Begin typing your search above and press return to search.

గంగా ఒడ్డున కాలు జారిన మోదీ..తప్పిన ప్రమాదం

By:  Tupaki Desk   |   15 Dec 2019 7:15 AM GMT
గంగా ఒడ్డున కాలు జారిన మోదీ..తప్పిన ప్రమాదం
X
ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్ వద్ద గంగానదిలో బోటుపై విహరించిన ప్రధాని నరేంద్ర మోదీ అంతకు కొద్ది ముందు కాలు జారిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. శనివారం కాన్పూర్ లోని గంగా అటల్ ఘాట్ వద్ద అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది. ఆ వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు - మోదీని పట్టుకుని లేపారు. ఘాట్ వద్ద ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆయన తూలి పడబోయారు. దాదాపు ఆయన కిందపడ్డారు. ముఖం నేలను తాకేలోగా ఆయన అంగరక్షకులు ఆయన్ను పట్టుకుని పైకి లేపారు. దీంతో ప్రమాదం తప్పింది.

'నమామి గంగే' ప్రాజెక్టులో భాగంగా గంగా కౌన్సిల్ సమావేశాన్ని కాన్పూర్ లో ఏర్పాటు చేయగా - దీనిలో పాల్గొనేందుకు పలువురు కేంద్ర మంత్రులతో పాటు - యూపీ - బీహార్ - ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. గంగా పరివాహక రాష్ట్రమే అయిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం హాజరుకాలేదు.

ఈ సమావేశం అనంతరం మోదీ పవిత్ర గంగానదిలో విహరించారు. ఉత్తర్‌ ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలతో పాటు ఎన్డీఏ మిత్రపక్ష నేతలు మోదీ వెంట ఉన్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ - ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ - బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ గంగానదిలో మోదీతో పాటు పర్యటించారు.

కాగా మోదీ తూలి పడబోయిన ఘటనను బీజేపీ వర్గాలు రహస్యంగా ఉంచినప్పటికీ అందుకు సంబంధించిన వీడియో మీడియా చేతికి చిక్కడంతో అక్కడి నుంచి అది సోషల్ మీడియాలోకి వచ్చింది.