Begin typing your search above and press return to search.

వ్య‌క్తి చ‌నిపోతే ఆధార్ కార్డ్ ను ఏం చేస్తారో తెలుసా?

By:  Tupaki Desk   |   5 Aug 2021 11:30 PM GMT
వ్య‌క్తి చ‌నిపోతే ఆధార్ కార్డ్ ను ఏం చేస్తారో తెలుసా?
X
నిర్ణీత కాలం వ‌ర‌కు ఫోన్‌ నంబ‌ర్ యాక్టివేష‌న్లో లేక‌పోతే ఆ త‌ర్వాత అత‌ని పేరు మీద నుంచి నంబ‌ర్ ను తొల‌గిస్తారు. వేరే వాళ్ల‌కు ఆ నంబ‌ర్ కేటాయిస్తారు. మ‌రి, ఒక వ్య‌క్తి చ‌నిపోతే అత‌ని ఆధార్ కార్డ్ నంబ‌ర్ ఏమ‌వుతుంది? దాన్నేం చేస్తారు? చాలా మందికి ఈ ఆలోచ‌న వ‌చ్చి ఉండ‌దు! ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం.

ప్ర‌పంచంలోనే అతిపెద్ద బ‌యోమెట్రిక్ గుర్తింపు వ్య‌వ‌స్థ మ‌న భార‌త‌దేశంలోనే ఉంద‌ని చెప్పుకోవ‌చ్చు. దేశంలో నివ‌సించే ప్ర‌తీ పౌరుడి వివ‌రాలు ప్ర‌భుత్వానికి తెలిసేలా.. 12 అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డును కేంద్ర ప్ర‌భుత్వం జారీచేస్తోంది. అదే ఆధార్ కార్డు. ఇప్పుడు అన్ని ప‌నుల‌కు అస‌లైన గుర్తింపు కార్డుగా ఆధార్ నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. మ‌రి, చ‌నిపోయిన వ్య‌క్తి ఆధార్ కార్డును ఏం చేస్తార‌ని అన్న‌ప్పుడు ఎవ‌రి వ‌ద్దా స‌రైన స‌మాధానం లేదు.

ఎందుకంటే.. ఆధార్ అనేది కేవ‌లం నంబ‌ర్ అయితే.. మార్చి వేరేవాళ్ల‌కు కేటాయించేవారు. కానీ.. దాంతోపాటు వేలి ముద్రలు, ఐరిష్ కూడా సేక‌రిస్తారు. కాబ‌ట్టి మ‌రొక‌రి పేరు మీద‌కు మార్చ‌డం సాధ్యం కాదు. ఇదే విష‌య‌మై ఒక పార్ల‌మెంట్ స‌భ్యుడు అడిగిన ప్ర‌శ్న‌కు ఐటీ స‌హాయ‌మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ లోక్ స‌భ‌లో స‌మాధానం ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎలాంటి నిర్ణ‌యం లేద‌ని, త్వ‌ర‌లో కొత్త నిబంధ‌న‌లు తీసుకురానున్న‌ట్టు చెప్పారు.

చ‌నిపోయిన వ్య‌క్తి ఆధార్ కార్డును అధికారుల‌కు అప్ప‌గించేలా నిబంధ‌న‌లు రూపొందించ‌నున్న‌ట్టు తెలిపారు. త్వ‌ర‌లో రానున్న నిబంధ‌న‌ల ప్ర‌కారం.. మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం పొందేందుకు ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో చ‌నిపోయిన వ్య‌క్తి ఆధార్ కార్డును కూడా జ‌త చేయాల్సి ఉంటుంది. మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం జారీ చేసిన త‌ర్వాత అత‌ని ఆధార్ నంబ‌ర్ ను ర‌ద్దు చేస్తారు. ఈ కొత్త నిబంధ‌న‌ల కోసం త్వ‌ర‌లో రిజిస్ట్రేష‌న్ ఆఫ్ బ‌ర్త్ అండ్ డెత్ యాక్ట్ 1969కు స‌వ‌ర‌ణ చేయ‌బోతోంది ప్ర‌భుత్వం.