Begin typing your search above and press return to search.

పాకిస్థానీయులు గూగుల్ కు ఎక్కువగా ఏమడిగారో తెలుసా?

By:  Tupaki Desk   |   12 Dec 2019 6:01 AM GMT
పాకిస్థానీయులు గూగుల్ కు ఎక్కువగా ఏమడిగారో తెలుసా?
X
మరో రెండు వారాల్లో ఈ ఏడాది ముగియనుంది. ఏడాదిలో జరిగిన విశేషాలు.. సంవత్సరంలో చోటు చేసుకున్న ఆసక్తికర అంశాలకు సంబంధించిన రౌండప్ లతో పాటు.. మరికొన్ని కీలక విషయాలు ఇయర్ ఎండర్ లో బయటకు వస్తుంటాయి. తాజాగా గూగుల్ ఇలాంటి వివరాల్నే వెల్లడించింది. ఏడాదిలో గూగుల్ ను అత్యధికంగా ఏం అడిగారు? దేని కోసం వెతికారు? లాంటి ఆసక్తికర అంశాల సమాచారాన్ని వెల్లడించింది.

పొరుగున ఉన్న పాకిస్థానీయులు ఈ ఏడాదిలో గూగుల్ లో అత్యధికంగా వెతికిన అంశాల్ని చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. వారు వెతికిన విషయాల్లో టాప్ లో ఉన్నవి మనోళ్ల గురించిన సమాచారమే. ఈ ఏడాది పుల్వామా ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాక్ లో చిక్కుకుపోయి.. తిరిగి క్షేమంగా భారత్ కు రావటం తెలిసిందే.

ఈ వ్యవహారం అప్పట్లో ఎంత హాట్ టాపిక్ అయ్యిందో తెలిసిందే. ఈ ఏడాది పాకిస్థానీయులు గూగుల్ లో అత్యధికంగా వెతికిన వ్యక్తుల జాబితాలో అభినందన్ వర్థమాన్ తొలి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ లు నిలిచారు. అంతేకాదు.. ఇండియన్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ 13 గురించి.. మోటూ పాట్లూ షో మీదా వారు అత్యధిక ఆసక్తిని ప్రదర్శించినట్లుగా పేర్కొంది. పాకిస్థానీయులు గూగులమ్మలో వెతికిన అంశాల్లో ఎక్కువగా భారతదేశానికి.. భారతీయులకు సంబంధించిన అంశాలు ఉండటం గమనార్హం.