Begin typing your search above and press return to search.

బొత్స బ్ర‌ద‌ర్ ఏంటిది ?

By:  Tupaki Desk   |   17 Aug 2022 1:30 PM GMT
బొత్స బ్ర‌ద‌ర్ ఏంటిది ?
X
ఉపాధ్యాయుల‌కూ, ప్ర‌భుత్వానికీ మ‌ధ్య ఏదో జ‌రుగుతోంది. ఉపాధ్యాయుల‌కూ, ప్ర‌భుత్వానికి మ‌ధ్య అంత‌రాలు, అపార్థాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. క‌లిసి ప‌నిచేయాల్సిన రెండు విభాగాలు ఒక‌రి పై ఒక‌రు పై చేయి సాధించేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఎప్ప‌టిక‌ప్పుడు విద్యాశాఖ‌లో వివాదాలే నెల‌కొని ఉంటున్నాయి. సీనియ‌ర్ మంత్రి అయిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు విద్యాశాఖ అప్ప‌గించిన రోజు నుంచి ఇప్ప‌టిదాకా అనేక వివాదాలు ఉన్నాయి. అయినా కూడా ప్ర‌భుత్వం ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల‌తో స‌మ‌స్య‌ల ప‌రిష్కార నిమిత్తం మాట్లాడుతున్న దాఖాలాలు లేవు. ఎందుక‌ని ఏపీ స‌ర్కారు త‌న ప‌రువు తానే తీసుకుంటుద‌ని, మాట్లాడిదే పోయే స‌మ‌స్య‌ల‌కు ఇంత వ‌ర‌కూ రాద్ధాంతం చేస్తున్నారు ఎందుక‌ని ఓ ప్ర‌శ్న విప‌క్షం నుంచి వ‌స్తోంది. కానీ ఏపీ సర్కారు మాత్రం ఎక్క‌డా త‌గ్గడం లేదు.

ఎప్ప‌టికప్పుడు ఏదో కొత్త నిర్ణ‌యంతో వివాదాల‌ను పెంచి పోషిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంతా క‌లిసి వైసీపీకి ఎంతో సాయం చేశారు. కానీ ఆ మేర‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫు మ‌ద్ద‌తు వీరికి లేకుండా పోతోంద‌ని, గ‌తంలో చంద్ర‌బాబు స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాల క‌న్నా జగన్ సర్కారు అనాలోచిత నిర్ణ‌యాలే ఎక్కువని ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్న ఓ వ‌ర్గం నుంచి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి ఫేస్ రిక‌గ్నిష‌న్ యాప్ ద్వారా హాజ‌రు నమోదును తాము వ్య‌తిరేకించినా కూడా ఎవ్వ‌రూ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఉపాధ్యాయులు ఆవేద‌న చెందుతున్నారు.

మొత్తం 2 ల‌క్ష‌ల మంది (దాదాపు) ఉపాధ్యాయులతో విద్యావ్య‌వ‌స్థ అన్న‌ది న‌డుస్తోంది. మొద‌ట ఎయిడెడ్ పాఠ‌శాల‌ల విలీనం అంటూ ఓ వివాదం రేపారు. ఆ త‌రువాత ఇష్ట‌పూర్వ‌కంగా అయితేనే ప్ర‌భుత్వంలో ఆయా సంస్థ‌లు విలీనం కావొచ్చు అని, లేదంటే లేదు అని తేల్చేశారు. ఆ త‌రువాత కోర్టు త‌గాదాలు న‌డిచాయి. చాలా చోట్ల బాగా ప‌నిచేసిన బడుల‌పై కూడా స‌ర్కారు విప‌రీతంగా ఒత్తిడి తెచ్చి త‌న‌లో క‌లిపేసుకుని తీరాల‌ని మొండి ప‌ట్టు ప‌ట్టింది. ఆఖ‌రికి స‌ర్కారు భావించిన విధంగా జ‌ర‌గ‌లేదు. కోర్టుల జోక్యంతో కొన్ని కొత్త వివాదాలు వ‌చ్చాయి. దాంతో వెన‌క్కు త‌గ్గిన స‌ర్కారు త‌న నిర్ణ‌యాల‌ను మార్చుకుని, దిద్దుబాటుకు పూనుకుంది. ఈ వివాదం ఇంకా ముగియ‌లేదు. ఇంకా చాలా పాఠ‌శాల‌లు త‌మ ఆస్తుల కోసమే ప్ర‌భుత్వం ఈ విధంగా ప‌న్నాగం ప‌న్నింద‌ని ఆరోపిస్తూ కొన్ని కేసులను న్యాయ స్థానంలో న‌మోదు చేశాయి. అవి కూడా పెండింగ్ లోనే ఉన్నాయి.

