Begin typing your search above and press return to search.

ఆన్లైన్ సినిమా టికెట్ల విక్ర‌యంపై ఏపీ హైకోర్టు ఏం చెప్ప‌నుంది?

By:  Tupaki Desk   |   30 Jun 2022 8:30 AM GMT
ఆన్లైన్ సినిమా టికెట్ల విక్ర‌యంపై ఏపీ హైకోర్టు ఏం చెప్ప‌నుంది?
X
ఆంధ్రప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వ‌మే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయించ‌డంపై హైకోర్టులో జూన్ 28, 29 తేదీల్లో రెండు రోజుల‌పాటు వాద‌నలు జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో హైకోర్టు జూలై 1న త‌న తీర్పును ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపింది. సినిమా టికెట్లను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించుకునేందుకు వీలుగా ప్రభుత్వం తెచ్చిన సవరణ చట్ట నిబంధనలతో పాటు ఉత్తర్వులను సవాలు చేస్తూ బుక్‌ మైషో యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ వ్యాజ్యాలు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజుల ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. కొంతకాలం ప్రభుత్వం తెస్తున్న వ్యవస్థను కొనసాగనిద్దామని, అప్పుడు మీరు (బుక్‌ మైషో) వ్యక్తం చేస్తున్న భయాందోళనలు నిజమో కాదో తేలిపోతుందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. బాహుబలికి 50 శాతం ఆక్యుపెన్సీ..

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. సినీ ప్రేక్షకుల ప్రయోజనాలను పరిరక్షించేందుకే ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థను తీసుకొస్తున్నామని తెలిపారు. బుక్‌ మైషో లాంటి సంస్థలు రకరకాల చార్జీల పేరుతో చేస్తున్న దోపిడీని అడ్డుకునేందుకే ప్రభుత్వం రంగంలోకి దిగిందన్నారు. ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థను ఏపీఎఫ్‌డీసీ ద్వారా అనుసంధానం చేస్తున్నామన్నారు. ఆన్‌లైన్‌ టికెట్లను 50 శాతం సీటింగ్‌ కెపాసిటీకి పరిమితం చేసి మిగిలిన టికెట్లను థియేటర్‌లో నేరుగా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా వంద శాతం టికెట్‌లను ఆన్‌లైన్‌లో బ్లాక్‌ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నాయన్నారు. రూ.100 బేస్‌ రేటు కలిగిన టికెట్‌ను బుక్‌ మై షో రూ.145కు విక్రయిస్తోందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. టికెట్‌ విక్రయాల్లో ఏ మాత్రం పారదర్శకత పాటించడం లేదన్నారు. దేశంలోనే అత్యధిక గ్రాస్‌ సాధించిన బాహుబలి–2 సినిమాకు కేవలం 50 శాతం ఆక్యుపెన్సీనే బుక్‌ మైషో లాంటి సంస్థలు చూపాయని నివేదించారు.

ఏపీ ఎఫ్‌డీసీతో అనుసంధానానికి అత్యధిక థియేటర్లు అంగీకరించాయన్నారు. పన్ను ఎగవేతలకు కూడా అడ్డుకట్ట పడుతుందన్నారు. ఆన్‌లైన్‌ టికెట్‌ విక్రయాలపై తామేమీ నిషేధం విధించలేదని, నియంత్రణ మాత్రమే చేస్తున్నామన్నారు. కొత్త పోర్టల్‌ వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రభుత్వానికి 2 శాతం లోపు సర్వీస్‌ చార్జి చెల్లిస్తే సరిపోతుందన్నారు. ప్రభుత్వం పోటీదారుగా వ్యవహరించదని ధర్మాసనానికి స్పష్టత ఇచ్చారు.

ఇక బుక్‌ మైషో తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థ ద్వారా గుత్తాధిపత్యం ఏర్పడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని ఇలాంటి వ్యవస్థ వల్ల వ్యాపారం చేయడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వానికి 2 శాతం సర్వీసు చార్జీ చెల్లించాలంటే తాము వినియోగదారుడి నుంచి అధిక మొత్తాలు వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వం వద్దకే వెళతారని, అంతిమంగా తమ వ్యాపారాలు మూతపడతాయని నివేదించారు. జూలై 2 నుంచి కొత్త విధానం అమలు చేయకుండా యథాతథస్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

ఇక జూలై 2 నుంచి కొత్త విధానం అమలుకు ఏపీఎఫ్‌డీసీతో ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తరఫు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి నివేదించారు. లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని బెదిరిస్తోంద‌న్నారు. ఒప్పందాల కోసం ఒత్తిడి చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ సమయంలో ఏజీ శ్రీరామ్‌ జోక్యం చేసుకుంటూ 80 శాతం థియేటర్లకు బీ లైసెన్సులు లేవని తెలిపారు. ఈ నేప‌థ్యంలో అంద‌రి వాద‌న‌లు విన్న హైకోర్టు విచార‌ణ‌ను జూలై 1 శుక్ర‌వారానికి వాయిదా వేసింది. ఆ రోజు ఈ విష‌యంపై తీర్పు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.