Begin typing your search above and press return to search.

త్రిసభ్య ధర్మాసనం వల్ల ఏమవుతుంది ?

By:  Tupaki Desk   |   26 Aug 2022 1:30 AM GMT
త్రిసభ్య ధర్మాసనం వల్ల ఏమవుతుంది ?
X
రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల విషయమై సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనాన్ని నియమించింది. ఈ దర్మాసనం వల్ల ఏమవుతుందనేది ఎవరికీ అర్థం కావటం లేదు. ధర్మాసనాన్ని నియమించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణే రాజకీయపార్టీలతో చర్చించటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని తేల్చేశారు. అధికారంలోకి రావటం కోసం అనేక పార్టీలు అనేక రకాల హామీలను ఇస్తుంటాయి.

పార్టీలిచ్చే హామీల్లో ఆచరణ సాధ్యమయ్యేవి, ఆచరణ సాధ్యం కానివి కూడా ఉంటాయనటంలో సందేహం లేదు. చాలా పార్టీలు కేవలం అధికారం కోసం రకరకాల హామీలిస్తాయి. వీటిల్లో అత్యధికంగా ఆర్ధికాంశాలతో ముడిపడున్నవే. ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీలకు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల లోతు తెలీదు. అందుకనే తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఈ పథకాన్ని అమలు చేస్తామని చెబుతుంటాయి. జనాల్లో కూడా పార్టీలిచ్చే హామీలను నమ్మేవారుంటారు, నమ్మని వారుంటారు.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాతే వాస్తవ ఆర్ధిక పరిస్థితి ఏమిటన్నది స్పష్టంగా తెలుస్తుంది. అప్పటికి పథకాల అమలుకు ఇచ్చిన హామీలన్నీ అమలు సాధ్యం కాదని అర్థమైపోతుంది. దాంతో ఇచ్చిన హామీల నుండి దూరంగా జరగటమో లేకపోతే అసలు హామీలిచ్చిన విషయాన్ని మరచిపోయినట్లుండటమే అందరు చూస్తున్నదే.

దీనిపైనే కేంద్ర ఎన్నికల కమీషన్, సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అయితే వీటిల్లో కమీషన్ అయినా కోర్టయినా చేయగలిగిందేమీ లేదు. ఈ విషయాన్ని విచారణ సందర్భంగా స్వయంగా సుప్రీంకోర్టే అంగీకరిస్తోంది.

పలానా పార్టీ పలానా హామీనే ఇవ్వాలని కమీషన్ అయినా కోర్టయినా రాజకీయ పార్టీలను నిర్బంధించలేవు. అందుకనే ఉచిత హామీలు లేదా సంక్షేమ పథకాల హామీల నియంత్రణకు రాజకీయ పార్టీలే నడుంబిగించాలి. దీనికి ముందుగా అధికారంలో ఉన్న పార్టీలు అంగీకరించాలి.

అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఉచిత లేదా సంక్షేమ పథకాలేవి అనే విషయాలను నిర్ణయించుకుంటే తర్వాత ఎన్నికల సమయంలో హామీలపై ఆలోచించవచ్చు. దీనికి జాతీయ స్ధాయిలో ప్రధానమంత్రి, రాష్ట్రాల సంఖ్యలో ముఖ్యమంత్రులే ముందుగా బాధ్యత తీసుకోవాలి. ప్రజాకర్షక హామీలే సమాజానికి హానికరంగా తయారయ్యాయనటంలో సందేహంలేదు. ఈ విషయాన్ని త్రిసభ్య ధర్మాసనం గుర్తించాలి.