Begin typing your search above and press return to search.

బీజేపీ రోడ్ మ్యాప్ ఎప్పుడిస్తుంది?

By:  Tupaki Desk   |   1 Jun 2022 12:30 AM GMT
బీజేపీ రోడ్ మ్యాప్ ఎప్పుడిస్తుంది?
X
దాదాపు నెలన్నర క్రితం జనసేన ఆవిర్భావ సభలో అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతు వచ్చే ఎన్నికలకు సంబంధించి ముందుకెళ్ళే విషయంలో బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు రోడ్ మ్యాప్ వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇంకా ఎప్పుడు ఆ రోడ్ మ్యాప్ వస్తుందో ఎవరికీ తెలీదు. వచ్చే ఎన్నికల కోసం తాము బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నట్లు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆ మధ్య స్పష్టంచేశారు.

పవన్ ఏమో రోడ్ మ్యాపని చెబుతుంటే వీర్రాజేమో బ్లూ ప్రాంట్ అన్నారు. సరే రోడ్డు మ్యాపే లేకపోతే బ్లూ ప్రింట్ రెడీ అయ్యిందా అంటే ఏమీ రాలేదు. ఇంతలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.

జూన్ 23వ తేదీన జరగబోయే ఎన్నిక ఫలితం 26వ తేదీన ప్రకటిస్తారు. నామినేషన్లు వేయటం కూడా మొదలైంది. కనీసం ఉప ఎన్నిక కోసమైనా రోడ్ మ్యాప్ లేకపోతే బ్లూ ప్రింటో బయటకు రావాలి కదా.

ఇద్దరు చెప్పినవీ ఇంతవరకు బయటకు రాలేదు. పవన్ చెప్పిన రోడ్ మ్యాపంటే బీజేపీ అగ్రనాయకత్వం నుండి వచ్చేది. అదే వీర్రాజు చెప్పిన బ్లూ ప్రింటంటే రాష్ట్రంలోనే తయారయ్యేది. అంటే రెండింటిలోను బాగా తేడాలుండే అవకాశాలున్నాయని అర్ధమైపోతోంది.

నిజానికి ఇద్దరు చెప్పిన పద్దతులు వచ్చే ఎన్నికలకు సంబంధించింది. మరి తొందరలో జరగబోయే ఉపఎన్నిక మాటేమిటి ? ఇప్పటికే తమపార్టీ తరపున పోటీలో అభ్యర్ధి ఉంటారంటు వీర్రాజు చేసిన ఏకపక్ష ప్రకటనపై జనసేన నేతలు మండిపోతున్నారు.

ఉపఎన్నికలో ఎలాగూ జనసేన పోటీ చేయదు కాబట్టే తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించినట్లు కమలనాథులు సమర్దించుకుంటున్నారు. ఏదేమైనా ఆత్మకూరులో రెండుపార్టీలు కలిసికట్టుగా పనిచేస్తాయా ? లేకపోతే బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికల్లో జరిగినట్లే జరుగుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బద్వేలు పోటీచేసిన బీజేపీ అభ్యర్ధి తరపున పవన్ అసలు ప్రచారమే చేయలేదు. జనసేన లోకల్ నేతలు కూడా ఏదో తూతుమంత్రంగా ప్రచారం చేశామనిపించారు.