Begin typing your search above and press return to search.

మ‌రి క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతుందేంటి మోడీ?

By:  Tupaki Desk   |   11 Feb 2022 11:30 AM GMT
మ‌రి క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతుందేంటి మోడీ?
X
ప్ర‌తి ముస్లిం మ‌హిళ‌కు అండ‌గా ఉంటాం.. ఇవీ క‌ర్టాట‌క‌లో హిజాబ్ వివాదంపై స్పందిస్తూ ప్ర‌ధాని మోడీ చేసిన కీల‌క వ్యాఖ్య‌లు. కానీ వాస్త‌వ ప‌రిస్థితులు మాత్రం అలా లేవని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో కావాల‌నే ఈ వివాదాన్ని రాజేశార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ఈ వివాదాన్ని తెర‌మీద‌కు తెచ్చార‌ని రాజ‌కీయ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. అందుకు ప్ర‌ధాన కార‌ణం బీజేపీనే అనే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో మోడీ మాత్రం ముస్లిం మహిళ‌ల సంక్షేమం గురించి మాట్లాడ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బీజేపీ డ‌బుల్ గేమ్ ఆడుతుంద‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

ట్రిపుల్ త‌లాక్ నుంచి ముస్లిం మ‌హిళ‌ల‌ను విముక్తి చేసింది బీజేపీ ప్ర‌భుత్వ‌మేన‌ని గొప్ప‌గా చెప్పుకుంటున్న మోడీ.. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఓ నిర్దిష్ట స‌మ‌యంలో రేగుతున్న మ‌త వివాదాల‌కు కార‌ణం ఎవ‌రో కూడా చెప్పే బాగుంటుంద‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. క‌ర్ణాట‌క వివాదం గురించి మాట్లాడుతూ ముస్లిం మ‌హిళ‌లు అణిచివేత‌కు గురికాకుండా ఉండాలంటే యూపీలో మ‌ళ్లీ బీజేపీ ప్ర‌భుత్వం రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్ప‌డం దేనికి నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. బీజేపీ ప‌క్కా వ్యూహం మేర‌కే క‌ర్ణాట‌క‌లో ఇప్పుడీ వివాదాన్ని రాజేసింద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలా విద్యాసంస్థ‌ల్లో ఒక‌టిగా క‌లిసి ఉండే విద్యార్థుల మ‌తం పేరుతో విడ‌గొట్ట‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సమ‌ని లౌకిక‌వాదులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ముస్లిం యువ‌తుల హిజాబ్ ధార‌ణ‌పై నిషేదాజ్ఞ‌లు తీసుకువ‌చ్చిన క‌ర్ణాట‌క‌లోని బీజేపీ ప్ర‌భుత్వ నేత‌లు మ‌రింత అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆ రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏకంగా రానున్న కాలంలో దేశ జాతీయ ప‌తాకం కూడా కాషాయ ప‌తాక‌మే అవుతుంద‌ని వ్యాఖ్యానించారు.

త్రివ‌ర్ణ ప‌తాకం స్థానం కాషాయ జెండా ఎగురుతుంద‌ని అందుకు కాస్త స‌మ‌యం ప‌డుతుంద‌ని అన్నారు త‌న వ్యాఖ్య‌ల‌ను తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని, రామ‌మంద‌రి నిర్మాణాన్ని కూడా గ‌తంలో కొంత‌మంది హాస్యాస్ప‌దంగా తీసుకున్నార‌ని అన్నారు. కానీ రామ మందిర నిర్మాణాన్ని మొద‌లెట్టిన‌ట్లే జాతీయ ప‌తాకాన్ని కూడా మారుస్తామ‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఎర్ర‌కోట‌పై కాషాయ ప‌తాకం ఎగురుతుందని విశ్వాసం వ్య‌క్తం చేశారు.

ఓ వైపు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమం కోసం బీజేపీ ప‌ని చేస్తుంద‌ని మోడీ చెబుతుంటే.. ఆ పార్టీ నేత‌లేమో అన్నిచోట్ల కాషాయ‌మే క‌నిపించాల‌ని కోరుకుంటున్నారు. హిందుత్వ వాదాన్ని విస్త్రతం చేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. మ‌రి దీనికి మోడీ ఏం చెప్పారు? అంటే.. అవ‌న్నీ ఆయ‌న‌కు తెలీకుండా జ‌ర‌గ‌వు క‌దా అనే స‌మాధానం వినిపిస్తోంది.