Begin typing your search above and press return to search.

కాస్త సింఫుల్ గా.. మరింత క్లారిటీగా.. జమ్ము కశ్మీర్ ను మోడీ మాష్టారేం చేశారు?

By:  Tupaki Desk   |   6 Aug 2019 6:13 AM GMT
కాస్త సింఫుల్ గా.. మరింత క్లారిటీగా.. జమ్ము కశ్మీర్ ను మోడీ మాష్టారేం చేశారు?
X
మీ టీవీలో బోలెడన్ని న్యూస్ ఛానళ్లు వస్తుంటాయి. ఇంటికి నాలుగైదు తెలుగు పేపర్లు తెప్పించుకుంటారు. ఒకవేళ తెప్పించుకోకున్నా.. వెబ్ సైట్లలో చూస్తుంటారనుకుందాం. ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారన్న చందంగా తాజాగా జమ్ముకశ్మీర్ విషయంలో తెలుగు మీడియా వ్యవహరించిన తీరు ఉందని చెప్పాలి. జమ్ముకశ్మీర్ విషయంలో అసలేం జరిగింది? మోడీ మాస్టారు ఏం చేశారు? ఇప్పుడేం జరగనుంది? అన్న మూడు విషయాల్ని సింఫుల్ గా ఫుల్ క్లారిటీతో చెప్పే విషయంలో బొక్క బోర్లా పడ్డాయని చెప్పాలి.

కీలకమైన అంశాల్ని తప్పుగా చెప్పటం.. అసలు జరిగిన దాని కంటే.. కొసరు అంశాలతో నింపేసిన తెలుగు మీడియాను చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. చాలామంది చాలా రాసినా.. ప్రజలకు చేరాల్సిన కీలకమైన సమాచారాన్ని సింఫుల్ గా.. పూర్తి క్లారిటీతో చెప్పాలనే ప్రయత్నమే ఈ కథనంగా చెప్పాలి.
అసలేం జరిగింది?

అప్పుడెప్పుడో జమ్ము కశ్మీర్ భారత్ లో విలీనం అయ్యే క్రమంలో మిగిలిన రాష్ట్రాల మాదిరి కాదు.. ఇస్పెషల్ గా ఉండాలని కశ్మీరీ రాజు కోరుకోవటం. దానికి నెహ్రూ మాష్టారు సరేనని చెప్పేశారు. ఇంట్లో ఉంటే పిల్లల్లో ఒకరు మాత్రం ప్రత్యేకంగా.. మిగిలిన వారంతా ఒక్కటే అంటే వచ్చే తిప్పలే.. కశ్మీర్ తోనూ వచ్చాయి. కశ్మీర్ ఇస్పెషల్ గా ఉండేలా చేసింది ఆర్టికల్ 370.

మర దరిద్రపుగొట్టు రాజకీయాల్లో మరో అంశం ఏమంటే.. మెజార్టీలను లైట్ తీసుకొని.. మైనార్టీలకు మేలు చేస్తున్నామన్న కలర్ ఇవ్వటం దానికి లౌకికవాదంగా అందమైన పేరు పెట్టటం చేశారు. అంతేనా.. కశ్మీర్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుందామన్న ప్రయత్నానికి.. మైనార్టీలకు చేటు చేసినట్లుగా బూచిని చూపించటం ద్వారా.. కశ్మీర్ లో మైనార్టీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దేశంలోని మైనార్టీల ప్రయోజనాల్ని దెబ్బ తీసినట్లుగా ప్రచారం చేసే దుర్మార్గానికి తెర తీశారు. దీంతో.. కశ్మీర్ లోని వాస్తవ పరిస్థితిని చెప్పటం అంటే.. మైనార్టీల ప్రయోజనాల్ని దెబ్బ తీసినట్లుగా భావించేలా పరిస్థితిని తీసుకొచ్చారు.

ఈ కారణంతోనే 1990కు ముందు కశ్మీరీ వ్యాలీలోని లక్షలాది మంది కశ్మీరీ పండిట్లను తన్ని తరిమేసినా.. ప్రధాన మీడియా సంస్థల్లో పని చేసే మైనార్టీ ప్రయోజనాల్ని మాత్రమే కాపాడే సూడో లౌకికవాదుల కారణంగా పెద్దగా ఫోకస్ కాలేదు.

సరే.. మోడీ మాష్టారు ఏం చేశారు?
కశ్మీర్ రాచపుండులా మారి.. తెగ ఇబ్బంది పెట్టేస్తున్న పరిస్థితి. దేశంలో మరెక్కడా లేని రీతిలో కశ్మీర్ లో భారత జాతీయజెండా ఎగరలేని పరిస్థితి. ఎందుకంటే.. ఆర్టికల్ 370లో ఉన్న అంశాల నేపథ్యంలో త్రివర్ణ పతకాన్ని ఎగురవేయలేని దుస్థితి.అంతేనా.. భారతజాతీయ పతాకాన్ని అగౌరవ పర్చినా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఇవన్నీ శాంపిల్ అంశాలు మాత్రమే.

