Begin typing your search above and press return to search.

పౌరసత్వ చట్టం పై పవన్ వైఖరి ఏంటి .... అంత దమ్ముందా ?

By:  Tupaki Desk   |   14 Dec 2019 5:51 AM GMT
పౌరసత్వ చట్టం పై పవన్ వైఖరి ఏంటి .... అంత దమ్ముందా ?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ...ప్రస్తుతం పార్టీ నిర్మాణం లో చాలా బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు పార్టీ నిర్మాణం చూస్తూనే మరో వైపు ప్రజా సమస్యల పై పోరాడుతున్నారు. ఇటీవలే రైతుల కోసం జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా రైతు సౌభాగ్య దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే పవన్ రాజకీయాలలోకి వచ్చే ముందు ..నాకు అధికారం ముఖ్యం కాదు ..ప్రజలకి మంచి చేయడమే నా లక్ష్యం అంటూ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు.

చెగువేరా ముద్దు బిడ్డ‌ గా తనని తాను ప్రకటించుకున్నారు. అలాగే ల‌క్ష‌లాది పుస్త‌కాలు, కోట్లాది మంది ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను చ‌దివిన ప్రజానాయకుడు ..తాజాగా కేంద్ర ప్రభత్వం తీసుకువచ్చిన పౌరసత్వం చట్టం పై జనసేనాని వైఖరి ఏంటి ? అనేది మాత్రం ఎక్కడా చెప్పలేదు. పార్టీ పరంగా చూస్తే జ‌న‌సేన పార్టీకి అసెంబ్లీలో ఒకే ఒక్క‌రు ప్రాతినిథ్యం వ‌హిస్తుండ‌గా, పార్ల‌మెంట్లో ఏ ఒక్క‌రూ లేరు. పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న మ‌న రాష్ట్రంలోని పాల‌క‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఉభ‌య‌స‌భ‌ల్లో మోడీ స‌ర్కార్‌కు అండ‌గా నిలిచాయి.

ఇక తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్ఎస్ మాత్రం మోడీకి వ్య‌తిరేకంగా ఓటు వేసింది. అయితే , పౌరసత్వం బిల్లు మాత్రం పార్లమెంట్ లో ఆమోదం పొంది , ఆ తరువాత రాష్ట్రపతి ఆమోదం కూడా పొంది చట్టంగా అమల్లోకి వచ్చినప్పటికీ , అపరమేధావి అయినటువంటి జనసేన అధినేత మాత్రం ఈ పౌరసత్వ చట్టం పై తన అభిప్రాయాన్ని మాత్రం చెప్పలేదు. ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా స‌మ‌స్య‌ల ప్రాతిప‌దిక‌న స్పందిస్తానంటున్న ఈ చట్టం పై ఎవరివైపు అనేది తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ,ఇటీవలే ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ఏపీ ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నారు. భ‌వ‌న నిర్మాణ కార్మికుల స‌మస్య‌ల‌ పై విశాఖలో లాంగ్‌మార్చ్ చేశారు. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మాన్ని ప్ర‌వేశ పెట్టాల‌ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యం పై పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్తం చేసి , తెలుగుని చంపేయాల‌నుకుంటున్న జ‌గ‌న్ స‌ర్కార్ మ‌ట్టి కొట్టుకు పోతుంద‌ని శాప‌నార్థాలు పెట్టారు. కానీ , ఇదే లెవెల్ లో దేశంలో మతం పేరుతో ప్రజలని విడదీయాలని చూస్తున్నారని మోడీ కి వ్యతిరేకంగా నోరు తెరిచే ద‌మ్ము , దైర్యం ప‌వ‌న్‌కు ఉందా?