Begin typing your search above and press return to search.

విశ్వాస పరీక్షలో గెలిస్తే ఏమవుతుంది ?

By:  Tupaki Desk   |   6 Sep 2022 4:51 AM GMT
విశ్వాస పరీక్షలో గెలిస్తే ఏమవుతుంది ?
X
ఝార్ఖండ్ లో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్షలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం గెలిచింది. 81 మంది ఎంఎల్ఏలున్న అసెంబ్లీలో బలపరీక్షలో జేఎంఎం అధినేత, ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ కు అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి. దీంతో అసెంబ్లీలో తనకు వ్యక్తిగతంగాను, తమ సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురులేదని హేమంత్ చాటిచెప్పినట్లయ్యింది.

అంతా బాగానే ఉందికానీ విశ్వాస పరీక్షలో గెలిస్తే సరిపోతుందా ? అన్నదే అసలైన ప్రశ్న. అసలు సమస్య ఏమిటంటే హేమంత్ పై అనర్హత పిటీషన్ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. భూములు, గనుల కేటాయింపులో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న సీఎంపై బీజేపీ ఎంఎల్ఏలు అనర్హత వేటు వేయాలంటు కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. వీళ్ళ ఫిర్యాదును పరిశీలించిన కమీషన్ గవర్నర్ కు తన సిఫారసును పంపింది.

అంటే కమీషన్ సిఫారసులో ఏముందో గవర్నర్ కు తప్ప మరొకరికి తెలీదు. గవర్నర్ ఏమో వైద్య పరీక్షల పేరుతో వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నారు. దాంతో ప్రభుత్వానికి దినదినగండం లాగ తయారైంది. ఈ నేపధ్యంలోనే హేమంత్ విశ్వాస పరీక్ష జరుపుకున్నారు. రేపు గవర్నర్ తిరిగొచ్చిన తర్వాత సీఎంపై అనర్హత వేటు వేస్తే ఇపుడు నిర్వహించిన విశ్వాస పరీక్ష ఏమాత్రం ఆదుకోలేదు. విశ్వాసపరీక్ష వేరు, అనర్హత వేటు వేరన్న విషయం అందరికీ తెలిసిందే.

వేస్తే సీఎంపై అనర్హత వేటు వేయాలి లేదంటే లేదని చెప్పాల్సిన గవర్నర్ విషయాన్ని బాగా నాన్చుతున్నారు. బీజేపీకి కావాల్సింది హేమంత్ పై అనర్హత వేటు వేయటం కాదని, ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చేయటమే అని అర్ధమవుతోంది.

హేమంత్ పై అనర్హత వేటు వేస్తే ఏమవుతుంది ? ఆయన స్ధానంలో ఇంకోళ్ళు సీఎం అవుతారు. అదే ప్రభుత్వాన్నే కూల్చేస్తే సంకీర్ణ ప్రభుత్వంలోని ఎంఎల్ఏలను లాగేసుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయచ్చు. ఇపుదీ ప్రయత్నాలే జరుగుతున్నాయి చివరకు ఏమవుతుందో ఏమో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.