Begin typing your search above and press return to search.

దసరాకు దుకాణం బంద్ యేనా? కేసీఆర్ 'జాతీయ పార్టీ' ఎప్పుడు?

By:  Tupaki Desk   |   27 Sep 2022 6:26 AM GMT
దసరాకు దుకాణం బంద్ యేనా? కేసీఆర్ జాతీయ పార్టీ ఎప్పుడు?
X
దేశ్ కీ నేత.. రాష్ట్రం దాటడం లేదు. దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేకులంతా వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలుస్తూ కారాలు మిరియాలు నూరిపోస్తున్నా.. 'సార్' మాత్రం గడపదాటడం లేదు. మొన్నటికి మొన్న ప్రెస్ మీట్లో ఈ దసరా తర్వాత నుంచి జాతీయ రాజకీయాల్లోకి.. కొత్త పార్టీ అంటూ కేసీఆర్ లీకులు ఇచ్చి ఇప్పుడు మళ్లీ సైలెంట్ అయ్యారు. ఎంతో ఊహించుకుంటే.. గులాబీ దళపతి ఇప్పుడు దసరాకు ఎలాంటి ఉలుకుపలుకూ లేకుండా ఉండడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.

కేసీఆర్ మౌనం అర్థంకాకుండా తయారైంది. అస్సలు కలిసిరాని కాలానికి ఎదురు వెళ్లడం కంటే మౌనంగా ఉండడమే బెటర్ అనుకొని కామ్ అయినట్టు తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశానికి అనుకూల పవనాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టడంతో కాంగ్రెస్ కు సత్తువ వస్తోంది. మోడీని వ్యతిరేకించే వారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు టర్న్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఇటీవలే బీహార్ వెళ్లి మరీ నితీష్ ను కలిసిన కేసీఆర్ కు ఇప్పుడు ఆయన 'హ్యాండ్' ఇచ్చాడు. హఠాత్తుగా రాహుల్, సోనియాలను కలుస్తానని.. కాంగ్రెస్ తో కలిసి సాగేందుకు నితీష్ రెడీ అయ్యారు. దీన్ని బట్టి నితీష్ ఇక థర్డ్ ఫ్రంట్ లో ఉండరు అని.. ఆయన బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్ లోనే ఉంటారని అర్థమవుతోంది.

ఇక మోడీ అంటేనే విరుచుకుపడే మమతా బెనర్జీ నోటి వెంట కూడా 'మోడీ మంచివారని.. ఈడీ, సీబీఐల దుర్వినియోగం వెనుక ఆయన హస్తం' లేదని సర్టిఫికెట్ ఇచ్చి పడేశారు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ ఓపెన్ గానే కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారు. కన్యాకుమారిలో మొదలుపెట్టిన రాహుల్ పాదయాత్రకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు.

కేజ్రీవాల్ మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయన పోరాటం పార్టీ విస్తరణ.. వివిధ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించి జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీని చేయడంపైనే ఉంది. ఆయన కేసీఆర్ తో కలిసి థర్డ్ ఫ్రంట్ పై ఆసక్తి చూపడం లేదు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ పార్టీని విస్తరించి అక్కడ బలంగా ముందుకెళుతున్నారు.

కేసీఆర్ వెంట ఉన్నది కేవలం కర్ణాటక నేత కుమారస్వామి ఒక్కరే. ఆయనకు కర్ణాటకలో పెద్ద ఫెయిత్ లేదు. కేవలం 40 సీట్లలోపే బలం ఉంది. ఆయనకు అక్కడ కాంగ్రెస్ లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోకుంటే గెలవలేడు. సో కేసీఆర్ తో కడవరకూ కష్టమే.

అందుకే దేశవ్యాప్తంగా అనుకూల పరిస్థితులు లేకపోవడం.. థర్డ్ ఫ్రంట్ పై ఎవరికి ఆసక్తి లేకపోవడంతో దసరా నుంచి మొదలుపెడుతానన్న కేసీఆర్ జాతీయ రాజకీయాలు మళ్లీ మొదటికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే మరోసారి మౌనం దాల్చినట్టు ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం బీజేపీని ఓడించాలంటే థర్డ్ ఫ్రంట్ కంటే.. కాంగ్రెస్ తో కలవడమే బెటర్ అని దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. అందుకే కేసీఆర్ కాంగ్రెస్ తో కలవకుండా.. ఇటు థర్డ్ ఫ్రంట్ పై ముందుకు వెళ్లలేక సతమతమవుతున్నట్టు తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.