Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ లేచేదెప్పుడు? డే షెడ్యూల్ ఎలా ఉంటుందంటే?

By:  Tupaki Desk   |   17 Feb 2022 4:58 AM GMT
సీఎం కేసీఆర్ లేచేదెప్పుడు? డే షెడ్యూల్ ఎలా ఉంటుందంటే?
X
ఒక రాజకీయ పార్టీ అధినేత మీద ఎన్ని విమర్శలు.. ఆరోపణలు రాకూడదో.. అన్ని వచ్చినప్పటికీ.. ఆయన ఇమేజ్ ఇసుమంత కూడా తగ్గని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే అవుతారు. ఉద్యమ నేత నుంచి ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన రాజకీయ ప్రత్యర్థులు..ఆయన దినచర్యను తరచూ తప్పు పడుతుంటారు. లేటుగా పండుకొని.. అంతే ఆలస్యంగా నిద్ర లేస్తారని.. మధ్యాహ్నానానికి కానీ ఆయన దినచర్య మొదలుకాదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.

అసలు నిజాల కంటే కూడా అవాస్తవాలే త్వరగా వ్యాప్తి చెందుతుంటాయి.అందులోకి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అధినేత గురించి మాంచి మసాలా దట్టించిన అబద్ధాలు త్వరగా వెళ్లిపోతుంటాయి. చాలామంది సీఎం కేసీఆర్ పొద్దున ఆలస్యంగా లేస్తుంటారన్న అపోహలో ఉంటారు. కానీ.. ఆయన పొద్దుపొద్దున్నే 4.30 గంటల నుంచి ఐదు గంటల మధ్యనే లేవటమే కాదు.. దినపత్రికలు ఇంకా స్టాండ్లకు చేరక ముందే.. ఆయన చేతిలోకి తెప్పించుకోవటానికి ఇష్టపడుతుంటారు. అంతేకాదు.. వివిధ దినపత్రికల్లో ఆ రోజు ముఖ్యమైన వార్తలు ఏమిటో తెలుసుకోవటానికి ఆసక్తిని చూపిస్తారు.

చాలామంది ముఖ్యమంత్రులు.. పార్టీ అధినేతలు వార్తా పత్రికల్లో ముఖ్యమైన వార్తాంశాల్ని గుర్తించి.. ఎంపిక చేసే పని చేస్తుంటారు. కానీ.. కేసీఆర్ స్టైయిల్ ఇందుకు భిన్నం. ఆయన పేపర్ ను పట్టుకొని మొదలు నుంచి చివర వరకు క్షుణ్ణంగా చదువుతారు. అన్ని వార్తల్ని చదవటం.. ఆకళింపు చేసుుకోవటంలో ఆయన మిగిలిన వారి కంటే చాలా ముందుంటారు. అన్నింటికి మించి న్యూస్ పేపర్లను చదివే వేళలో.. ఎలాంటి డిస్ట్రబెన్స్ ను సహించరు. ఫోన్ కాల్స్ ను అసలే తీసుకోరు.

ప్రముఖ పత్రికలు మొదలుకొని.. పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని పేపర్ల వరకు అన్నింటిని చదవటం.. అందులో ఏదైనా అంశం మీద ఆసక్తికరమైన వివరాలు ఉన్నా.. స్టోరీ బాగున్నా.. వెంటనే సదరు రిపోర్టర్ నెంబరును తెప్పించుకోవటం.. వారితో మాట్లాడటం.. వారి నుంచి మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

ఒకవేళ.. సదరు జర్నలిస్టు మాటలు కేసీఆర్ కు నచ్చితే.. వారిని ఫాంహౌస్ కు ప్రత్యేకంగా పిలిపించుకొని.. వారితో మేధోమధనం చేపడతారు. క్షేత్రస్థాయిలో జరిగే అంశాలకు సంబంధించిన వివరాల్ని.. ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటారు. కేసీఆర్ లోని మరో టాలెంట్ ఏమిటంటే.. ఏదైనా వార్త చదివినప్పుడు దాని వెనుకున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటంతో పాటు.. రాసిన వారి ఆలోచనల్ని చదివేలా ఆయన తీరు ఉంటుంది. విశ్లేషణ కూడా అదే తీరులో సాగుతుంది.

ఇలా పేపర్లు అన్ని చదవి.. మొత్తం న్యూస్ చానళ్లనుఒకసారి చెక్ చేసి.. పుస్తకాలు చదివి.. స్నానం చేసిన తర్వాతే బయటకువస్తారు. ఇదంతా అయ్యేసరికి లంచ్ వరకు అవుతుందని చెబుతారు. సందర్శకుల్ని లేటుగా కలుస్తారన్న కంప్లైంట్ కు అసలు కారణం ఇదేనని చెబుతారు. ఏమైనా.. తెలుగు రాష్ట్రాల్లో దినపత్రికల్ని అసాంతం చదివి.. అర్థం చేసుకొని.. వివరాల్ని సేకరించే ఏకైక అధినేతగా కేసీఆర్ ను అభివర్ణిస్తుంటారు.