Begin typing your search above and press return to search.

వాట్సాప్ డౌన్లోడ్స్ ఢమాల్

By:  Tupaki Desk   |   6 Nov 2019 5:20 AM GMT
వాట్సాప్ డౌన్లోడ్స్ ఢమాల్
X
వాట్సాప్.. చాలామందికి పొద్దున లేవగానే ఈ మెసేజింగ్ యాప్ తెరిస్తే గానీ రోజు మొదలవదు. ఫోన్లు, ఫోటోల షేరింగ్, వీడియో కాలింగ్ అన్నింటికీ వాట్సాపే అనేంతగా జనానికి ఒక అత్యవసరంగా మారింది. అలాంటి వాట్సాప్ కి ఈ మధ్య గడ్డుకాలం మొదలైనట్టే కనిపిస్తోంది. స్పై వేర్ వివాదం చుట్టుముట్టిన తర్వాత ఈ సోషల్ మీడియా యాప్ డౌన్లోడ్స్ దారుణంగా పడిపోయాయి. మొబైల్ మేధో విశ్లేషణ సంస్థ సెన్సర్ టవర్ గణాంకాల ప్రకారం ఇండియాలో అక్టోబరు 26 నుంచి నవంబరు 3 మధ్యన డౌన్లోడ్స్ గత తొమ్మిది రోజులతో పోల్చుకుంటే ఏకంగా 89లక్షల నుంచి లక్షా ఎనభై వేలకు 80 శాతం పడిపోయాయి. ఇదిలాగే కొనసాగితే వాట్సాప్ జనం స్మార్ట్ ఫోన్ నుంచి కనుమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదంటోంది ఆ సంస్థ.

దీనంతటికీ కారణం అక్టోబరు 17 నుంచి వాట్సాప్ ఇజ్రాయెల్ కి చెందిన ఎమ్మెస్వో గ్రూప్ మధ్య నడుస్తున్న వివాదమే. ఎమ్మెస్వో పెగాసుస్ అనే స్పై మాల్వెర్ సాఫ్ట్వేర్ తయారుచేసి వాట్సాప్ తో సహా ఇతర సోషల్ మీడియా యాప్స్ లోకి ప్రవేశపెట్టిందని వాట్సాప్ ఆరోపిస్తోంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా పౌరహక్కుల కార్యకర్తలు, లాయర్లు, పాత్రికేయులను లక్ష్యంగా చేసుకొని వాళ్ళందరి సమాచారం చోరీ చేసింది. ఎంపిక చేసిన వ్యక్తులకు ఆఫర్ పేరుతో ఒక లింక్ పేమిస్తారు. దానిపై క్లిక్ చేయగానే వాళ్లకు సంబంధించిన ఫోన్ కాల్స్,ఎస్సెమ్మెస్, లొకేషన్, బ్యాంకు లావాదేవీలు.. ఇలా ప్రతి సమాచారం దొంగిలిస్తుందట పెగాసుస్. ఈ రకంగా ఇండియాలో 121 మంది ఫోన్లు హ్యాకింగ్ కి గురయినట్టు తెలుస్తోంది. అందులో అత్యధికులు వివిధ మీడియా సంస్థల్లో పని చేస్తున్న ప్రముఖ జర్నలిస్టులే కావడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. దాంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి వాట్సాప్ ని వివరణ కోరింది.

కానీ ఇప్పటిదాకా వాట్సాప్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో జర్నలిస్ట్ లు, బ్యూరోక్రాట్లు ఈ యాప్ ని టార్గెట్ చేసారు. వాట్సాప్ హ్యాక్ అయిందనీ, అది సురక్షితం కాదని సామజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఫలితమే జనం ప్రత్యామ్నాయ టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్ కి మారిపోతున్నారు. ఈ మూడు రోజుల్లోనే టెలిగ్రామ్ 8.4 లక్షల నుంచి 9.2 లక్షల డౌన్లోడ్స్ పెంచుకుంది. సిగ్నల్ ఆరువేల నుంచి 10 వేల డౌన్లోడ్స్ అయ్యాయి. ఇది ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వాట్సాప్ ఎమ్మెస్వో వివాదం ఇంకా ముదిరితే అది వాట్సాప్ కి పెద్ద దెబ్బేనని భారత్ లో టెలిగ్రామ్ బాగా పుంజుకొని వాట్సాప్ ప్రాభవం కోల్పోతుందని నిపుణులు అంటున్నారు.