Begin typing your search above and press return to search.

వాట్సాప్‌ పై నిఘా పెట్టిన ఎన్ ఎస్‌ వో గ్రూప్..

By:  Tupaki Desk   |   31 Oct 2019 9:25 AM GMT
వాట్సాప్‌ పై నిఘా పెట్టిన ఎన్ ఎస్‌ వో గ్రూప్..
X
ప్రస్తుతం ప్రపంచం మొత్తం -సోషల్ మీడియా లో మునిగి తేలుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా కేవలం క్షణాల వ్యవధిలోనే అందరికి తెలిసిపోతుంది. ఏడాది వయస్సు ఉన్న పసిపిల్లల నుండి 70 ఏళ్ల పండు ముసలివారి వరకు అందరూ సోషల్ మీడియా ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కొంత ప్రయోజనం ఉన్నప్పటికీ ... చాలామంది దీన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోలేక లేని పోని సమస్యలని తెచ్చుకుంటున్నారు.

తాజాగా ప్రముఖ ఫేస్‌ బుక్‌ కు చెందిన పాపులర్ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌‌ షాకింగ్ విషయాలను బయటపెట్టింది. దేశంలోని పలువురు జర్నలిస్టులు - మానవ హక్కుల కార్యకర్తలకు సంబంధించిన వాట్సాప్‌ అకౌంట్లపై ఇజ్రాయిల్‌ కు చెందిన స్పైవేర్ పెగసస్ ద్వారా నిఘా పెట్టినట్టు తెలిపింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ ఎస్‌ వో గ్రూప్ దాదాపు 1400 వాట్సాప్ వినియోగదారులను పెగసస్ అనే నిఘా సాఫ్ట్‌ వేర్‌ తో టార్గెట్ చేసిందనే విషయం బయటపడింది.

అమెరికాకు చెందిన కార్ల్ ఉగ్ మాట్లాడుతూ .. భారతీయ జర్నలిస్టులు - మానవ హక్కుల కార్యకర్తలను నిఘా సాఫ్ట్‌ వేర్ ద్వారా టార్గెట్ చేశారు. ఎవరినీ - ఏ ఏ నంబర్లపై దృష్టి పెట్టారనే విషయాన్ని వెల్లడించలేను. అయితే పెద్ద సంఖ్యలో మాత్రం కాదని మాత్రం చెప్పగలను అని తెలిపారు. వారు టార్గెట్ చేసిన వారిలో విద్యావేత్తలు - లాయర్లు - దళిత నాయకులు - జర్నలిస్టులు ఉన్నారు.

ఇదిలా ఉండగా - ఎన్ ఎస్‌ వో - క్యూ సైబర్ టెక్నాలజీస్‌ - వాట్సాప్‌ పై దాఖలైన పిటిషన్లలో తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి. యూఎస్ - కాలిఫోర్నియా చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా వాట్సాప్ నిబంధనలను కూడా తుంగలో తొక్కిందని ఆరోపించింది. అయితే తమ సంస్థపై వచ్చిన ఆరోపణలపై ఎన్ ఎస్‌ వో గ్రూప్ స్పందించింది. మాపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వాటికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తాం. జర్నలిస్టులు - మానవ హక్కుల కార్యకర్తలను టార్గెట్ చేయడానికి మా సాంకేతికతను డిజైన్ చేయలేదు - లైసెన్స్ ఇవ్వలేదు అని స్పష్టం చేసింది. కాగా, సుమారు 40 వరకు పెగసస్ ఆపరేటర్లు భారత్‌ తోపాటు 45 దేశాల్లో నిఘా పెట్టిందని సెప్టెంబర్ 2018లో కెనడాకు చెందిన సెక్యూరిటీ సంస్థ సిటిజెన్ ల్యాబ్ వెల్లడించింది.