Begin typing your search above and press return to search.

పలు రంగాల్లో న్యూ ఇయర్ లో జరిగే మార్పులేంటి ?

By:  Tupaki Desk   |   31 Dec 2021 8:34 AM GMT
పలు రంగాల్లో న్యూ ఇయర్ లో జరిగే మార్పులేంటి ?
X
తెలుగువారి నూతన సంవత్సరం అంటే ఉగాది. దానినే తొలి పండుగ అంటారు. ఇక గతంలో పనులకు ఆ పండుగనే ప్రామాణికంగా తీసుకునేవారు. ఆ రోజన సంతోషంగా ఉంటే ఏడాది అంతా కూడా ఆనందంగా గడుపుతారనే అభిప్రాయం గలిగేది. రైతులు ఆ పండుగ నాడు వ్యవసాయ పనులను ప్రారంభించేవారు. ఏడాదంతా కూడా సాఫీగా పనులు జరుగుతాయని విశ్వసించేవారు. ఉగాదితో పాటు ఆంగ్ల నూతన సంవత్సరాన్ని కూడా మనం జరుపుకుంటాం. ఇవాళ్టితో పాత క్యాలెండర్ సమయం ముగుస్తుంది. రేపటి నుంచే కొత్త క్యాలెండర్ అవసరం. కాలక్రమేణా ఈ ఇంగ్లీషు పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే ఈ ఆంగ్ల కొత్త సంవత్సరంలో ఏం మార్పులు జరుగుతాయో తెలుసా?

కొత్త ఏడాదిని ప్రామాణికంగా తీసుకొని కొన్ని పథకాలు ప్రవేశపెడుతారు. పన్నుల చెల్లింపుల విషయంలో కూడా పలు మార్పులు జరుగుతాయి. జనవరి 1, 2022 నుంచి జీఎస్టీల్లో సంచలన మార్పులు జరగబోతున్నాయి. మన నిత్యజీవితంలో ఉపయోగించే చెప్పులు, షూలు, వస్త్రాలపై జీఎస్టీ పెరగనుంది. 5 శాతం చెల్లించాల్సిన పన్నును రేపటినుంచి అనగా 2022 జనవరి 1 నుంచి 12 శాతం చెల్లించాల్సి ఉంటుంది. కాటన్ వస్త్రాలకు దీనినుంచి మినహాయింపు ఉంది. అందుకే వస్త్రవ్యాపారులు ఇటీవల చాలామంది అడ్వాన్సు బుకింగ్ చేసుకోవడం గమనార్హం.

కొత్త ఏడాదిలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు జీఎస్టీ చెల్లించాలి. ఇప్పటివరకు వినియోగదారుల నుంచి పన్ను వసూలు చేస్తున్న సంస్థలు వీటిని సరిగా చెల్లించని కారణంగా.... రేపటి నుంచి ఇన్ వాయిస్ నమోదు చేయాల్సిందేనని కేంద్రం ప్రకటించింది. ఫుడ్ డెలివరీ యాగ్రిగేటర్స్ దీనిపై సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల దాదాపు రూ.2000 వేల కోట్ల నష్టం జరిగిందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫలితంగా చిన్న రెస్టారెంట్లపై కాస్త ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆన్ లైన్ రవాణా సంస్థలైన ఊబర్, ఓలా విధానాల్లోనూ మార్పులు జరగబోతున్నాయి. ఆన్ లైన్ రవాణా సంస్థలు కూడా ట్యాక్స్ పే చేయాల్సిఉంటుంది. అయితే ఇది వినియోగదారులకే ఉపయోగం అని నిపుణులు తెలిపారు. దీనివల్ల ఛార్జీలు కాస్త తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు.

జీవిత బీమా సంస్థల ప్రీమియం పెరగనుంది. టర్మ్ ప్రీమియం దాదాపు 30శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. వచ్చే ఆర్థిక ఏడాదిలోపు ఇది అమలు కానుంది. అంతేకాకుండా ఎల్ఐసీ షేర్లు వినియోగదారుల చేతుల్లోకి రాబోతున్నాయి. అందుకే పాన్ నంబర్ ను అనుసంధానం చేసే నిబంధన తీసుకొచ్చారు. వచ్చే ఏడాది జీవిత బీమా సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా షేర్ మార్కెట్ లోకి రాబోతుంది. ఇకపోతే పీఎఫ్ నామినీ వివరాలను ఈ ఏడాది డిసెంబర్ 31లోపు నమోదు చేయాలి. గడువు దాటితే పీఎఫ్ డబ్బులను తీయడానికి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు వెల్లడించారు. యూఏఎన్ అకౌంట్ ద్వారా నామినీ ఆధార్ వివరాలను అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

మన దేశంలో దాదాదపు 5లక్షల క్రెడిట్, డెబిట్ కార్డులు ఈ-కామర్స్ సంస్థల వద్ద నమోదై ఉన్నాయి. వాటి సమాచారాన్ని ఆ సంస్థలు నిల్వ చేసుకునే వీలు లేదు. దీనిని కూడా డిసెంబర్ 31 వరకు చేయాల్సిఉండగా... సంస్థల అభ్యర్థనతో జులై వరకు పొడగించారు. మొదటిసారి ట్రాన్సాక్షన్ అప్పుడే కార్డు నంబర్ ఎంటర్ చేసినప్పుడు రిజిస్టర్ నంబర్ నమోదవుతుంది. ఇలా ప్రతీసారి కార్డు వివరాలు కాకుండా టోకెన్ నంబర్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఏటీఎం ట్రాన్సాక్షన్లపై కూడా అదనపు ఛార్జీలు అమల్లోకి వస్తాయి. లిమిట్ ముగిసిన ట్రాన్సక్షన్ల తర్వాత రూ.21 కట్ అవుతాయి. ఇదివరకు రూ.20 ఉండగా ఈ ఏడాది మరో రూపాయి అదనంగా కట్ అవుతుంది.

ఇకపోతే పింఛన్ దారులు తమ లైఫ్ సర్టిఫికెట్ ను డిసెంబర్ 31లోపు సమర్పించాలి. లేదంటే ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే పింఛన్ ను పొందలేరు. సాంకేతికత పరంగా కూడా చాలా మార్పులు రాబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 13వ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ, ఆగమెంటెడ్ రియాలిటీలో చాలా మార్పులు రాబోతున్నాయి. సాంకేతికతలో ఘననీయమైన మార్పులకు ఆస్కారం ఉంది. ఎంటర్ టైన్ మెంట్ రంగం రీ డీజైన్ కాబోతుంది. ఇకపోతే పూర్తిస్థాయి కృత్రిమ మేథాతో ప్రజల జీవన స్థితిగతులు, ఆరోగ్యం, ఆహారం వంటి వాటిని సైతం ముందుగానే అంచనా వేసే సౌలభ్యం కలుగుతుంది. మెషీన్ లెర్నింగ్ సేవలు పెరుగుతాయి.

ఇకపోతే సైబర్ క్రైం పెరిగే అవకాశం ఉందని.. భద్రతా కొరవడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాంటీ వైరస్ సిస్టమ్ ఉండాలని, కంప్యూటర్లను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఈ విధంగా నూతన సంవత్సరంలో గణనీయమైన మార్పులు జరగబోతున్నాయి. కాబట్టి వచ్చే వెసలుబాట్లు- సవాళ్లను ఎదుర్కొవడానికి సిద్ధం కావాల్సిందే కదా.