Begin typing your search above and press return to search.

ఫీజులు కట్టకపోతే ఏమి చేస్తుంది ప్రభుత్వం ?

By:  Tupaki Desk   |   1 Dec 2021 6:30 AM GMT
ఫీజులు కట్టకపోతే ఏమి చేస్తుంది ప్రభుత్వం ?
X
ఖాతాల్లో జమ అయిన వారం పది రోజుల్లోనే తల్లులందరు కళాశాలల ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత తల్లులపై ఉందని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. జగనన్న విద్యాదీవెన పథకం క్రింద ప్రభుత్వం విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రు. 686 కోట్ల జమచేసింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతు తమ ఖాతాల్లో డబ్బులు జమైన వారం పది రోజుల్లోనే కళాశాలలకు వెళ్ళి ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత తల్లులపైనే ఉందని స్పష్టంగా చెప్పారు.

ఈ పథకం ద్వారా 11.03 లక్షల మంది విద్యార్ధులకు లబ్ది జరుగుతుందని జగన్ ప్రకటించారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం ఈ పథకం క్రింద రు. 6259 కోట్లు జమచేసిందన్నారు. ఇందులోనే చంద్రబాబునాయుడు ప్రభుత్వం బకాయిలు పెట్టిన రు. 1778 కోట్లు కూడా ఉందని గుర్తుచేశారు. విద్యార్ధుల చదువులకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.

ఇదే సమయంలో తమ ఖాతాల్లో పడిన డబ్బులను కళాశాలలకు వెళ్ళి ఫీజులు కట్టకపోతే తర్వాత విడత నేరుగా కళాశాలల ఖాతాల్లోనే జమచేస్తామని కూడా హెచ్చరించారు. ఇంతకీ తల్లుల ఖాతాల్లోనే ఫీజులను ఎందుకు జమ చేస్తున్నట్లు ? ఎందుకంటే కనీసం ఫీజు కట్టడానికి అయినా తల్లులు, తల్లులతో పాటు తండ్రులు కళాశాలలకు వెళతారన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ప్రభుత్వ ఉద్దేశ్యం బాగానే ఉందికానీ ఆచరణలో ఎంతవరకు వర్కవుటవుతుందన్నదే అనుమానం.

ఎందుకంటే ఒకసారి తమ ఖాతాల్లో డబ్బులు పడిన తర్వాత తల్లులకు ముందుగా ఇంట్లోని అవసరాలే గుర్తుకొస్తాయి. ఒకవేళ తల్లులకు రాకపోయినా తండ్రులకైనా గుర్తుకు రాకమానదు. ఒకసారి ఆ డబ్బులను తండ్రులు సొంతవసరాలకు వాడుకునేస్తే తల్లులు చేయగలిగేదేమీ లేదు. తల్లులు పద్దతిగా ఉంటే అప్పుడు తల్లి-దండ్రుల మధ్య గొడవలు తప్పవు. ఈ తలనొప్పులను పక్కనపెట్టేస్తే ప్రభుత్వమే నేరుగా కళాశాలల ఖాతాల్లో వేసేస్తే విద్యార్ధులకు ఫీజలు కట్టలేదనే సమస్య ఉండదు.

ఒక విడత ఫీజు కట్టకపోతే తర్వాత నుండి కళాశాలల ఖాతాలోనే వేస్తామంటే అర్ధమేంటి ? మరి మిస్సయిన ఫీజును కళాశాలల యాజమాన్యం ఎందుకు వదులుకుంటుంది ? ప్రభుత్వం ఏ విధంగా తల్లుల నుండి తిరిగి రాబడుతుంది ? ఈ తలనొప్పులు ఉండకూడదంటే ఏదో ఒక మెకానిజం డెవలప్ చేసి నేరుగా కళాశాలల ఖాతాల్లోనే జమచేస్తేనే విద్యార్ధులకు ఎక్కువ ఉపయోగం ఉంటుందేమో ?