కశ్మీర్ అంశాన్ని లెక్క తేల్చేందుకు వీలుగా మోడీ మాష్టారు భారీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఎవరు వేలెత్తి చూపించలేని రీతిలో.. భవిష్యత్తులు రాజకీయ ఎత్తుగడలు వేయకుండా.. ఒక పరిష్కారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. దీని ప్రకారం జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370లోని అంశాల్ని మార్చేశారు. కశ్మీర్ కు ఏ అధికరణ అయితే.. విశేష అధికారాలు.. ఇస్పెషల్ గా ఉంచుతాయో వాటిని మార్చేశారు. అంటే.. ఆర్టికల్ 370 ఉంటుంది. కానీ.. ఇప్పటివరకూ అందులో ఉన్న కీలకాంశాలేమీ ఉండవు.

ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే.. కోరలున్న పామును చంపేయటం ఒక మార్గం. దాని కోరలు తీసేసి విడిచి పెట్టేయటం మరో పద్దతి. మొదటి దాంతో లాభం తర్వాత.. నష్టం కూడా ఉంటుంది. కానీ.. రెండో తరహాలో ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు. కోరలున్న పాముకు తాను కాటేయటం వల్ల.. చనిపోతారన్న విషయం తెలీదు కదా. మనిషికి ఉన్న మనసు మాదిరి పాముకు కూడా ఉంటే.. అది తన స్వభావాన్ని మార్చుకునే వీలుంటుంది. దానికి ఆ తెలివి లేనప్పుడు.. తెలివైనోడు దాని ప్రాణం తీయకుండా.. దానికారణంగా ఎవరికి ఎలాంటి ప్రమాదం కలుగకుండా చేస్తారు. తాజాగా మోడీ మాష్టారు చేసింది అదే.

సరే.. తాజాగా చేసిన మార్పులతో ఏం జరుగుతుంది?
తాజాగా చేసిన మార్పుల కారణంగా జమ్ముకశ్మీర్ లో ఏం జరగనుందన్నది చాలా ముఖ్యం. పాతవాటిని మార్చేయటం ద్వారా కొత్తగా వచ్చిన మార్పులు ఏమిటి? వాటి కారణంగా ఏం జరుగుతుందన్నది చూస్తే..

1. జమ్ముకశ్మీర్ కు ఇకపై ఎలాంటి ప్రత్యేక అధికారాలు ఉండవు. దీంతో.. దేశంలోని మిగిలిన రాష్ట్రాల మాదిరే ఉంటుంది తప్పించి.. ఇస్పెషల్స్ ఏమీ ఉండవు. మొత్తానికి ఇంత కాలానికి కశ్మీర్ మిగిలిన రాష్ట్రాల మాదిరి మారిందన్న మాట. ఇస్పెషల్ గా చూసే ధోరణి పోవటం వల్ల సదరు రాష్ట్రంలోని కొందరికి మాత్రమే నొప్పి ఉంటుంది తప్పించి.. మిగిలిన వారంతా కూడా హ్యీపీగా ఉండే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే.. ఇస్పెషల్ కారణంగా గడిచిన 70 ఏళ్లలో ఏం జరిగిందో దేశంలోని మిగిలిన వారి కంటే.. వాళ్లకే ఎక్కువ తెలుసు కాబట్టి.

2. నిన్నటి వరకూ ఉన్న ఆర్టికల్ 370 ప్రకారం కశ్మీరీ అమ్మాయి పాకిస్థానీయుడ్ని పెళ్లాడితే.. ఆమెకు ఉండే కశ్మీరీ జాతీయత మిస్ కాదు. అదే భారత అబ్బాయిని పెళ్లాడితే మాత్రం కశ్మీరీ జాతీయత పోయేది. ఈ దరిద్రపు క్లాజ్ ఇకపై పోనుంది. మోడీ ప్రభుత్వం చేసిన మార్పు కారణంగా ఇకపై కశ్మీరీలకు ఒకే జాతీయత ఉంటుంది. జమ్ముకశ్మీర్ అమ్మాయిలు దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల అబ్బాయిలనైనా పెళ్లాడవచ్చు. వారి పౌరసత్వం మిస్ అయ్యే అవకాశమే ఉండదు.

3. ఇతర రాష్ట్రాల వారు జమ్ముకశ్మీర్ లో ఆస్తుల్ని కొనుగోలు చేయొచ్చు. ఇప్పటివరకూ ఉన్న ఆంక్షలు పూర్తిగా కనుమరుగవుతాయి.

4. ఇకపై రాష్ట్ర అసెంబ్లీ ఆరేళ్ల పదవీ కాలం నుంచి ఐదేళ్లకు మారుతుంది. కశ్మీర్ కు ప్రత్యేక జెండా ఉండదు. త్రివర్ణ పతాకమే వారికి ఉంటుంది. దాన్నే ఎగురవేయాలి. దాన్ని అవమానిస్తే.. చట్టపరమైన చర్యలకు అవకాశం కలుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లే కశ్మీర్ లోని పంచాయితీలకు హక్కులు ఉంటాయి. ఉచిత నిర్బంద విద్య ఇకపై అమలవుతుంది.

5. ఆర్థిక అత్యవసర పరిస్థితి.. సమాచారహక్కు చట్టం ఈ రాష్ట్రానికి ఇక వర్తిస్తాయి.