Begin typing your search above and press return to search.

విభజన మాటకే వస్తే.. బీజేపీ తప్పుల్ని గుర్తు చేయాలా మోడీ?

By:  Tupaki Desk   |   9 Feb 2022 8:30 AM GMT
విభజన మాటకే వస్తే.. బీజేపీ తప్పుల్ని గుర్తు చేయాలా మోడీ?
X
అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తికి రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. అందుకు భిన్నంగా ఏదో ఒక కోణంలోనుంచి మాత్రమే విషయాల్ని చూసే వారి చేతిలో అధికారం ఉంటే ఏమవుతుందన్న ప్రశ్నకు.. ప్రధాని మోడీ నిలువెత్తు రూపంగా నిలుస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేందుకు మైకు తీసుకున్న ప్రధాని మోడీ.. తనకు తోచినట్లుగా మాట్లాడేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.

ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతల్ని చేపట్టిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయన ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ఇప్పుడీ రోజున విభజన కారణంగా ఏపీ నష్టపోయిందని.. అన్యాయంగా విభజన చేశారని.. విభజన చేసే తీరు ఇది కాదన్న మాటల్ని చెబుతున్న మోడీ.. ఇదంతా జరిగింది కేవలం ఎనిమిదేళ్ల క్రితమేనని.. అప్పట్లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాన్న విషయాన్ని మోడీ మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది.

ఎందుకంటే.. విభజన జరిగే నాటికి బీజేపీలో ఆయన ప్రభ వెలిగిపోవటమే కాదు.. తదుపరి ప్రధాన మంత్రి ఆయనే అన్న విషయాన్ని బీజేపీ డిసైడ్ చేయటం తెలిసిందే. విభజన జరిగిన తీరులో అంత తప్పులు దొర్లిన వేళ.. మాట్లాడకుండా మౌనంగా ఉన్న మోడీ ఏం చేసినట్లు? తప్పు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండి.. అదంతా జరిగిన ఎనిమిదేళ్లకు ఇప్పుడు గళం విప్పటం దేనికి నిదర్శనం? కాంగ్రెస్ మీద కోపంతోనో.. ఆ పార్టీ చేసిన తప్పుల్ని ఎత్తి చూపటం ద్వారా రాజకీయ లబ్థిని పొందటమే మోడీ లక్ష్యమన్న విషయం తెలిసిందే.

అలాంటిదేమీ లేకుంటే ఇప్పుడీ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం ఎందుకు ప్రస్తావిస్తారు? మరింత విచిత్రమైన విషయం ఏమంటే.. విభజన జరిగిన తీరు ఏ మాత్రం సరిగా లేదని చెప్పే మోడీ.. విభజన సందర్భంగా రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.. ఏపీకి జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రత్యేక హోదాను ఇస్తామన్న వరాన్ని ఇవ్వటాన్ని ఎందుకు మర్చిపోతారు? తన చేతిలో గత ప్రధానమంత్రి ఇచ్చిన వరాల్ని అమలు చేసే శక్తి ఉన్నప్పటికీ.. ఆ విషయాన్ని వదిలేసి.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడటంలో అర్థం లేదనే చెప్పాలి.

కాంగ్రెస్ తప్పులు చేసింది. అందుకే మోడీ చేతికి ప్రజలు అధికారం ఇచ్చారు. అసలుసిసలైన రాజకీయ నేత ఎవరైనా సరే.. తన చేతికి పాలనా పగ్గాలు ఇచ్చినప్పుడు గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని సరిదిద్ది.. ప్రజలకు సరైన మార్గదర్శనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పనిని చేయని ప్రధాని మోడీ.. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తప్పుల్ని మాత్రం ఎత్తి చూపితే సరిపోదు.

విభజన మీద మోడీ మాష్టారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు సరే. కాంగ్రెస్ తప్పుగా విభజన చేస్తున్నప్పుడు.. నాడు బీజేపీ ఏం చేసింది? మాట వరసకైనా చేతిన తప్పును ఎత్తి చూపిందా? పార్లమెంటులో ప్రశ్నించిందా? ఈ తరహా విభజనను తాము అంగీకరించమని కుండబద్ధలు కొట్టిందా? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే.. మోడీ మాష్టారు ప్రాతినిధ్యం వహించే బీజేపీ చేసిన తప్పుల చిట్టా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి.

అవన్నీ వదిలేసి.. కాంగ్రెస్ పార్టీని మాత్రమే దోషిగా నిలబెట్టటం అర్థం లేని పనిగా చెప్పక తప్పదు.