అంతకుముందు ఏపీ స‌ర్కారు పీఆర్సీ ర‌గ‌డ‌ను తెర‌పైకి తెచ్చింది. ప‌ద‌కొండో వేత‌న స‌వ‌ర‌ణ కాస్త చాలా వివాదాల‌ను మోసుకువ‌చ్చింది. ముఖ్యంగా అద్దెభ‌త్యం త‌గ్గించి మ‌రో వివాదం రేపారు. అన్ని చోట్ల అప్ప‌టిదాకా ఉన్న శ్లాబ్ సిస్టంను పూర్తిగా మార్చేశారు. అదేవిధంగా డీఏల చెల్లింపు కూడా కాస్త ఆల‌స్యం కావ‌డంతో ఉపాధ్యాయులంతా భ‌గ్గు మ‌న్నారు. ఇక ఆరోజు ప్ర‌క‌టించిన వేత‌న స‌వ‌ర‌ణ అంతా అస్త‌వ్య‌స్తంగానే ఉంద‌ని, త‌మ జీతాలు త‌గ్గిపోయాయి అని గ‌గ్గోలుమ‌న్నారు ఉపాధ్యాయులు. ఈ వివాదాలు ఎలా ఉన్నాకూడా కాస్తో కూస్తో ప్ర‌భుత్వం త‌ర‌ఫు వాద‌న స‌మ‌ర్థంగానే ఉండ‌డంతో కొంత‌లో కొంత వివాదం ఆగింది. అలానే ఓ ప్ర‌భుత్వం త‌ర‌ఫున చేసే జీత‌భత్యాల చెల్లింపుల్లో తామెలా నిర్ణ‌యాలు చెబుతామ‌ని కోర్టు కూడా చెప్ప‌డంతో ఉపాధ్యాయులు త‌గ్గారు.

ప్రభుత్వంతో విసిగిపోయిన ఉద్యోగుు త్వ‌ర‌లో మిలియ‌న్ మార్చ్ ను నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. ఇవ‌న్నీ న‌డుస్తుండ‌గానే మ‌ధ్య‌లో కొత్త విద్యా సంవ‌త్స‌రం ఆరంభంలో పాఠ‌శాల‌ల విలీనం అంటూ తెర‌పైకి మ‌రో వివాదం తెచ్చి పెట్టారు. నూత‌న విద్యా విధానం పేరిట చాలా బ‌డులను స‌మీప ఉన్న‌త పాఠ‌శాల‌ల్లో క‌లిపి వేశారు. ప్రాథ‌మిక విద్య‌ను రెండుగా విభజించి మూడు, నాలుగు, ఐదు త‌ర‌గ‌తుల విద్యార్థుల‌ను తీసుకువెళ్లి స‌మీప ఉన్న‌త పాఠ‌శాల‌ల్లో విలీనం చేశారు. ఒక‌టి, రెండు త‌ర‌గ‌తుల‌ను స‌మీప అంగ‌న్వాడీల్లో ఉంచి వాళ్ల‌కో టీచ‌ర్ ను కేటాయించారు.
అయితే విలీనం కార‌ణంగా చాలా బ‌డులు రద్ద‌యిపోయాయి.గ్రామాల్లో ఆందోళ‌న‌లు రేగాయి.

70 మంది ఎమ్మెల్యేలు (అంతా వైసీపీ వారే) నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ , మంత్రి బొత్స‌కు లేఖ‌లు రాశారు. అయినా కూడా ఈ నిర్ణ‌యం అమ‌లు ఇంకా పునః స‌మీక్ష ద‌శ‌లోనే ఉంది. జిల్లా స్థాయి క‌మిటీలు నియ‌మించి ఒక్కో చోట ఏ విధంగా విలీన ప్ర‌క్రియ సాగింద‌న్న‌ది తెలుసుకునే ప్ర‌య‌త్నం ప్ర‌భుత్వం చేస్తోంది. ఇవ‌న్నీ ఉంటుండ‌గానే ఫేజ్ రిక‌గ్నిష‌న్ యాప్ పేరిట ఉపాధ్యాయుల హాజరు శాతం తీసుకోవాల‌ని, త‌ద్వారా జీతాల బిల్లులు చెల్లింపు చేయాల‌ని నిర్ణ‌యించి, నిన్న‌టి వేళ అమ‌లు చేసి మ‌రో కొత్త క‌య్యం తెచ్చుకుంది ఏపీ స‌ర్కారు. దీంతో ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు. చూస్తుంటే జగన్ సర్కారు కొరివితో తలగోక్కుంటున్నట్లు ఉంది.