిరేక కూట‌మి ఏర్పాటు దిశ‌గా తాజాగా బీహార్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేసీఆర్.. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌, డిప్యూటీ సీఎం తేజ‌స్వీ యాద‌వ్‌ల‌తో భేటీ అయిన సంగ‌తి విదిత‌మే. ఈ భేటీని కూడా నారాయ‌ణ స్వాగ‌తించారు. ఈ క్రమంలో, వైఎస్సార్సీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కూడా బీజేపీ వ్య‌తిరేక కూట‌మిలో చేర్చుకోవాల‌ని కేసీఆర్‌కు స‌ల‌హా ఇచ్చారు నారాయణ.

అయితే జూనియ‌ర్ ఎన్టీఆర్.. అమిత్ షాను క‌లిస్తే నారాయ‌ణ‌కొచ్చిన నొప్పి ఏమిటని తార‌క్ అభిమానులు, అటు బీజేపీ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నాయి. కంద‌కు లేని దుర‌ద క‌త్తిపీటకు ఎందుక‌ని నిల‌దీస్తున్నాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ - అమిత్ షా భేటీపై టీడీపీనే సైలెంటుగా ఉంద‌ని.. ఈ నేప‌థ్యంలో నారాయ‌ణ‌కు వ‌చ్చిన బాధ ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేడ‌వుట్ అయిపోయిన క‌మ్యూనిస్టు పార్టీలు వాళ్ల వాళ్ల పంచ‌న చేర‌డంలో త‌ప్పు లేన‌ప్పుడు.. ఎవ‌రు ఏ పార్టీలో చేరితే.. ఎవ‌రితో క‌లిస్తే నారాయ‌ణ‌కు బాధ ఏంట‌ని మండిప‌డుతున్నాయి.

అమిత్‌షాను ఎవ‌రు క‌లిసినా త‌ప్పే అన్న‌ట్టు నారాయ‌ణ ధోర‌ణి ఉంద‌ని ఎన్టీఆర్ అభిమానులు, బీజేపీ కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. రాజ‌కీయాల‌తో సంబంధం లేని జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎవ‌ర్ని క‌లిస్తే నారాయ‌ణ‌కు ఏంట‌నే ప్ర‌శ్నలు రేకెత్తుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.