Begin typing your search above and press return to search.

ప‌వన్ ను ఇరికిస్తోన్న ముద్ర‌గ‌డ‌!

By:  Tupaki Desk   |   9 July 2019 9:04 AM GMT
ప‌వన్ ను ఇరికిస్తోన్న ముద్ర‌గ‌డ‌!
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కాపు ఉద్య‌మ నేత క‌మ్ మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం బ‌హిరంగ లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న లేఖ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు రాజ‌కీయవ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌న్న మాట‌తో పాటు.. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌మ‌ను ఎంత దారుణంగా మోసం చేసిన విష‌యాన్ని ముద్ర‌గ‌డ పేర్కొన్నారు. త‌న లేఖ‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ను భ‌లేగా ఇరికించార‌న్న మాట వినిపిస్తోంది.

లేఖ‌లో ఎక్క‌డా కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట కానీ.. జ‌న‌సేన పార్టీ పేరును నేరుగా ప్ర‌స్తావించ‌ని ముద్ర‌గ‌డ‌.. త‌మ జాతి పార్టీగా పేర్కొన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌మ జాతి పార్టీకి కూడా త‌మ జాతి ఓట‌ర్లు ఓట్లు వేయ‌లేద‌ని.. కొన్ని చోట్ల మిన‌హాయించి మిగిలిన అన్నిచోట్ల వైఎస్ జ‌గ‌న్మోన్ కే ఓట్లు వేశార‌ని.. అందుకైనా త‌మ‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని పేర్కొన్నారు.

త‌మ జాతి పార్టీగా ముద్ర‌గ‌డ పేర్కొన్న‌ది జ‌న‌సేన అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన ప్ర‌ధాన పార్టీల్లో ప‌వ‌న్ ఒక్క‌రే కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. త‌న‌కు కులం.. మతం లాంటివి ఉండ‌వ‌ని.. తాను వాటిని న‌మ్మ‌న‌ని త‌ర‌చూ చెప్పే జ‌న‌సేనాధినేత ప‌వ‌న్ తీరుకు భిన్నంగా జ‌న‌సేన పార్టీ కాపుల పార్టీగా అభివ‌ర్ణించ‌టం చూస్తుంటే.. ముద్ర‌గ‌డ తాజా లేఖ రాజ‌కీయ క‌ల‌క‌లానికి తెర తీసిన‌ట్లుగా చెప్పాలి.

జ‌న‌సేన పార్టీతో ఏ మాత్రం సంబంధం లేని విష‌యం తెలిసిందే. క‌నీసం ఆ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం కూడా లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అలాంటిది ముద్ర‌గ‌డ నేరుగా జ‌న‌సేన‌ను ఉద్దేశించి స‌ద‌రు పార్టీ ఫ‌లానా కులానికి చెందిన పార్టీ అని ప‌రోక్షంగా పేర్కొన‌టం ద్వారా ప‌వ‌న్ ను ఇరికించిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. రాజ‌కీయ పార్టీ ఏదైనా స‌రే లోప‌ల ఎలా ఉన్నా.. బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు మాత్రం కులాల‌కు అతీతంగా తాము వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు చెబుతారు. నిజంగా ముద్ర‌గ‌డ‌కు ప‌వ‌న్ క్షేమం.. ఆయ‌న పార్టీ శ్రేయ‌స్సు కోరితే ఇలా కులాల్లో కూరుకుపోయేలా వ్యాఖ్యలు చేయ‌ర‌ని చెబుతున్నారు.

కాపుల‌కు రాజ్యాధికారం ద‌క్కాల‌న్న ఉద్దేశం కించిత్ అయినా ముద్ర‌గ‌డకు ఉండి ఉంటే ఈ త‌ర‌హా మాట‌ల్ని ఆయ‌న ప్ర‌స్తావించేవారు కాదంటున్నారు. నిజానికి ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న తేకుండా కూడా ఆయ‌న లేఖ రాయొచ్చు. త‌మ జాతి.. జాతి అంటూ ముద్ర‌గ‌డ చేసిన వ్యాఖ్య‌ల‌న్ని కూడా ప‌వ‌న్ ను ఫిక్స్ చేసేలా.. ఆయ‌న్ను ఇరుకున ప‌డేసేలా ఉన్నాయే త‌ప్పించి ఆయ‌న‌కు మేలు చేసేట‌ట్లుగా లేదంటున్నారు. ముద్ర‌గ‌డ లేఖ‌పై జ‌న‌సేన రియాక్ట్ అయితే.. అది కూడా ఆ పార్టీకే న‌ష్టం వాటిల్లేలా ముద్ర‌గ‌డ మాట‌లు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఒక‌వేళ‌.. జ‌న‌సేన‌కు చెందిన ఎవ‌రైనా ఒక‌రు బ‌య‌ట‌కొచ్చి ముద్ర‌గ‌డ మాట‌ల్నిఖండించే ప్ర‌య‌త్నం చేస్తే.. కాపు వ్య‌తిరేక ముద్ర వేసేలా ముద్ర‌గ‌డ మైండ్ గేమ్ సెట్ చేశార‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.