Begin typing your search above and press return to search.

మోడీ స‌ర్కార్ సూచ‌న‌కు వాట్సాప్ నో!

By:  Tupaki Desk   |   24 Aug 2018 4:33 AM GMT
మోడీ స‌ర్కార్ సూచ‌న‌కు వాట్సాప్ నో!
X
అన్నింటి గురించి తెలుసుకోవాల‌నుకునే ఆలోచ‌న మంచిదే. కానీ..అన్ని సంద‌ర్భాల్లో అలాంటిది సాధ్యం కాదు. మోడీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మీడియాను ఎంత‌లా ప్ర‌భావితం చేసిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వ్య‌క్తిత్వ వికాస నిపుణుల‌కు పెద్ద‌న్న‌లా మాట్లాడే మోడీ మాట‌ల‌కు.. చేత‌ల‌కు మ‌ధ్య‌నున్న అంత‌రాన్ని మీడియా సంస్థ‌లు ఎప్పుడో గుర్తించాయి. విప‌రీత‌మైన ప్రజాద‌ర‌ణ ఉన్న మోడీ లాంటి నేత‌తో పెట్టుకునేందుకు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు ఏమీ సిద్ధంగా లేవ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఒక‌ప్పుడు పాత్రికేయ నిబ‌ద్ధ‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌న్న ప‌ట్టుద‌ల మీడియా సంస్థ‌ల అధినేత‌ల‌కు ఉండేది. తాము చేసేది వ్యాపారం ఎంత‌మాత్రం కాద‌ని.. అదో త‌ప‌స్సులా ఫీల‌య్యే మీడియాధినేత‌లు ఇప్పుడు చాలా త‌క్కువ‌. ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థ‌లు.. బ‌ల‌మైన ఆర్థిక మూలాలు ఉన్న రాజ‌కీయ నేత‌లు,, రియ‌ల్ ఎస్టేట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు మీడియాలోకి రావ‌టం మొద‌లైందో అప్ప‌టి నుంచే మీడియా వ్యాపార ముఖ‌చిత్రం మారిపోయింది.

ఇలాంటి వారిని ఎలా త‌మ‌కు త‌గ్గ‌ట్లుగా మార్చుకోవాల‌న్న విష‌యాన్ని మోడీ బ్యాచ్ కు ప్ర‌త్యేకంగా నేర్పించాల్సిన అవ‌స‌రం లేదు. అందుకే.. త‌మ‌ను వ్య‌తిరేకించే వ్య‌వ‌స్థ‌ల్ని ఎలా నిర్వీర్యం చేయాలో మోడీషాల‌కు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలీద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. వాట్సాప్ లో స‌ర్క్యులేట్ అయ్యే మేసేజ్ మూలాల్ని తెలుసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించాలంటూ మోడీ స‌ర్కారు డిమాండ్ చేసింది. ఇలా చేసిన‌ప‌క్షంలో న‌కిలీ వార్త‌ల ప్ర‌చారానికి అడ్డుక‌ట్ట వేయొచ్చ‌న్న మాటను చెప్పింది. మామూలుగా అయితే ఓకే కానీ.. ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌.. ఈ త‌ర‌హా డిమాండ్ ను తెర మీద‌కు తీసుకురావ‌టంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

మోడీషాలు ఏమీ సుద్ద‌పూస‌లు.. టెక్నాల‌జీ అన్న‌ది తెలీని వారు కాదు. సాంకేతిక‌త సాయంతో అధికారాన్ని ఎలా సొంతం చేసుకోవ‌చ్చ‌న్న విష‌యాన్ని 2014 ఎన్నిక‌ల్లో సోష‌ల్ మీడియానుఆయుధంగా చేసుకొని ఎంత‌లా ప్ర‌చారాన్ని చేప‌ట్టారో.. మోడీ హైప్ ను ఎంత‌లా పెంచారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అలాంటి వారు.. అధికారంలో ఉన్న వేళ‌.. వాట్సాప్ లో స‌ర్క్యులేట్ అయ్యే మూలాలు తెలుసుకునే వీలు త‌మ‌కు క‌ల్పించాల‌న్న భార‌త్ డిమాండ్ వాట్సాప్ నో చెప్పేసింది.

అలా చేస్తే తాము ప్ర‌ముఖంగా చెప్పే ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్ష‌న్ కు భంగం వాటిల్లుతుంద‌న్న విష‌యాన్ని చెప్పింది. మేసేజ్ ల మూలాలు తెలుసుకునే వీలు క‌ల్పిస్తే.. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్ష‌న్ క.. వాట్సాప్ కు ఉండే ప్రైవేటు స్వ‌భావానికి విఘాతం క‌లుగుతుంద‌ని.. దుర్వినియోగం చేసే అస్కాం ఉంటుంద‌ని తేల్చేసింది. ఈ విష‌యాన్ని చెప్ప‌టానికి కాస్త ముందే.. వాట్సాప్ అధిప‌తి క్రిస్ డేనియ‌ల్స్‌.. కేంద్ర ఐటీ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ తో భేటీ కావ‌టం గ‌మ‌నార్హం. దాదాపు 20 కోట్ల మంది భార‌తీయులు వాట్సాప్ ను వాడుతున్న వేళ‌.. అంత పెద్ద మార్కెట్ ను మోడీ స‌ర్కారు కోరిన‌ట్లుగా చేస్తే.. త‌మ వ్యాపార మూలాలు క‌దిలిపోతాయ‌ని క్రిస్ కు మాత్రం తెలీదా ఏంటి?