Begin typing your search above and press return to search.

'రాజ‌కీయ‌' వ్యాపార‌వేత్త‌ల‌కు ఐటీ సోదాలు లేవా?

By:  Tupaki Desk   |   13 Oct 2018 11:38 AM GMT
రాజ‌కీయ‌ వ్యాపార‌వేత్త‌ల‌కు ఐటీ సోదాలు లేవా?
X
ఫ‌లానా నేత‌ల‌పై ఐటీ సోదాలు....కాదు కాదు దాడులు...అరాచ‌కాలు....నేరం...ఘోరం...అంటూ కొద్ది రోజులుగా ఏపీలో ఓ వ‌ర్గం మీడియా గ‌గ్గోలు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి ఐటీ శాఖ నిర్వ‌హించే సోదాలు...త‌నిఖీల‌ను....త‌మ‌కు అనుకూలంగా మార్చుకొని సింప‌తీ కొట్టేయ‌డానికి ఓ వ‌ర్గం....దానికి దాడులు అనే ప‌దాన్ని వాడుక‌లోకి తెచ్చాయి. త‌మ‌ను కావాల‌నే కేంద్రం టార్గెట్ చేసింద‌ని టీడీపీ నేత‌లు ఎమోష‌నల్ డైలాగ్స్ చెబుతోన్న సంగ‌తి తెలిసిందే. కేవలం బీజేపీని విమ‌ర్శించినందుకే త‌మ‌పై ఐటీ శాఖ ద్వారా క‌క్ష సాధిస్తోంద‌ని వారు ఆరోపిస్తున్నారు. అయితే, ఇపుడు ఐటీ సోదాలకు గురవుతోన్న రాజ‌కీయ నేత‌లంతా గ‌తంలో బ‌డా వ్యాపార వేత్త‌లేన‌న్న సంగ‌తి వారు మ‌ర‌చిన‌ట్లున్నారు. అటువంటపుడు వారంతా ఐటీ సోదాల‌కు అతీతులు కాద‌న్న విష‌యాన్ని ఎలా విస్మ‌రించార‌న్న‌ది కామ‌న్ సెన్స్ ఉన్న ప్ర‌శ్న‌.

మంత్రి నారాయణ - బీద‌ మస్తాన్ రావు - సీఎం రమేశ్ - సుజనా చౌదరి - పోతుల రామారావు.....వీరంతా బిజినెస్ మ్యాన్ నుంచి పొలిటిషియ‌న్ లుగా మారిన వారు. ప‌ద‌వులు చేప‌ట్టాక త‌మ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించి విప‌రీతంగా అర్జించారు. ఆ ర‌కంగా స‌క్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ క‌మ్ పొలిటిషియ‌న్ లుగా చ‌లామ‌ణీ అవుతున్నారు. ఈ క్ర‌మంలో త‌మ లొసుగులు దాచిపెట్టి చేసిన వ్యాపారాల‌పై ఐటీ సోదాలు జ‌ర‌గ‌డం వారికి కంట‌గింపుగా మారింది. ఒక రాజ‌కీయ‌వేత్త క‌మ్ పారిశ్రామిక‌వేత్త చేసిన వ్యాపారంలో అవ‌క‌త‌వ‌క‌లుంటే వాటిని బ‌య‌ట‌పెట్ట‌డం క‌క్ష‌సాధింపెలా అవుతుంది? అయితే, గ‌తంలోనే కొంద‌రు టీడీపీ నేత‌ల‌పై ఐటీ సోదాలు జ‌ర‌గాల్సి ఉన్నా....బీజేపీతో మైత్రి కార‌ణంతో అవి ఆగిపోయాయి. దీంతో, ఇపుడు సోదాలు జ‌ర‌గ‌డం వెనుక కేంద్రం హ‌స్తం లేద‌ని పూర్తిగా చెప్ప‌నూలేము. త‌మ రాజకీయ ప్ర‌త్యర్థుల‌పై ఐటీ - సీబీఐ - ఈడీ పేర్ల‌తో కేంద్రం కుట్ర‌లు ప‌న్నుతుంద‌న‌డానికి శశిక‌ళ ఉదంతం నిద‌ర్శ‌నం.