Begin typing your search above and press return to search.

వాట్సాప్ షాకింగ్ ప్రకటన ... దాన్ని వాయిదా వేయడం కుదరదట !

By:  Tupaki Desk   |   18 May 2021 7:38 AM GMT
వాట్సాప్ షాకింగ్ ప్రకటన ... దాన్ని వాయిదా వేయడం కుదరదట !
X
మే 15 నుంచి అమలులోకి వచ్చిన కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేయడం కుదరదని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పష్టం చేసింది. ప్రస్తుత వాట్సాప్ వినియోగదారులు తమ ఈ కొత్త విధానాన్ని అంగీకరించకపోతే వారి ఖాతాలను క్రమంగా తొలగిస్తామని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ స్పష్టం చేసింది. ఈ మేరకు వాట్సాప్ తరఫున కపిల్ సిబాల్ ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. తమ కొత్త విధానాన్ని అంగీకరించాలని వినియోదారులకు ఇప్పటికే కోరామని , అయితే వినియోదారులు ఈ కొత్త విధానాన్ని అంగీకరించపోతే వారి ఖాతాలు తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ విధానం అమలును వాయిదా వేయడం లేదని కోర్టుకు తెలిపారు.

కేంద్రం తరపున ఢిల్లీ హై కోర్టులో వాదనలు వినిపించిన అడిషనల్ సాలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాట్సాప్ పిటిషన్‌ పై స్పందిస్తూ, వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇన్‌ ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 చట్టాన్ని ఉల్లంఘిస్తోంది అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయమై తమ అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ వాట్సాప్ సీఈఓకు కేంద్రం ఓ లేఖ రాసిందని, సీఈఓ నుంచి రిప్లై కోసం వేచిచూస్తున్నామని చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు. అయితే తమ విధానం ఐటీ నిబంధనలను ఉల్లంఘించడం లేదని వాట్సాప్ మరోమారు స్పష్టం చేసింది. అయితే వాట్సాప్ మథాతథ స్థితిని కొనసాగించాలని చేతన్ శర్మతో పాటు పిటీషనర్లు కోరారు. అయితే దీనికి నిరాకరించిన హైకోర్టు ఈ కేసు విచారణను జూన్ 3 కి వాయిదా వేసింది.