Begin typing your search above and press return to search.

20 లక్షల ఖాతాలపై వాట్సప్‌ నిషేదం .. రీజన్ ఏంటంటే ?

By:  Tupaki Desk   |   16 July 2021 6:30 AM GMT
20 లక్షల ఖాతాలపై వాట్సప్‌ నిషేదం .. రీజన్ ఏంటంటే ?
X
వాట్సాప్ .. ఈ పేరు తెలియని వ్యక్తి ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మొబైల్ గురించి తెలిసిన వారికి , తెలియని వారికి కూడా ఈ వాట్సాప్ గురించి మాత్రం తెలిసే ఉంటుంది. స్మార్ట్‌ ఫోన్‌ లో వాట్సాప్‌ ఓ ముఖ్యభాగమైపోయింది. రోజు చాటింగ్‌ లు, పోస్టులు ఇలా, రకరకాల వాటికి వాట్సాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ, కొందరు తప్పుడు పోస్టులు చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఆ తర్వాహ పోస్టులపై వాట్సాప్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌ లో ఈ సంవత్సరం మే 15 నుంచి జూన్‌ 15 మధ్య 20 లక్షల అకౌంట్ల పై నిషేధం విధించినట్లు ప్రకటన విడుదల చేసింది.

ఆ మధ్య సమయంలో 345 మంది నుంచి తమకు ఫిర్యాదులు అందాయని, దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఐటీ నిబంధనలకు అనుగుణంగా తొలిసారి నెలవారీ కాంప్లియన్స్‌ నివేదికను వాట్సప్‌ గురువారం విడుదల చేసింది. హానికరమైన, అనుచిత సందేశాలు పెద్దమొత్తంలో ఎవరూ పంపకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, అలాంటి సందేశాలను అధికంగా పంపిస్తున్న ఖాతాలను గుర్తించడానికి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించుకుంటున్నామని వాట్సాప్‌ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐటీ రూల్స్‌ ప్రకారం 50 లక్షలకుపైగా ఖాతాదారులున్న ప్రతి సోషల్‌ మీడియా, డిజిటల్‌ వేదిక ప్రతినెలా కాంప్లయన్స్‌ నివేదిక విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రజల నుంచి తమకు అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను తప్పనిసరిగా తెలియజేయాలి.

హానికరమైన, అనుచితమైన సమాచారాన్ని అరికట్టడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాట్సాప్‌ యాజమాన్యం పేర్కొంది. ఖాతాల నుంచి ఇలాంటి సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. తప్పుడు సందేశాల వ్యాప్తికి కారణమవుతున్న ఖాతాలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాటిలో 95 శాతానికి పైగా ఖాతాలపై.. అధీకృతం కాని ఆటోమేటెడ్‌ సందేశాలను పంపడం వల్లే ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. డేటా సమీకరణకు తగినంత సమయం అవసరం. 30 నుండి 45 రోజుల తర్వాత తదుపరి నివేదికను సమర్పిస్తాం అని వాట్సప్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నెలనెలా సగటున దాదాపు 80 లక్షల ఖాతాలను ఆ కంపెనీ నిషేధిస్తుంటుంది. ఖాతాల నుంచి ఇలాంటి సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది