Begin typing your search above and press return to search.

బావ అభివృద్ధి ప‌నుల‌కు కేటీఆర్ ఫిదా!

By:  Tupaki Desk   |   7 Feb 2019 7:06 AM GMT
బావ అభివృద్ధి ప‌నుల‌కు కేటీఆర్ ఫిదా!
X
కేటీఆర్ - హ‌రీశ్ రావు.. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించారు. టీఆర్ ఎస్ లో కీల‌క నేత‌లుగా ఎదిగారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించాక ఏర్ప‌డిన తొలి మంత్రివ‌ర్గంలో మంత్రులుగా ప‌నిచేశారు. బావాబామ్మ‌ర్దులైన ఈ ఇద్ద‌రికీ అద్భుత వాక్చాతుర్యం ఉంది. గులాబీ ద‌ళం రెండోసారి అధికార పీఠ‌మెక్క‌డంలో కేసీఆర్ తో క‌లిసి వీరిద్ద‌రూ త‌మ వంతు పాత్ర పోషించారు.

అయితే - దాదాపు రెండు నెల‌లుగా ఈ ఇద్ద‌రి ప‌రిస్థితి ప‌ర‌స్ప‌రం భిన్నంగా క‌నిపిస్తోంది. టీఆర్ ఎస్ రెండో ద‌ఫా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేశాక కేటీఆర్ దూసుకెళ్తుండ‌గా, హ‌రీశ్ క్ర‌మంగా క‌నుమ‌రుగ‌వుతున్నాడ‌ని ప‌లువురు చెప్పుకుంటున్నారు. టీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా ఇటీవ‌ల కేటీఆర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. పార్టీ ప‌నుల‌ను మొత్తం తానే చూసుకుంటున్నారు. కీల‌క నాయ‌కులంతా దాదాపుగా ఆయ‌న గ్రిప్ లోకి వెళ్లిపోయారు. కుమారుడు కేటీఆర్ కు కేసీఆర్ పూర్తి స్వ‌తంత్ర‌త‌ను ఇచ్చేశారు.

హ‌రీశ్ మాత్రం కొంత‌కాలంగా రాజ‌కీయాల‌కు కాస్త దూరంగా ఉంటున్నాడు. అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం కొన్ని రోజులు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లిన ఆయ‌న‌.. తిరిగొచ్చాక కూడా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పెద్ద‌గా పాల్గొన‌లేదు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మ‌య్యాడు. దీంతో పార్టీలో హ‌రీశ్ ప్రాధాన్యం త‌గ్గిపోయింద‌ని వార్త‌లొచ్చాయి. కేటీఆర్‌-హ‌రీశ్ మ‌ధ్య దూరం పెరిగిపోయింద‌ని ఊహాగానాలు వెలువ‌డ్డాయి. హ‌రీశ్ ను కేసీఆర్‌, కేటీఆర్ ఏమాత్రం ఖాత‌రు చేయ‌డం లేద‌ని క‌థ‌నాలు వినిపించాయి.

ఈ వార్త‌లు, క‌థ‌నాల‌న్నీ ఊహాగానాలేని చాటిచెప్పేలా కేటీఆర్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గంలో హ‌రీశ్ రావు చేప‌ట్టిన అభివృద్ధి ప‌నుల‌ను ప్ర‌శంసించారు. హ‌రీశ్ హ‌యాంలో సిద్ధిపేట‌లో వ్య‌వ‌సాయ శాఖ అద్భుత హంగుల‌తో.. అత్యాధునిక సాంకేతిక‌త‌ల సాయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ఏర్పాటు చేసింది. రైతుల‌కు అది చాలా ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంది. సాధార‌ణ వ్య‌వ‌సాయ మార్కెట్ల‌లా అక్క‌డ అప‌రిశుభ్ర‌త ఏమాత్రం క‌నిపించ‌దు.

సిద్ధిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫొటోల‌ను హ‌రీశ్ తాజాగా ట్విటర్ లో షేర్ చేశారు. ఆయ‌న ట్వీట్ పై కేటీఆర్ స్పందించారు. 'అద్భుతంగా క‌నిపిస్తోంది. అభినంద‌న‌లు బావా'.. అంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్-హ‌రీశ్ మ‌ధ్య దూరం ఏమాత్రం పెర‌గ‌లేద‌ని.. వారిద్ద‌రి మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగుతున్నాయ‌ని చెప్పేందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.