Begin typing your search above and press return to search.

జీఎస్టీపై కౌటిల్యుడు ఏం చెప్పాడు?

By:  Tupaki Desk   |   7 Dec 2017 6:07 PM GMT
జీఎస్టీపై కౌటిల్యుడు ఏం చెప్పాడు?
X
ఔను మీరు చ‌దివింది నిజ‌మే...ప్ర‌ధాని మోడీ పాల‌న‌లోని అతిపెద్ద ఆర్థిక సంస్క‌ర‌ణ‌కు...ఆర్థ‌శాస్త్ర పితామ‌హుడికి లింక్ పెట్టారు. అందుకే...ఇది చదవగానే అసలు కౌటిల్యుడు ఏంటి? అతనికీ జీఎస్టీకి సంబంధం ఏంటి అన్ని అనుమానం కలిగింది. ఎప్పుడో క్రీస్తుపూర్వం ఉన్న ఈ అర్థశాస్త్ర నిపుణుడికి, ఇప్పుడు మన జీఎస్టీకి ఎలా లంకె కుదురుతుంది? ఇదే అనుమానం బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) విద్యార్థులకూ కలిగింది. కానీ అక్కడి ప్రొఫెసర్లకే ఇది తెలియనట్లుంది. అందుకే ఆ ప్ర‌శ్న ఇచ్చారు.

ఎంఏ తొలి సెమిస్టర్ పరీక్షలో వాళ్లు ఇచ్చిన ప్రశ్న చూసి విద్యార్ధులు అవాక్క‌య్యారు. `కౌటిల్యుని అర్థశాస్త్రంలో జీఎస్టీ ఎలా ఉండేది.. వివరించండి?`అన్నది ఆ ప్రశ్న. సోషల్ అండ్ పొలిటికల్ థాట్ ఆఫ్ ఏన్షియంట్ అండ్ మిడీవల్ ఇండియా సబ్జెక్ట్‌లో భాగంగా ఈ ప్రశ్న అడిగారు. దీంతో విద్యార్థులు ఏం రాయాలో తెలియక తల పట్టుకున్నారు. పోనీ ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోతే ఇదైనా రాయండి అంటూ దాని కిందే మరో ప్రశ్న అడిగారు. అదీ మరీ దారుణం. `గ్లోబలైజేషన్ గురించి ఆలోచన చేసిన తొలి భారతీయుడు మను`.. దీనిపై చర్చించండి. ఇదీ ఆ ప్రశ్న. అసలు వీటికి సమాధానాలు మీకైనా తెలుసా అంటూ కొందరు విద్యార్థులు తమ ప్రొఫెసర్లను కలిసి అడిగారు.

ఇలా విద్యార్థులంతా ప్ర‌శ్నిస్తుండ‌టంతో... దీనిపై ఓ ప్రొఫెసర్ స్పందించారు. `అసలు మేం విద్యార్థులకు చెప్పినదాంట్లో ఇది లేనే లేదు. కౌటిల్య, మను వాళ్ల కాలంలో గొప్ప ఆర్థిక వేత్తలు, ఆలోచనా పరులే కావచ్చు. కానీ ఆ సమయంలో అసలు జీఎస్టీ, గ్లోబలైజేషన్‌లాంటి పదాలు ఉన్నాయో లేదో తెలియదు` అని అన్నారు. ఇలాంటి ప్రశ్నలు ఎలా అడిగారో తమకు కూడా అంతుబట్టడం లేదని బీహెచ్‌యూ ప్రొఫెసర్లు చెబుతున్నారు. పొలిటికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ ఆర్పీ సింగ్ స్పందిస్తూ.. `ప్రశ్నాపత్రాలను సంబంధిత నిపుణులు తయారు చేస్తారు.. దీనికి వాళ్లదే బాధ్యత` అని చెప్పారు. ఇలాంటి ప్రశ్నలు ఎంఏ విద్యార్థులను అడగడం ఏంటని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా ఉన్న ఎంఎన్ ఠాకూర్ మండిపడ్డారు. దీనిపైన ఓ రీసెర్చ్ చేసినా దానికో అర్థం ఉంటుందిగానీ.. పరీక్షలో ప్రశ్నలు అడగడం అవివేకమని అన్నారు.