Begin typing your search above and press return to search.

ఏపీలో ఇసుక రీచ్ లలో తాజా పరిస్థితేంది?

By:  Tupaki Desk   |   7 Nov 2019 6:38 AM GMT
ఏపీలో ఇసుక రీచ్ లలో తాజా పరిస్థితేంది?
X
కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పాలనా పరంగా కుదురుకోవటానికి కాస్త టైం ఇవ్వటం ఎక్కడైనా ఉంటుంది. అందుకు భిన్నమైన రాజకీయ వాతావరణం ఏపీలో నెలకొందని చెప్పాలి. కేవలం నాలుగు నెలల క్రితమే ఏర్పాటైన ప్రభుత్వం మీద సాగుతున్న రచ్చ చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఏపీలోని విపక్షాలు అదే పనిగా.. లేని సమస్యను ఉన్నట్లుగా చూపించేందుకు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు.

ఇటీవల కాలంలో ఇసుక కొరత మీద సాగుతున్న హడావుడి భారీగా ఉన్న సంగతి తెలిసిందే. నిజంగానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా జరిగిన తప్పులతో ఈ కొరత ఉంటే దాన్ని తప్పు పట్టొచ్చు. వరద పోటు ఎక్కువగా ఉండటంతో ఇసుక లభ్యత తగ్గినప్పుడు.. దాన్ని బూచీగా చూపించి రాజకీయ లబ్థి పొందాలనుకోవటానికిమించిన సిగ్గుమాలినతనం మరొకటి ఉండదు.

నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వమే కాదు.. మరే సర్కారు ఉన్నా ఇసుక విషయంలో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. రాష్ట్రంలోని 275 ఇసుక రీచ్ లలో వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇసుకను వెలికితీయటానికి అవకాశం లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలో ఎవరున్నా సమస్య ఎదుర్కొనక తప్పదు. కానీ.. దాన్నో అవకాశంగా తీసుకొని ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయటం ఇప్పుడు జరుగుతున్నది.

ఇసుక కొరతపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ.. డైలీ బేసిస్ లో రివ్యూ చేస్తున్నారు. వరద కారణంగా ఇసుక రీచ్ లు మునిగిపోతున్న పరిస్థితి. ఇప్పుడిప్పుడే వరద తీవ్రత తగ్గుముఖం పడుతోంది. వరద తీవ్రత తగ్గిన చోట ఇసుకను వెలికి తీసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

రాష్ట్రంలోని మొత్తం275 రీచ్ లలో మొన్నటివరకూ61 రీచ్ లలో మాత్రమే ఇసుక వెలికి తీస్తున్నారు. ఇప్పుడది 83కు చేరుకుంది. రోజుకు సగటున41వేల టన్నుల ఇసుక నుంచి 69 వేల టన్నులకు పెరిగింది. వారం నుంచి పది రోజుల వ్యవధిలో లక్ష టన్నులకు పెంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

వాతావరణం అనుకూలిస్తే మరో 20 నుంచి 30 రోజుల వ్యవధిలోనే సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉందన్న మాట అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే.. ఏపీలోని విపక్షాలు గొంతెత్తి అదే పనిగా అరవటానికి వారికున్నది కేవలం మరో మూడు వారాల సమయం మాత్రమేనని చెప్పకతప్పదు.