Begin typing your search above and press return to search.

తీసుకున్న పాతనోట్లను ప్రభుత్వం ఏం చేస్తుంది!

By:  Tupaki Desk   |   11 Nov 2016 3:54 AM GMT
తీసుకున్న పాతనోట్లను ప్రభుత్వం ఏం చేస్తుంది!
X
పాత 500 - 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన అనంతరం ప్రజలు తమ వద్ద ఉన్న పాత పెద్ద నోట్లన్నిటినీ వెనక్కి తీసుకుంటున్నారు.. ప్రజలకు కొత్త నోట్లు ఇస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఇకపై చెల్లుబాటుకాని ఈ పాత నోట్లను ప్రభుత్వం ఏం చేసుకుంటుంది? కుప్పలుగా పోసి తగులబెట్టేస్తుందా? లేక ఇంకేమైనా చేస్తుందా? ఈ సందేహాలే ప్రస్తుతం చాలామందికి వచ్చాయి. కానీ సమాధానం లేక గూగుల్ పై పడుతున్నారు! అయితే తాజాగా ఈ ప్రశ్నపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు సమాధానమిచ్చారు.

ఈ విషయాలపై స్పందించిన ఆర్బీఐ... ప్రస్తుతం ప్రజల వద్దనుంచి తీసుకుంటున్న పాత పెద్ద నోట్లను రిజర్వ్‌ బ్యాంకుకు చెందిన ఇష్యూ ఆఫీసుల వద్ద ఉంచుతుందట. అక్కడ ఈ పాతనొట్లన్నింటినీ పరిశీలించి వాటిని రీసైక్లింగ్‌ కి పనికొచ్చేవాటిగా, పనికిరానివాటిగా వేరుచేస్తుందట. దీనికి "కరెన్సీ వెరిఫికేషన్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ (సీవీపీఎస్‌)" ను వినియోగిస్తారు అని ఆర్బీఐ వెల్లడించింది. అయితే ఇలా పనికిరాని నోట్లను వేగంగా, పర్యావరణహిత విధానంలో చలామణిలోంచి తప్పించే వ్యవస్థను 2003లో అప్పటి ఆర్బీఐ గవర్నర్‌ బిమల్‌ జలన్‌ ప్రవేశపెట్టారు.

ఈ పద్దతి ప్రకారం ఒక్కో సీవీపీఎస్‌ గంటలో సుమారు 60 వేల నోట్లను ప్రాసెస్‌ చేస్తుందట. ఆ సమయంలో రీసైక్లింగ్ కి పనికొచ్చే నోట్లను, నకిలీ నోట్లను వేరుచేస్తుందట. అలా వేరుచేసిన వాటిలో పనికిరాని నోట్లను ముక్కలు ముక్కలు చేసేస్తుండగా... పనికొచ్చేవాటిని మళ్లీ నోట్ల తయారీకి అవసరమైన కాగితంగా మార్చేవిధంగా జాగ్రత్తగా కట్‌ చేస్తుందట. అలా కత్తిరించేసిన పనికిరాని నోట్ల ముక్కలను పేపర్‌ వెయిట్లు - క్యాలెండర్లు - ఫైళ్ల వంటివాటిని తయారుచేయడానికి ఉపయోగిస్తారట. అయితే ఈ సీవీపీఎస్‌ ఏర్పాటు కాక ముందు రోజుల్లో పనికిరాని నోట్లను ముక్కలుగా చేసి కాల్చేసేవారు. దీంతో విపరీతమైన కాలుష్యం వెలువడేది! అయితే సీవీపీఎస్‌ వచ్చాక ఆ సమస్య లేదు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/