Begin typing your search above and press return to search.

భారత్​ కు బ్రెట్​ లీ సాయం.. మనవాళ్ల కంటే విదేశీయులే బెటర్​ కదా?

By:  Tupaki Desk   |   28 April 2021 5:32 AM GMT
భారత్​ కు బ్రెట్​ లీ సాయం.. మనవాళ్ల కంటే విదేశీయులే బెటర్​ కదా?
X
భారత్​లో కరోనా ఏ స్థాయిలో విలయ తాండవం చేస్తుందో చూస్తునే ఉన్నాం. ఆక్సిజన్​ అందక.. బెడ్లు దొరకక రోజుకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే రాజకీయపార్టీలు మాత్రం ఎన్నికల బిజీలో పడిపోయాయి. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వెరసి రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దాయాది దేశమైన పాకిస్థాన్​ కూడా మన మీద జాలి చూపించదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశంలో ఐపీఎల్​ కొనసాగుతోంది.

అయితే ఓ వైపు దేశంలో ఆక్సిజన్​ దొరక్క కోవిడ్​ రోగులు ప్రాణాలు కోల్పోతుంటే.. రూ. వేల కోట్లు ఖర్చుపెట్టి ఐపీఎల్​ నిర్వహించడం అవసరమా? అంటూ కొందరు క్రికెటర్లు ప్రశ్నిస్తుండటం గమనార్హం.మరోవైపు బీసీసీఐ మాత్రం మేము బయోబబుల్​ పద్ధతిలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఐపీఎల్​ నిర్వహిస్తున్నామని చెబుతోంది. ఐపీఎల్​ ను ఆపే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టింది. అయితే భారత్​ లో పరిస్థితికి ఆస్ట్రేలియా క్రికెటర్​ పాట్​ కమ్మిన్స్​ చలించిపోయాడు. అతడు ఏకంగా 50 వేల డాలర్లు భారత్​కు విరాళం ప్రకటించాడు. ఈ డబ్బుతో భారత్​ తో ఆక్సిజన్​ కొరత తీర్చుకోవాలని సూచించాడు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన మరో మాజీ క్రికెటర్​ బ్రెట్​లీ కూడా స్పందించాడు. భారత్​ కు రూ. 40 లక్షలు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు.

అయితే విదేశీ క్రికెటర్లు విరాళాలు ప్రకటిస్తుండటంతో.. మన దేశ క్రికెటర్లపై ఆరోపణలు వస్తున్నాయి. భారత్​ లో ఉన్న పరిస్థితి చూసి విదేశీ క్రికెటర్లు చలిస్తుంటే.. మన వాళ్ల నుంచి కనీస స్పందన ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజూ టీవీ ముందుకొచ్చి .. చేతులు శుభ్రపరుచుకోండి, శానిటైజర్​ వాడండి, మాస్కులు ధరించండి అంటూ నీతి సూత్రాలు చెబుతున్నారు తప్ప.. ఒక్కరు కూడా ఇంతవరకు రూపాయి విదిలించడం లేదని నెటిజన్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

మన దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితి పట్ల ప్రపంచ దేశాలు మొత్తం చలించిపోతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఎన్నికల ర్యాలీలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.రాజకీయ నాయకుల సభలు, సమావేశాలు కొనసాగుతున్నాయి. భౌతిక దూరం అన్న మాట చాలా మంది మరిచిపోయారు. ఓ వైపు ఆక్సిజన్​ దొరకక కోవిడ్​ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు శ్మశానాల వద్ద శవ జాగరణ కొనసాగుతున్నది.ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మన దేశంలోని సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు తమ వ్యాపార లెక్కలు చూసుకుంటూ గడుపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒక్క రతన్​ టాటా మినహా దేశంలోని ఓ పారిశ్రామిక వేత్త కరోనా విపత్కర పరిస్థితి మీద మాట్లాడలేదు.ఇక సినీ, రాజకీయ ప్రముఖులు సైతం మౌనంగా ఉన్నారు. మాస్కులు ధరించండి, భౌతికదూరం పాటించండి..అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వాలు చేతులెత్తేసినట్టే కనిపిస్తున్నది. ఇక కార్పొరేట్​ ఆస్పత్రులు మాత్రం తమ దైన పద్ధతిలో దోపిడీకి తెరలేపాయి. ఇటువంటి పరిస్థితుల్లో విదేశీ క్రికెటర్లు భారత్​కు సాయం ప్రకటించడం గొప్ప విషయమని నెటిజన్లు కొనియాడుతున్నారు.