Begin typing your search above and press return to search.

పొత్తులపై చంద్రబాబు మనసులో ఏముంది?

By:  Tupaki Desk   |   8 Jun 2022 5:17 AM GMT
పొత్తులపై చంద్రబాబు మనసులో ఏముంది?
X
కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ పొత్తుల గురించి విస్పష్ట ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తమ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని కూడా పవన్ ప్రకటించారు. అందులో ఒకటి.. జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, రెండోది.. జనసేన-బీజేపీ-టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, మూడోది.. ఒంటరిగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం. తద్వారా పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తుల విషయంలో తన మనసులోని మాటను ఎలాంటి దాపరికాలు లేకుండా, ఎలాంటి అస్పష్టతకు తావివ్వకుండా కుండబద్దలు కొట్టేశారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలు, మీడియా సంస్థలు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను విశ్లేషించే పనిలో పడ్డాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల ఉద్దేశం, ఆయన మాటల్లోని అంతరార్థం ఒకటేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి, జగన్ మోహన్ రెడ్డికి ఒక అవకాశమిచ్చారు.. కాబట్టి ఈసారి 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా తనకు కూడా ఒక చాన్సు ఇవ్వాలనేదే పవన్ కల్యాణ్ ఉద్దేశమని చెబుతున్నారు. పవన్ వ్యాఖ్యల్లో నిగూఢార్థం, పరమార్థం ఇదేనని పేర్కొంటున్నారు.

అయితే ఓవైపు పవన్ కల్యాణ్ కు దమ్ముంటే పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలని వైఎస్సార్సీపీ నేతలు సవాళ్లు విసరడం, రంకెలు వేస్తున్నారు. మరోవైపు టీడీపీ కౌంపౌండ్ ప్రస్తుతం సైలెంట్ గా ఉంది. మహానాడు సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న ఆ పార్టీ పవన్ వ్యాఖ్యలపై ఆచితూచి స్పందించాలని యోచిస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మనసులో ఏముంది? అనేది ప్రస్తుతానికి అంతుబట్టడం లేదని అంటున్నారు. గతంలో పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలని వివిధ సందర్భాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు కోరినప్పుడు తమది వన్ సైడ్ లవ్ అని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే.

కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ తన ఉద్దేశమేంటో స్పష్టంగా చెప్పేశారు. పొత్తులపై ఎలాంటి తటపటాయింపులకు, అయోమయానికి లోను కాకుండా విస్పష్ట ప్రకటన ఇచ్చేశారు. మరి పవన్ ఇంత క్లియర్ కట్ గా పొత్తుల గురించి చెప్పినా చంద్రబాబు ఇప్పటివరకు స్పందించకపోవడం ఏంటో రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుబట్టడం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉంద‌ని.. అప్పుడే పొత్తుల వ్యవ‌హారం ఎందుక‌నేది చంద్రబాబు ఉద్దేశంగా ఉండొచ్చని పేర్కొంటున్నారు. సాధారణంగా అయితే చంద్రబాబు.. పవన్ వ్యాఖ్యలపైన స్పందించేవారేనని.. అయితే పవన్ ప్రతిపాదనలతో చంద్రబాబు ఖంగుతిన్నారని చెప్పుకొస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తాము తగ్గబోమని.. ఇప్పటికే చాలాసార్లు తగ్గామని.. ఇక తగ్గాల్సింది మిగతా పార్టీలేనని పవన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఎవరినో తాము ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు. సమాన సీట్లలో పోటీ చేయడం లేదా అధికారాన్ని పంచుకోవడం అనేదానిపైన ఆధారపడే పొత్తులు ఉంటాయని పవన్ చెప్పడంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడిందని అంటున్నారు.

ఇంకా ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉన్న నేపథ్యంలో అప్పుడే పొత్తుల విషయంపై స్పందించాల్సిన అవసరం లేదనేది చంద్రబాబు మాటగా ఉందని అంటున్నారు. ఎన్నికలు సమీపించినప్పుడు ఎలాగు పొత్తుల ప్రస్తావన తప్పదని అంటున్నారు. అయితే మహానాడు, బాదుడే బాదుడు కార్యక్రమాలు విజయవంతం కావడంతో టీడీపీ నేతల్లో, కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపిస్తోందని చెబుతున్నారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా విజయం తమదే అన్న భావనలో వారు ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వారు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు సైతం ఇదే కోవలో ఉన్నాయని చెప్పుకుంటున్నారు.