Begin typing your search above and press return to search.

థ‌రూర్ మాట‌.. నెటిజ‌న్ల వెతుకులాట‌!

By:  Tupaki Desk   |   11 Oct 2018 7:39 AM GMT
థ‌రూర్ మాట‌.. నెటిజ‌న్ల వెతుకులాట‌!
X
వివాదాల సుడిలో చిక్క‌కుంటూ.. ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌పై ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ నిరంత‌రం వార్త‌ల్లో ఉంటుంటారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత - ఎంపీ శ‌శి థ‌రూర్‌. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ట్విట‌ర్‌ లో ఆయ‌న్ను అనుస‌రిస్తున్న‌వారి సంఖ్య కోట్ల‌లో ఉంటుంది. మంచి వ‌క్త‌గా పేరున్న థ‌రూర్ చేసే చాలా ట్వీట్ల‌కు జ‌నం ఫిదా అయిపోతుంటారు. వాటిని రీ ట్వీట్ చేస్తుంటారు.

థ‌రూర్‌కు ఇంగ్లీష్‌పై ప‌ట్టు ఎక్కువ‌. ట్వీట్ల‌లో ఆయ‌న వాడే కొన్ని ప‌దాలు మామూలు వ్య‌క్తుల‌కు అర్థం కానే కావు. అందుకే సోష‌ల్ మీడియా ఇంగ్లీష్ టీచ‌ర్‌గా కూడా ఆయ‌న్ను పిలుస్తుంటారు. తాజాగా మ‌రోసారి అలాంటి ఓ అర్థం కాని ఆంగ్ల ప‌దాన్ని త‌న ట్వీట్‌ లో వాడిన థ‌రూర్‌.. దాని అర్థం కోసం నెటిజ‌న్లు త‌ల‌లు బ‌ద్ధ‌లు కొట్టుకునేలా చేశారు. ప్రధాని న‌రేంద్ర మోదీ అనుస‌రిస్తున్న విధానాల‌ను విమ‌ర్శిస్తూ థ‌రూర్ తాజాగా ఓ పుస్త‌కాన్ని రాశారు. దాన్ని జ‌నానికి ట్విట‌ర్ వేదిక‌గా ప‌రిచ‌యం చేస్తూ.. నా కొత్త పుస్త‌కం.. ది పారాడాక్సిక‌ల్ ప్రైమ్ మినిస్ట‌ర్‌.floccinaucinihilipilificationకు సంబంధించి 400 పేజీల పుస్త‌క‌మిది. అని పేర్కొన్నారు.

ఇక్క‌డ థ‌రూర్ వాడిన floccinaucinihilipilification అనే ప‌దానికి అర్థం తెలియ‌క నెటిజ‌న్లు డిక్ష‌న‌రీల బాట ప‌ట్టారు. ఆ ప‌దం అస‌లు అర్థం.. ఇత‌రుల‌ను ప‌నికిరానివారిగా అంచ‌నా వేసే అల‌వాటు. అయితే, దాన్ని సింపుల్‌గా చెప్పేయ‌కుండా.. నెటిజ‌న్ల మెద‌ళ్ల‌కు థ‌రూర్ ప‌దును పెట్టారు. దీంతో ఆ ప‌దం అర్థం కోసం మేధావుల‌ను ఆశ్ర‌యించి.. డిక్ష‌న‌రీల్లో వెతుకుతున్న నెటిజ‌న్లు.. చివ‌ర‌కు దాని అర్థం తెలుసుకొని న‌వ్వుకుంటున్నారు. ఇంత చిన్న ప‌దానికి థ‌రూర్ అంత కంగారు పెట్టించారే.. అంటూ జోకులు పేలుస్తున్నారు. ఆయ‌న‌పై, ఆయ‌న ఇంగ్లీష్‌పై మీమ్స్ త‌యారుచేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. థ‌రూర్ ట్వీట్ చేసిన ప్ర‌తిసారీ డిక్ష‌న‌రీలు అప్‌ డేట్ అవుతుంటాయంటూ చ‌మ‌త్క‌రిస్తున్నారు. మొత్తానికి థ‌రూర్ త‌న భాషా నైపుణ్యంతో నెటిజ‌న్ల‌ను బాగానే కంగారు పెట్టించాడు క‌దా!