Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ సీనియర్లు ఏం చేయనున్నారు?

By:  Tupaki Desk   |   28 Jun 2021 5:06 AM GMT
కాంగ్రెస్ సీనియర్లు ఏం చేయనున్నారు?
X
కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ గా తనను ప్రకటించగానే విజయగర్వంతో పొంగిపోకుండా రేవంత్ రెడ్డి చేసిన మంచి పని ఏంటో తెలుసా? రగిలిపోతున్న టీకాంగ్రెస్ పెద్దలను కలవడం.. మొదట జానారెడ్డి, తర్వాత షబ్బీర్ అలీ.. ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్లను వరుసగా కలిశాడు. తనను ఆశీర్వదించాలని కోరాడు. అంతేకాదు.. తన నిర్ణయాలు ఏం ఏకపక్షంగా ఉండవని.. పార్టీ నిర్ణయం ప్రకారం అందరి అభిప్రాయలతోనే వెళదామని వేడిని తగ్గించే మంచి ప్రయత్నం చేశాడు.

సాధారణంగా టీపీసీసీ కాగానే నేతలు ర్యాలీలు, డప్పు చప్పుళ్లతో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ హోరెత్తిస్తారు. కానీ రేవంత్ మాత్రం వాటి జోలికి పోకుండా సీనియర్లను శాంపరిచే ప్రయత్నం చేశారు. అదో మంచి మూవ్ అని చెప్పొచ్చు. అయితే ఇద్దరు ముగ్గురు మాత్రం బయటపడి అసంతృప్తి జ్వాల ఎగదోసేశారు.

ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘పీసీసీ అమ్ముడుపోయిందని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అయితే రాజీనామా చేసేశాడు. జగ్గారెడ్డి సైతం ఆది నుంచి ఉన్న కాంగ్రెస్ వాళ్లను వదిలేసి టీడీపీ నుంచి మూడేళ్ల కింద వచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారని ప్రశ్నించాడు. కాంగ్రెస్ సీనియర్లు సైతం లోలోపల రగిలిపోతున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా జీర్ణించుకోవడం లేదు.

అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ విషయంలో బలంగా ఉంది. ఎందుకంటే తెలంగాణను ఇచ్చినా కూడా కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాని కాంగ్రెస్ సీనియర్లపై నమ్మకం పోయింది. ఎవరికి వారే యుమానా తీరే అన్నట్టుగా లాలూచీ రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలు వారిపై వచ్చాయి. కేసీఆర్ ను ఢీకొట్టే నేత ఎవరు అని శూలశోధన చేసాకే రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్టు స్పష్టమవుతుంది.

ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్లు అంతా అసమ్మతి గళం వినిపించినా.. వేరుకుంపటి పెట్టినా.. ఇతర పార్టీలకు పోయినా కూడా అధిష్టానం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఎందుకంటే సంవత్సరాల కొద్దీ కసరత్తు చేసి మరీ అధిష్టానం ఈ బలమైన నిర్ణయాన్ని తీసుకుంది.

ఇక ఇప్పటికే ఫుల్ లోడ్ లో ఉన్న గులాబీ పార్టీలోకి కాంగ్రెస్ అసమ్మతి వాదులు పోలేరు. సరైన పదవులు, ప్రాధాన్యత అందులో కష్టమే. ఇక తమకు సూట్ కాని బీజేపీలో వీళ్లు అస్సలు చేరే అవకాశాలు లేవు. సో కుక్కిన పేనులా పడి ఉండడమా? కాంగ్రెస్ కు దూరంగా జరగడమా? ఈ రెండు ఆప్షన్లు మాత్రమే కాంగ్రెస్ సీనియర్లకు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.