Begin typing your search above and press return to search.

డార్క్ మోడ్ లో వాట్సాప్.. ప్రయోజనం ఏమంటే?

By:  Tupaki Desk   |   26 Dec 2019 4:26 AM GMT
డార్క్ మోడ్ లో వాట్సాప్.. ప్రయోజనం ఏమంటే?
X
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఉపయోగించే యాప్ లలో వాట్సాప్ ఒకటి. ఈ యాప్ ను వినియోగించని వారిని నూటికి ఒక్కరిని కూడా చూడలేమేమో? సోషల్ మీడియాలు ఎన్ని ఉన్నా.. వాట్సాప్ తర్వాతే ఏదైనా అన్నట్లుగా మారిపోయింది. జీవితంలో భాగంగా మారిన వాట్సాప్.. ఇవాల్టి రోజున పని చేయటం మారితే.. చుట్టూ ఉన్న ప్రపంచం స్తంభించిపోయే పరిస్థితి. అంతలా ప్రభావితం చేస్తున్న వాట్సాప్.. ఎప్పటికప్పుడు తనను తాను అప్ డేట్ చేసుకోవటమే కాదు.. కొత్త తరహా ఫీచర్లను తీసుకొస్తూ నిరంతరం తనతో ఎంగేజ్ అయ్యేలా చేస్తుందని చెప్పాలి.

ఎంతోకాలంగా వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్ వినియోగదారుల్ని ఊరిస్తోంది. ఎప్పుడెప్పుడు ఈ ఫీచర్ వస్తుందా? అని పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు. సాధారణంగా వైట్ బ్యాక్ గ్రౌండ్ నల్లని అక్షరాలతో ఉండే బదులు.. డార్క్ మోడ్ లో బ్యాక్ గ్రౌండ్ నలుపు.. తెల్ల అక్షరాలు ఉంటాయి. దీని కారణంగా కళ్లకు తక్కువ శ్రమ కలగటమే కాదు..రాత్రిళ్లు యాప్ ఉపయోగించే సమయంలో మరింత సౌకర్యంగా ఉంటుంది.

త్వరలో అందరికి అందుబాటులోకి రానున్న వాట్సాప్ డార్క్ మోడ్ ఇప్పటికే కొందరు వినియోగదారులు వినియోగిస్తున్నారు. టెస్టింగ్ కోసం ఈ సౌకర్యాన్ని కొందరికి అందిస్తున్నారు. వాట్సాప్ డార్క్ మోడ్ అండ్రాయిడ్ వెర్షన్ ను దాదాపుగా పూర్తి కావొస్తుండగా.. యాపిల్ ఫోన్లలో వినియోగించేందుకు వీలుగా ఐఓఎస్ వెర్షన్ చివరిదశలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఫీచర్ కూడా వాట్సాప్ కు వచ్చేస్తే.. మరింత సౌకర్యవంతంగా మారుతుందని చెప్పక తప్పదు.